Telugu Global
Health & Life Style

ఆరాం గా తినడమే ఆరోగ్యం

మనం ఎంత మంచి ఆహారం తింటున్నామో అనేది ఎంత ముఖ్యమో, ఎలా తింటున్నామనే విషయం కూడా అంతే ముఖ్యం. గాభరాగా , ఫాస్ట్‌గా తినడం వల్ల అసలు ఆహారంలో ఉండే పోషకాలు శరీరానికి అందవని నిపుణులు చెబుతున్నారు.

ఆరాం గా తినడమే ఆరోగ్యం
X

బిజిబిజీగా గడిపే జీవితంలో తినడానికి కూడా సమయం ఉండట్లేదు. సుఖంగా జీవించాలి అంటే సంపాదించాలనే ఆలోచనతో ఆడ, మగ అనే తేడా లేకుండా తరచూ బిజీ లైఫ్‌ను లీడ్ చేస్తున్నారు. అసలు తినడానికే టైం ఉండట్లేదంటూ ఏది దొరికితే అది.. కడుపునిండిందా లేదా అన్నదే ముఖ్యంగా గడిపేస్తుంటారు. కానీ మనం పనిచేసేదే పొట్ట నింపుకోవడానికి, ప్రశాంతంగా తృప్తిగా, తినడానికి. అలాంటిది అసలు తినడానికే సమయం లేకుండా గబగబా తినడం వల్ల నష్టాలే కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.


మనం ఎంత మంచి ఆహారం తింటున్నామో అనేది ఎంత ముఖ్యమో, ఎలా తింటున్నామనే విషయం కూడా అంతే ముఖ్యం. గాభరాగా , ఫాస్ట్‌గా తినడం వల్ల అసలు ఆహారంలో ఉండే పోషకాలు శరీరానికి అందవని నిపుణులు చెబుతున్నారు. ఆహారాన్ని ఎప్పుడు ప్రశాంతంగా కూర్చుని కాస్త సమయం కేటాయించి తినాలంటున్నారు. తినేటప్పుడు కేవలం తినే ఆహారం పైనే దృష్టి పెట్టాలట. ఆహారాన్ని నోటితో తీసుకుంటే నోటిలోనే సగం జీర్ణం అయ్యేలా తినాలంటారు. ఆహారాన్ని సరిగ్గా నమలకుండా త్వరగా తినడం వల్ల జీర్ణ సమస్యలు తలెత్తుతాయని చెబుతున్నారు. అదే గబగబా తినడం వల్ల ఆహారం మొత్తం నేరుగా జీర్ణాశయంలోకి వెళ్లి కడుపునొప్పి ప్రారంభమవుతుంది. ఆ తర్వాత యాసిడ్ రిలీజ్ అయి ఎసిడిటీకి దారి తీస్తుంది.


కొంతమంది ఎవరో వెనకాల నుంచి తరుముతున్నట్టుగా తినేస్తారు, తాగేస్తారు. ఇలా తినడం వల్ల సమయం ఆదా అవుతుందని అనుకుంటారు. సమయం కంటే ముఖ్యమైన ఆరోగ్యం మాత్రం తప్పక పాడవుతుంది. తొందరపాటుతో ఆహారం తీసుకోవడం వల్ల లాలాజలం సరిగ్గా కలిసిపోదు. ఇది కడుపు నొప్పి, ఉబ్బరం, అజీర్ణం, గ్యాస్, త్రేనుపు, మలబద్ధకం కలిగిస్తుంది.

వేగంగా తినడం వల్ల బరువు పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.బరువు పెరిగితే టైప్-2 మధుమేహం వచ్చే ప్రమాదం ఉంది. ఎందుకంటే త్వర త్వరగా తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. శరీరంలో చెడు కొలెస్ట్రాల్, దీని వల్ల గుండె సంబంధిత సమస్యలు కూడా పెరుగుతాయి. కాబట్టి ఆహారాన్ని వీలైనంత నెమ్మదిగా తినడానికి ప్రయత్నించండి. బాగా నమలండి. అప్పుడే మీ శరీరానికి పోషకాలు అందుతాయి. సమస్యలు లేకుండా చాలా ఆరోగ్యంగా ఉంటారు.

First Published:  17 April 2024 11:10 AM GMT
Next Story