Telugu Global
National

ఆవుని చంపిన పులిపై ప్రతీకారం తీర్చుకున్న రైతు

తన ఆవును చంపేశాయన్న పగతోనే పులిని చంపేయటం కోసం కావాలనే అలా చేశానని ఒప్పుకున్నాడు. దీంతో ఆవు యజమాని శేఖర్‌ను అటవీ అధికారులు సోమ‌వారం అదుపులోకి తీసుకున్నారు.

ఆవుని చంపిన పులిపై ప్రతీకారం తీర్చుకున్న రైతు
X

పెంపుడు జంతువులను పులో, సింహమో పొట్టన పెట్టుకుంటే బాధతో పాటు కోపం రావటం సహజం. కానీ, ఏం చెయ్యలేక.. కొద్ది రోజులు బాధపడి తరువాత ఆ ఘటన మరచిపోతారు చాలామంది.. కానీ, తన ఆవును ఓ పులి చంపేసిందని కోపంతో ర‌గిలిపోయిన ఒక రైతు ఆ పులిపైనే ప్రతీకారం తీర్చకున్న ఘటన తమిళనాడులోని నీల్‌గిరి జిల్లాలో జ‌రిగింది.


పది రోజుల క్రితం ఓ రైతు ఆవు మేత కోసం అడవిలోకి వెళ్లింది. అది తిరిగి రాకపోవడంతో వెతుక్కుంటూ ఆ రైతే అడవికి వెళ్లాడు. అక్కడ అతడికి చనిపోయిన తన ఆవు కనిపించింది. అది చూడగానే అతనికి దు:ఖంతో పాటు కోపం పొంగుకొచ్చింది. తన ఆవును చంపిన పులి మీద పగ తీర్చుకోవాలనుకున్నాడు. ఆవు కళేబరానికి పురుగుల మందు రాసి దాన్ని అక్కడే వదిలేసి వచ్చాడు. 2 రోజుల తరువాత ఆ రైతు కోరుకున్నట్టుగానే రెండు పులులు మరణించాయి.




శనివారం నాడు ఒక నీటి కుంటలో మూడు, ఎనిమిదేళ్ల వయసున్న రెండు పులులు మృతి చెందినట్లు సమాచారం అందుకున్న అధికారులు అవి ఎలా చనిపోయాయని విచారిస్తుండగా సమీపంలో ఓ ఆవు కళేబరాన్ని గుర్తించారు. వెంటనే వారు ఆ మూడు కళేబరాన్ని టెస్టింగ్ కు పంపించారు. వాటిలో పురుగుల మందు అవశేషాలు గుర్తించారు. అనుమానంతో ఆవు యజమానిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. దీంతో అతను అసలు విషయాన్ని బయటపెట్టాడు.


తన ఆవును చంపేశాయన్న పగతోనే పులిని చంపేయటం కోసం కావాలనే అలా చేశానని ఒప్పుకున్నాడు. దీంతో ఆవు యజమాని శేఖర్‌ను అటవీ అధికారులు సోమ‌వారం అదుపులోకి తీసుకున్నారు. చనిపోయిన వాటిలో మూడేళ్లు ఉన్న ఒక పులి శరీరం మీద గాయాలు ఉండటంతో ఎనిమిదేళ్లున్న పులి చిన్న పులిపై దాడి చేసి చంపి ఉంటుందని భావిస్తున్నారు. ఏది ఏమైనా రెండింటిలో ఒక పులి మరణానికి మాత్రం శేఖర్ ఉపయోగించిన విషమే కారణమని భావిస్తున్న పోలీసులు అతనిని అరెస్ట్ చేశారు.

First Published:  12 Sep 2023 8:48 AM GMT
Next Story