Telugu Global
Health & Life Style

వైద్యాన్ని కొనుక్కునే ఈ పరిస్థితి ఎందుకొచ్చింది?

దశాబ్దం కాలంగా వైద్యం అనేది ఒక సర్వీస్‌లా కాకుండా అతిపెద్ద బిజినెస్ మోడల్‌గా ఎదిగింది. సామాన్యుడికి మంచి వైద్యం అనేది అందని ద్రాక్షగా మిగిలిపోయింది.

వైద్యాన్ని కొనుక్కునే ఈ పరిస్థితి ఎందుకొచ్చింది?
X

ప్రాణాలు కాపాడే డాక్టర్‌‌ను దేవుడిగా భావించే కల్చర్ మనదేశంలో కనిపిస్తుంది. అయితే ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవనే చెప్పాలి. దశాబ్దం కాలంగా వైద్యం అనేది ఒక సర్వీస్‌లా కాకుండా అతిపెద్ద బిజినెస్ మోడల్‌గా ఎదిగింది. సామాన్యుడికి మంచి వైద్యం అనేది అందని ద్రాక్షగా మిగిలిపోయింది. అలాగే డాక్టర్‌‌కు పేషెంట్లకు మధ్య తెలియని ఒక గ్యాప్ కూడా ఏర్పడింది. అసలు ఈ పరిస్థితి ఎందుకొచ్చింది? రాబోయే రోజుల్లో దేశంలో వైద్యవిధానం ఎలా ఉండబోతోంది?

‘హోటల్ పెట్టడానికి వంట రావాల్సిన అవసరం లేదు’ అన్నట్టుగా ‘ఒక హాస్పిటల్ ప్రారంభించడానికి వైద్యుడు కూడా అవసరం లేదు’ అన్న ధోరణి ఇప్పుడు బాగా కనిపిస్తుంది. అడ్వాన్స్‌డ్ , వరల్డ్ క్లాస్ హెల్త్ కేర్ పేరుతో వైద్యం అనేది ఒక బ్రాండెడ్ వస్తువుగా తయారైంది. కోట్ల పెట్టుబడితో పెడుతున్న హాస్పిటల్స్.. తిరిగి అవే కోట్లను ఆర్జించే దిశగా తమ బిజినెస్ మోడల్‌ను మార్చుకోవడం మనం గమనించొచ్చు.

ప్రాణానికి వెల కట్టలేమని, ఆరోగ్యం అనేది ఎంత ధర అయినా పలుకుతుంది అని గమనించిన కార్పొరేట్ సంస్థలు వరల్డ్ క్లాస్ హెల్త్ పేరుతో వైద్య రంగంలోకి అడుగుపెట్టాయి. 1990 ల నుంచి ఈ బిజినెస్ మరింత ఊపందుకుంది. చాలామంది వ్యాపారవేత్తలు, పెట్టుబడి దారులు వైద్యరంగాన్ని ఒక మనీ మేకింగ్ మేషీన్‌గా మార్చారు. వందల కోట్లలో పెట్టుబడులు పెట్టినప్పుడు తగిన లాభాలు రాబట్టుకోవాలి. కాబట్టి రోగానికి వైద్యం చేయడానికి బదులు టెస్ట్‌లు, సర్జరీలు, స్పెషల్ కేర్ యూనిట్లు, రూం ఛార్జీలు.. ఇలా రకరకాల విధానాలను తీసుకొచ్చారు. మొన్నటివరకూ లేని కొత్తకొత్త రోగాలను కూడా పరిచయం చేస్తున్నారు. మందుతో పోయే రోగానికి సర్జరీ చేసి అవయవం తీసివేయడమే సొల్యూషన్ అన్న ధోరణిని పెంచుతున్నారు.

