Telugu Global
Health & Life Style

వర్షాకాలంలో చర్మ సమస్యలు రావొద్దంటే..

జిడ్డు చర్మం ఉన్నవాళ్లు వర్షాకాలంలో టోనర్‌ వాడొచ్చు. కాఫీ, చార్‌‌కోల్, ఆల్కహాల్‌, గ్రీన్‌టీ ఎక్స్‌ట్రాక్ట్‌లున్న టోనర్‌లను వాడితే ఈ సీజన్‌లో మంచిది.

వర్షాకాలంలో చర్మ సమస్యలు రావొద్దంటే..
X

వర్షాకాలంలో చర్మ సమస్యల బెడద ఎక్కువగా ఉంటుంది. ఈ సీజన్‌లో వాతావరణంలో తేమ పెరగడం వల్ల ముఖం జిడ్డుగా మారడం, మొటిమలు రావడం ఎక్కువ అవుతుంది. ఇలాంటి సమస్యలు రాకుడందంటే వానాకాలంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటంటే..

వర్షాకాలంలో చర్మం పొడిబారకుండా ఉండేందుకు సహజమైన నూనెలు రాస్తుండాలి. గ్లిజరిన్ ఉండే సబ్బుల వాడకం తగ్గించాలి. గాఢత తక్కువ ఉండే ఫేస్ వాష్, క్లెన్సర్లు వాడాలి.

వర్షాకాలంలో తరచుగా చర్మాన్ని ఎక్స్‌ఫోలియేషన్ లేదా స్క్రబ్‌ చేయడం మంచిది. అలా చేయడం వల్ల చర్మంపై మృత కణాలు తొలగి, చర్మరంధ్రాల్లో మలినాలు పోతాయి. చర్మం ఎప్పుడూ తాజాగా ఉంటుంది.

వర్షాకాలంలో మేకప్‌ వేసుకోకపోవడమే మేలు. వాతావరణంలో ఉండే తేమ కారణంగా మేకప్‌ ఈజీగా చెదిరిపోతుంది. దానివల్ల లుక్ అంతా పాడవుతుంది. కాబట్టి ఈ సీజన్‌లో చర్మ రంధ్రాలు మూసుకు పోయేలా మేకప్ వేయడాన్ని తగ్గించాలి. మాయిశ్చరైజర్, లిప్ బామ్ వంటివి లేదా తేలికపాటి మేకప్ లాంటివి వేసుకుంటే చాలు.

మొటిమలు ఉన్నవాళ్లు కలబంద గుజ్జు, ఓట్స్, శాండల్ వుడ్ పౌడర్ వంటి వాటితో ఫేస్ ప్యాక్స్ వేసుకోవచ్చు. వేడి నీటిలో లవంగం నూనె వేసి పదినిమిషాల పాటు ఆవిరి పట్టుకోవచ్చు. ఇలా చేయడం వల్ల చర్మంపై టాక్సిన్స్ తొలగిపోతాయి.

జిడ్డు చర్మం ఉన్నవాళ్లు వర్షాకాలంలో టోనర్‌ వాడొచ్చు. కాఫీ, చార్‌‌కోల్, ఆల్కహాల్‌, గ్రీన్‌టీ ఎక్స్‌ట్రాక్ట్‌లున్న టోనర్‌లను వాడితే ఈ సీజన్‌లో మంచిది. రోజ్ వాటర్‌‌తో కూడా టోనింగ్ చేసుకోవచ్చు. ఇక వీటితో పాటు వర్షాకాలం మంచి చర్మ సౌందర్యం కోసం విటమిన్ `సీ` తీసుకోవాలి. `సీ` విటమిన్ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. స్కిన్ ఇన్ఫెక్షన్లతో పోరాడటంలో సాయపడుతుంది.

First Published:  18 July 2023 9:31 AM GMT
Next Story