Telugu Global
National

కేర‌ళ సీఎం కుమార్తెపై మనీలాండరింగ్‌ కేసు

ఎప్పుడో 2018 నాటి కేసును బ‌య‌టికి తీసి, ఇప్పుడు వీణా విజ‌య‌న్‌పై ఈడీ కేసు పెట్ట‌డం కూడా వేధింపులేన‌న్న విమ‌ర్శ‌లు మొద‌ల‌య్యాయి.

కేర‌ళ సీఎం కుమార్తెపై మనీలాండరింగ్‌ కేసు
X

ఎన్నిక‌ల సీజ‌న్ మొద‌ల‌యింది. మ‌రోవైపు ప్ర‌తిప‌క్ష నేత‌లు, వారి కుటుంబ స‌భ్యుల‌పై కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌లు పంజా విస‌రడం ప్రారంభించాయి. మ‌ద్యం కుంభ‌కోణంలో తెలంగాణ‌లో బీఆర్ఎస్ నాయ‌కురాలు క‌విత‌, ఢిల్లీలో ఆప్ జాతీయ క‌న్వీన‌ర్‌, ఆ రాష్ట్ర సీఎం కేజ్రీవాల్ అరెస్టులు క‌ల‌క‌లం రేపాయి. ఇప్పుడు ఆ జాబితాలో కేర‌ళ సీఎం పిన‌ర‌యి విజ‌య‌న్ కుమార్తె వీణా విజ‌య‌న్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్(ఈడీ) మనీ లాండరింగ్‌ కేసు న‌మోదు చేసింది.

కొచ్చిన్ మిన‌ర‌ల్స్ అండ్ రూటైల్ లిమిటెడ్ అనే సంస్థ వీణా విజ‌య‌న్‌కు చెందిన ఎక్సా లాజిక్ సొల్యూష‌న్స్ కంపెనీకి 2018- 19 మ‌ధ్య అక్ర‌మంగా రూ.1.72 కోట్లు చెల్లించిన‌ట్లు ఈడీ గుర్తించింది. ఎక్సా లాజిక్ నుంచి ఎలాంటి సేవ‌లు పొంద‌కుండానే ఆ మొత్తాన్ని చెల్లించడం మనీ లాండరింగ్‌లో భాగ‌మేన‌న్న‌ది ఈడీ అభియోగం. దీనిపై కేంద్ర కార్పొరేట్ వ్య‌వ‌హారాల మంత్రిత్వ శాఖ‌ ఆధ్వ‌ర్యంలోని సీరియ‌స్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేష‌న్ ఆఫీస్(ఎస్ఎఫ్ఐవో) ఈడీకి కొన్ని రోజుల కింద‌ట కంప్ల‌యింట్ చేసింది. దాన్ని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్న ఈడీ వీణా విజ‌య‌న్‌తో పాటు మ‌రికొంద‌రిపైనా మనీలాండరింగ్‌ ప్రివెన్ష‌న్ యాక్ట్ (పీఎంఎల్ఏ) కింద కేసులు న‌మోదు చేసింది.

ఎన్నిక‌ల ముందే ఎందుకు?

నేరాలు, ఆర్థిక అవ‌క‌త‌వ‌క‌లు ఇలా ర‌క‌ర‌కాల అంశాల‌పై స‌రిగ్గా ఎన్నిక‌ల ముందే ఈడీ, ఫెమా లాంటి సంస్థ‌లు కేసులు పెడుతుండ‌టం రాజ‌కీయంగా ర‌క‌ర‌కాల విశ్లేష‌ణ‌ల‌కు దారితీస్తోంది. కేజ్రీవాల్‌, క‌విత‌ల‌ను మద్యం కేసులో స‌రిగ్గా ఎన్నిక‌ల స‌మ‌యంలోనే ఎందుకు అరెస్టు చేశారంటూ ఇప్ప‌టికే ప్ర‌తిప‌క్షాలు నిల‌దీస్తున్నాయి. ఎప్పుడో 2018 నాటి కేసును బ‌య‌టికి తీసి, ఇప్పుడు వీణా విజ‌య‌న్‌పై ఈడీ కేసు పెట్ట‌డం కూడా వేధింపులేన‌న్న విమ‌ర్శ‌లు మొద‌ల‌య్యాయి.

First Published:  27 March 2024 2:08 PM GMT
Next Story