తమ బిజినెస్‌ను పెంచుకోవడం కోసం కార్పొరేట్ సంస్థలు రకరకాల మార్కెటింగ్ వ్యూహాలు, అడ్వర్‌‌టైజ్‌మెంట్లను కూడా మొదలుపెట్టాయి. సమస్య వచ్చినప్పుడు రోగి డాక్టర్‌‌కు దగ్గరకు రావడం కాదు, డాక్టర్లే రోగులను వెతికే సంస్కృతిని అలవాటు చేశాయి. ఈ క్రమంలో ఉచిత వైద్య సిబిరాలు, ఫ్రీ బాడీ చెకప్‌ల వంటి పేర్లతో ప్రజలకు లేనిపోని భయాలు కల్పించి సమస్య ఉన్నట్టు అభద్రతా భావంలోకి నెట్టే ప్రయత్నాలు చేశాయి. ప్రమాదవశాత్తూ అవన్నీ ఫలించాయి. ఫలితంగా ఆరోగ్యం మీద ఒక తప్పుడు భయాన్ని క్రియేట్ చేశాయి. ఆరోగ్య భద్రత, మెడికల్ ఇన్సూరెన్స్ వంటి కొత్త పదాలను వెలుగులోకి తెచ్చాయి.

వైద్య రంగం కార్పొరేట్లు శాసిస్తున్నకారణంగా ఇప్పుడు సామాన్యుడికి సామాన్యమైన వైద్యం అందడం లేదు. గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స చేయగల సాధారణ అనారోగ్యాలకు కూడా జనాలు సిటీలకు పరుగులు పెట్టే పరిస్థితి వచ్చింది. ప్రతి చిన్న సమస్యకు వేలు ఖర్చు పెట్టి వైద్యం చేయించుకోవడం ఇప్పుడు సాధారణ విషయంగా మారింది. దీనికి ప్రభుత్వాల వైఫల్యం హెల్త్ కేర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యొక్క అసమర్థత కూడా కారణమే.

సాధారణంగా డాక్టర్‌‌కు పేషెంట్‌కు ఒకరిమీద ఒకరికి నమ్మకం ఉంటుంది. లక్షణాలను బట్టి వైద్యుడు స్వేచ్ఛగా ఒక నిర్ణయం తీసుకుంటాడు. రోగికి కూడా డాక్టర్ మీద ఉన్న నమ్మకం కారణంగానే రోగం సగం నయమయ్యేది. కానీ, కార్పొరేట్ జోక్యం కారణంగా ఈ తీరు మారింది. వైద్యాన్ని బిజినెస్‌గా చూసే పరిస్థితి వచ్చింది. కాబట్టి డాక్టర్ జవాబుదారీతనంతో వ్యవహరించాల్సి వస్తోంది. సమస్యను రుజువు చేయడం కోసం టెస్ట్‌లు తప్పనిసరి అయ్యాయి. టెస్ట్‌ల ఆధారంగానే మెడిసిన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సమస్య తగ్గినా తగ్గకపోయినా.. ‘టెస్ట్‌ల ప్రకారం ఇలా ఉంది కాబట్టి ఈ వైద్యం చేశాం. ఈ మందులు ఇచ్చాం. ఇక మేము చేసేది ఏమీ లేదు..’ అన్నట్టుగా తయారైంది వ్యవహారం. దీంతో డాక్టర్‌‌కు, పేషెంట్‌కు మధ్య గ్యాప్ ఏర్పడింది. రోగి కూడా మేము ఎంత ఎక్కువ చెల్లిస్తే అంత వైద్యం అన్న ధోరణికి అలవాటు పడ్డాడు.

