Telugu Global
National

పిల్లులతో వాయు కాలుష్యం.. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ విచారణ

కోల్‌కతాలోని ఒక అపార్ట్‌ మెంట్‌ వాసులు పిల్లుల బాధ తప్పించాలంటూ NGTని ఆశ్రయించారు. ఆ అపార్ట్ మెంట్ లో ఓ ఫ్లాట్ యజమాని దాదాపు 45 పిల్లులను పెంచుతున్నాడు. వాటికి ఆహారం పెడుతూ తన ఫ్లాట్ లోనే ఉంచుకుంటాడు, కొన్ని పిల్లులు కారిడార్ లోనే తిరుగుతుంటాయి.

పిల్లులతో వాయు కాలుష్యం.. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ విచారణ
X

నీటి పారుదల ప్రాజెక్ట్ ల విషయంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ పేరు చాలాసార్లు మనం వినే ఉంటాం. NGT విచారణ చేసే కేసులు ఆ స్థాయిలో ఉంటాయని అనుకుంటే పొరపాటే. NGT చరిత్రలోనే తొలిసారిగా ఓ వింత కేసు ఇప్పుడు బెంచ్ ముందుకొచ్చింది. ఆ కేసు తేల్చేందుకు ఏకంగా త్రిసభ్య కమిటీని నియమించింది NGT.

ఏంటా కేసు..?

కోల్‌కతాలోని ఒక అపార్ట్‌ మెంట్‌ వాసులు పిల్లుల బాధ తప్పించాలంటూ NGTని ఆశ్రయించారు. ఆ అపార్ట్ మెంట్ లో ఓ ఫ్లాట్ యజమాని దాదాపు 45 పిల్లులను పెంచుతున్నాడు. వాటికి ఆహారం పెడుతూ తన ఫ్లాట్ లోనే ఉంచుకుంటాడు, కొన్ని పిల్లులు కారిడార్ లోనే తిరుగుతుంటాయి. వీటి వల్ల తీవ్రమైన దుర్వాసన రావడంతోపాటు వాటి జుట్టు, విసర్జన పదార్థాలు, శరీరం నుంచి వచ్చే వ్యర్థాలతో ఆ ప్రాంతం అంతా అపరిశుభ్రంగా తయారైపోయింది. సహజంగా ఇలాంటి కేసులు కార్పొరేషన్ అధికారులు డీల్ చేస్తారు, ఆ ఫ్లాట్ లో ఉన్న వ్యక్తికి కౌన్సెలింగ్ ఇచ్చి దారిలో పెడతారు. కానీ ఈ కేసు ఏకంగా NGT వరకు వెళ్లడం విశేషం.

పిల్లుల వల్ల వాయు కాలుష్యం ఏర్పడిందని ఆరోపిస్తూ ముందుగా అపార్ట్ మెంట్ వాసులు స్థానిక పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి ఫిర్యాదు చేశారు.. ఫలితం లేదు. ఆ తర్వాత కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్‌ ను సంప్రదించారు. అక్కడా సమాధానం లేదు. దీంతో వారు నేరుగా కోల్‌కతాలోని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ బెంచ్‌ని ఆశ్రయించారు.

గ్రీన్ ట్రిబ్యునల్ ముందుకు ఇలాంటి కేసు రావడం ఇదే తొలిసారి. దీంతో వారు కూడా ఏం చేయాలో తేల్చుకోలేకపోయారు. చివరకు.. పశ్చిమ బెంగాల్ కాలుష్య నియంత్రణ మండలి సీనియర్ శాస్త్రవేత్త, కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్‌ సీనియర్ అధికారి, గరియాహత్ పోలీస్ స్టేషన్ ఇన్‌ ఛార్జ్ అధికారితో కూడిన కమిటీని విచారణ కోసం ఏర్పాటు చేసింది NGT. వాస్తవాలు తెలుసుకోవాలని పంపించింది. వారం లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఆగస్ట్ 17కు ఈ కేసు విచారణ వాయిదా వేసింది.

పిల్లి ప్రేమికుల వాదన ఇదీ..

పిల్లులు వాయు కాలుష్యానికి కారణమవుతాయని చెప్పడానికి శాస్త్రీయ ఆధారాలు లేవని, కానీ పిల్లి విసర్జక పదార్థాల వల్ల అక్కడి ప్రదేశాలు పాడవుతున్నాయని అనుకుంటే యజమానికి చెప్పవచ్చని, పిల్లులు.. ఎలుకల్ని చంపి తింటాయి కాబట్టి వాటి వల్ల మేలే కానీ, కీడు జరగదని అంటున్నారు కోల్‌కతాలోని పిల్లి ప్రేమికులు. వారంతా ఈ కేసు విషయంలో సీరియస్‌గా ఉన్నారు. పిల్లులతో వాయు కాలుష్యం అంటూ అపార్ట్ మెంట్ వాసులు NGTకి ఫిర్యాదు చేయడాన్ని వారు తప్పుపడుతున్నారు.

First Published:  21 July 2022 1:58 AM GMT
Next Story