Telugu Global
Health & Life Style

వర్షాకాలం కీళ్లనొప్పులు వస్తుంటే ఇలా చేయండి!

వానాకాలం వచ్చిందంటే చాలామందిలో కీళ్ల నొప్పులు మొదలవుతుంటాయి. వాతావరణంలోని మార్పులు కొందరిలో కీళ్ల నొప్పులకు కారణమవుతాయని డాక్టర్లు చెప్తున్నారు.

వర్షాకాలం కీళ్లనొప్పులు వస్తుంటే ఇలా చేయండి!
X

వర్షాకాలం కీళ్లనొప్పులు వస్తుంటే ఇలా చేయండి!

వానాకాలం వచ్చిందంటే చాలామందిలో కీళ్ల నొప్పులు మొదలవుతుంటాయి. వాతావరణంలోని మార్పులు కొందరిలో కీళ్ల నొప్పులకు కారణమవుతాయని డాక్టర్లు చెప్తున్నారు. మరి వీటిని తగ్గించుకునేదెలా? డాక్టర్లు ఏం చెప్తున్నారు?

వర్షాకాలంలో వర్షం రావడానికి ముందు వాతావరణంలో గాలి పీడనం తగ్గుతుంది. అప్పుడు శరీరం మీద కూడా పీడనం తక్కువగా ఉంటుంది. దీనివల్ల కొందరిలో కండరాలు, కీళ్లు, కీళ్ల చుట్టూ ఉండే ఇతర కణజాలాలు వ్యాకోచిస్తాయి. దీంతో కీళ్ల మీద ఒత్తిడి పెరిగి నొప్పికి దారితీస్తుందని నిపుణుల పరిశోధనలో తేలింది. ఇప్పటికే కీళ్లనొప్పులు, ఇతర దీర్ఘకాల నొప్పులతో బాధపడేవారికి ఈ ఇబ్బంది మరింత ఎక్కువగా ఉంటుంది. మరి ఇలాంటప్పుడు ఏం చేయాలంటే..

నొప్పుల గురించి ఎక్కువ ఆలోచిస్తే అవి మరింత ఎక్కువవుతాయని డాక్టర్లు చెప్తున్నారు. వర్షాకాలం వచ్చినప్పుడే నొప్పి మొదలవుతుంటే అది పీడనంలో మార్పు వల్ల వచ్చిన నొప్పి అని అర్థం చేసుకోవాలి. వాతావరణం సర్దుకున్నాక పీడనం తగ్గి, నొప్పులు తగ్గుతాయి.

వానలు పడుతున్నప్పుడు చాలామంది ఇంట్లోనే ఎక్కువ సమయం గడుపుతారు. అలా ఎక్కువసేపు కదలకుండా కూర్చోవడం వల్ల కండరాలు, కీళ్లు బిగుసుకుపోయి నొప్పి మొదలవ్వొచ్చు. కాబట్టి బయటకు వెళ్లటం కుదరకపోతే ఇంట్లోనైనా అటుఇటు నడుస్తుండాలి. వాకింగ్, జాగింగ్, త్రెడ్ మిల్ వంటివి చేయాలి.

రోజూ వ్యాయామం చేయడం వల్ల కండరాలు, కీళ్లు, ఎముకలు ధృడంగా మారి కీళ్ల మీద ఒత్తిడి తగ్గుతుంది. తద్వారా నొప్పులు కూడా తగ్గుముఖం పడతాయి.

ఒంట్లో నీటి శాతం తగ్గినప్పుడు కూడా కీళ్లు బిగుసుకుంటాయి. కాబట్టి వానాకాలంలో తగినంత నీరు తాగాలి. ఎప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉండడాన్ని అలవాటు చేసుకోవాలి.

బరువు పెరిగితే కీళ్లు, ఎముకల మీద ఎక్కువ భారం పడుతుంది. కాబట్టి నొప్పులు పెరిగే అవకాశం ఉంది. అందుకే నొప్పులు ఉన్నవాళ్లు వీలైనంత త్వరగా బరువు తగ్గే ప్రయత్నం చేయాలి.

ఇక నొప్పులు మరీ వేధిస్తుంటే వేడి కాపడం పెట్టుకోవచ్చు. గోరు వెచ్చటి నీటిలో బట్టను ముంచి నొప్పి ఉన్న చోట అద్దాలి. అలాగే గోరు వెచ్చటి నీటితో స్నానం చేసినా కూడా ఉపశమనం లభిస్తుంది.

First Published:  1 Aug 2023 5:47 AM GMT
Next Story