అయితే కొంతమంది దేశభక్తి కలిగిన వైద్యులు.. క్లినిక్‌లు, చిన్న నర్సింగ్ హోమ్‌లు నడుపుతూ వైద్యాన్ని ఒక బాధ్యతగా అందిస్తున్నారు. ఈ తరహా క్లినిక్‌లన్నీ డాక్టర్, పేషెంట్ల మధ్య ఉండే విశ్వాసం మీదే నడుస్తాయి. అయితే ఇలాంటి చిన్న క్లినిక్‌ల వెన్ను విరుస్తూ ‘క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్’ వచ్చింది. ఇది ఆసుపత్రులకు పాశ్చాత్య ప్రమాణాలను తప్పనిసరి చేసింది. లైసెన్సింగ్, పలురకాల పర్మిషన్లు తీసుకోవాల్సి రావడం, వాటికోసం లంచాలు ఇవ్వాల్సి రావడం, కొన్ని మౌలిక పెట్టుబడులు పెట్టాల్సి రావడంతో అలాంటి డాక్టర్లు క్లినిక్‌లు నడపలేకపోతున్నారు. దాంతో వేలాది చిన్న ఆసుపత్రులు/క్లినిక్‌లు మూతపడుతున్నాయి. వైద్య నిపుణులు కావాలనుకుంటే వైద్యులు ఇప్పుడు కార్పొరేట్ ఆసుపత్రుల్లో చేరాలి. వైద్యుడు పెట్టుబడిదారుడి కింద పనిచేయాలి. బిల్లింగ్ లేదా హాస్పిటల్ విధానాలపై ప్రశ్నిస్తే ఉద్యోగంలోంచి తీసివేస్తారు. కార్పొరేట్ హాస్పిటల్స్‌లో డాక్టర్స్‌కు చెల్లించే మొత్తం ఆసుపత్రి బిల్లుల్లో 10 శాతం కంటే తక్కువ. దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు కార్పొరేట్ వైద్యం అనేది ఏ బిజినెస్ మోడల్‌పై నడుస్తుందో. అయితే ఈ పరిస్థితుల్లో కూడా ప్రోటోకాల్‌కు చిక్కకుండా రోగులకు సహాయం చేసే డాక్టర్లు అక్కడక్కడా కనిపిస్తారు.

ఇక మెడికల్ ఇన్సూరెన్స్ విషయానికొస్తే.. ఇప్పడది మోసపూరిత దశలో ఉంది. చాలామంది అసలైన రోగులకు ఇన్సూరెన్స్ రిజెక్ట్ చేయబడుతుంది. ఇన్సూరెన్స్ కవరేజ్‌ల్లో దుర్వినియోగమే ఎక్కువగా జరుగుతుంది. హాస్పిటళ్లు, మెడిక్లెయిమ్ కంపెనీల మధ్య ఉండే లాబీయింగ్‌ల వల్ల చిన్న క్లినిక్‌లు, డాక్టర్లు, పేషెంట్లే ఎక్కువగా నష్టపోతున్నారు.

ఇక డాక్టర్ల విషయానికొస్తే.. కార్పొరేట్‌లకు తక్కువ జీతాలతో పనిచేసే నిపుణులు అవసరం. కాబట్టి మెరిట్‌తో పనిలేకుండా డాక్టర్ పట్టా ఉంటే చాలన్నట్టు వ్యవహరిస్తుంటాయి. దీంతో ప్రభుత్వ వైద్య కళాశాలలు, సీట్లను పెంచడానికి బదులుగా ప్రైవేట్ వైద్య విద్య ప్రోత్సహించబడింది. ప్రజల్లో కూడా మెరిట్ ఎలా ఉన్నా డాక్టర్ మాత్రం కావాలి అన్న కోరిక బలంగా పెరిగింది. దీంతో నాణ్యమైన డాక్టర్ల సంఖ్య కూడా తగ్గిందనే చెప్పాలి.

ఏదేమైనా ఇప్పుడున్న కార్పొరేట్ వైద్య విధానం వల్ల అటు వైద్యులు, ఇటు పేషెంట్లు ఇద్దరూ నష్టపోతున్నారు. పేషెంట్లు క్రమంగా వైద్యాన్ని కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడడం మొదలుపెట్టారు. మెరుగైన ట్రీట్మెంట్‌కు బదులుగా హాస్పిటల్స్‌లో సౌకర్యాలు, విలాసాల వంటివాటినే ఆశిస్తున్నారు. ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం పనిచేయాలనే ఆలోచన ఉన్న చాలామంది వైద్య నిపుణులు కార్పొరేట్ కల్చర్‌‌ను తట్టుకోలేక వృత్తిని విడిచిపెడుతున్నారు. మొత్తంగా మెరుగైన వైద్యం సామాన్యుడికి దూరమైన తర్వాత, వైద్య వృత్తికి గౌరవం పోయిన తర్వాత, వైద్యులకు ప్రజలకు మధ్య చీలికలు సృష్టించిన తర్వాత చివరిగా లభపడుతున్నది కార్పొరేట్లు, బీమా సంస్థల కంపెనీలు మాత్రమే. ఈ పరిస్థితి ఎప్పటికి మారుతుందో చూడాలి.

First Published:  23 March 2024 12:40 PM GMT
Next Story