Telugu Global
National

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల అజెండా విడుదల.. ఉభయ సభల ముందుకు ఏడు బిల్లులు

దేశవ్యాప్తంగా ఇటీవల చర్చనీయాంశం అయిన పలు బిల్లులపై మాత్రం కేంద్ర ఎలాంటి ప్రకటన చేయలేదు.

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల అజెండా విడుదల.. ఉభయ సభల ముందుకు ఏడు బిల్లులు
X

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఈ నెల 18 నుంచి 22 వరకు నిర్వహించనున్నారు. నూతన పార్లమెంట్ భవనంలో జరుగనున్న ఈ సమావేశాలకు సంబంధించిన ఎజెండాను తాజాగా లోక్‌సభ, రాజ్యసభ సచివాలయాలు వేర్వేరుగా విడుదల చేశాయి. పార్లమెంట్ సమావేశాలు ఉంటాయని ప్రకటించినా.. కేంద్ర ప్రభుత్వం మాత్రం అజెండాను విడుదల చేయలేదు. ఎజెండా విడుదల చేయాలని కాంగ్రెస్ పార్టీ ఎంపీ సోనియా గాంధీ కూడా లేఖ రాశారు. ఈ నేపథ్యంలో 18వ తేదీన మొదలయ్యే సమావేశాల అజెండాను విడుదల చేశారు. తొలి రోజు పాత పార్లమెంట్ భవనంలో సమావేశాలు ప్రారంభమై.. ఆ తర్వాత నూతన పార్లమెంట్ భవనంలో సమావేశాలు కొనసాగించనున్నారు.

తొలి రోజైన 18న జరిగే సమావేశంలో 75 ఏళ్ల భారత పార్లమెంటరీ ప్రస్థానంపై చర్చ జరుగనున్నది. భారత్ సాధించిన ఘనతలు, అనుభవాలు, జ్ఞాపకాలు, నేర్చుకున్న అంశాలు ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఆగస్టు 10న కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈసీ), ఎన్నికల కమిషనర్ల నియామకాలను నియంత్రించేలా కేంద్రం కొత్త బిల్లును ప్రవేశపెట్టింది. నియామక ప్యానెల్‌లో ప్రధాన మంత్రి, లోక్‌సభ ప్రతిపక్ష నేత, ప్రధాని నామినేట్ చేసిన కేంద్ర కేబినెట్ మంత్రి ఒకరు ఉంటారని బిల్లులో పేర్కొన్నారు. అంతే కాకుండా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా (సీజేఐ)ను తొలగిస్తున్నట్లు పేర్కొన్నారు. దీంతో ఈ నియమక ప్రక్రియ వివాదాస్పదమైంది. తాజాగా ఈ బిల్లును ప్రభుత్వం ఆమోదించే అవకాశం ఉన్నది.

ఈ బిల్లుతో పాటు ముఖ్యమైన మరో నాలుగు బిల్లులను సభలో ప్రవేశపెట్టి ఆమోదించే అవకాశం ఉన్నది. ది అడ్వొకేట్స్ (అమెండ్‌మెంట్) బిల్లు, ద ప్రెస్ అండ్ రిజస్ట్రేషన్ ఆఫ్ పిరియాడిక్స్ బిల్లుల గురించి కూడా చర్చ జరుగుతుందని తెలుస్తున్నది. ఈ బిల్లులను ఆగస్టు 3న రాజ్యసభలో ఆమోదించారు. ఇక ద పోస్టాఫీస్ -2023 బిల్లు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉన్నది. కాగా, ఈ జాబితా తాత్కాలికమే అని.. మరిన్ని అంశాలను చేర్చే అవకాశం ఉన్నట్లు బులిటెన్‌లో పేర్కొన్నారు. లోక్‌సభలో నాలుగు కీలక బిల్లులు ప్రవేశపెట్టనుండగా.. రాజ్యసభలో మూడు బిల్లులను ఆమోదింప చేసుకోవాలని కేంద్రం భావిస్తోంది.

దేశవ్యాప్తంగా ఇటీవల చర్చనీయాంశం అయిన పలు బిల్లులపై మాత్రం కేంద్ర ఎలాంటి ప్రకటన చేయలేదు. ఉమ్మడి పౌరస్మృతి బిల్లు, దేశం పేరు మార్పు, జమిలి ఎన్నికలు తదితర కీలక బిల్లులపై కేంద్ర ప్రస్తావించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. కేంద్ర ప్రభుత్వం వ్యూహాత్మంగానే పలు బిల్లుల ప్రస్తావన అజెండాలో తీసుకొని రాలేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అవన్నీ రహస్య ఎజెండాలో చేర్చిందనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి.

సాధారణ సమావేశాల్లో కూడా ఆమోదం పొందే ఈ ఏడు బిల్లుల కోసం ప్రత్యేక సమావేశాలు నిర్వహించాల్సిన అవసరం ఏముందనే అనుమానాలు తలెత్తుతున్నాయి. గతంలో కూడా తొలుత ప్రస్తావించకుండా పలు బిల్లులను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన సందర్భాలు ఉన్నాయిని గుర్తు చేస్తున్నారు. కొన్ని బిల్లులను రహస్య ఎజెండాలో భాగంగా ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయనే చర్చ జరుగుతున్నది.

First Published:  13 Sep 2023 11:48 PM GMT
Next Story