Telugu Global
National

ఇస్కాన్‌ సంచలనం.. మేనకాపై రూ.100 కోట్ల పరువు నష్టం

మేన‌కా చేసిన వ్యాఖ్యలు ఎంతో బాధ కలిగించాయని.. అందుకే పరువు నష్టం దావా వేస్తున్నట్లు ఇస్కాన్‌ వైస్ ప్రెసిడెంట్‌ రాధార‌మ‌ణ్ దాస్ స్పష్టం చేశారు.

ఇస్కాన్‌ సంచలనం.. మేనకాపై రూ.100 కోట్ల పరువు నష్టం
X

ఇస్కాన్‌-ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్‌నెస్‌పై కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ మేనకా గాంధీ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ వ్యాఖ్యలపై ఇస్కాన్‌ సంస్థ తీవ్రంగా స్పందించింది. మేన‌కా గాంధీకి రూ.100 కోట్ల పరువు నష్టం దావా నోటీసులు పంపించింది. మేన‌కా చేసిన వ్యాఖ్యలు ఎంతో బాధ కలిగించాయని.. అందుకే పరువు నష్టం దావా వేస్తున్నట్లు ఇస్కాన్‌ వైస్ ప్రెసిడెంట్‌ రాధార‌మ‌ణ్ దాస్ స్పష్టం చేశారు.

ఇటీవల ఇస్కాన్‌పై మేనకా గాంధీ ఆరోపణలు చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఈ వ్యాఖ్యలు ఎప్పుడు, ఎక్కడా చేశారనేది క్లారిటీ లేదు. దీంతో ఈ వ్యాఖ్యలపై ఇస్కాన్ ప్రతినిధులు మండిపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా గోమాతలను రక్షించేందుకు ఎన్నో చర్యలు చేపడుతున్నామన్నారు. మేన‌కా ఆరోపణలు నిరాధారమైనవని కొట్టిపారేశారు.

అసలు మేనకా గాంధీ ఏమన్నారంటే.. ఇస్కాన్ సంస్థ దేశ ప్రజల్ని మోసం చేస్తోంది. గోశాలలను ఏర్పాటు చేసి వాటి నుంచి బాగా సంపాదిస్తోంది. ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున నిధులు తెచ్చుకుంటోంది. భూములనూ సంపాదించుకుంటోంది. ఆ తరవాత ఆ గోశాలల్లోని ఆవులను కసాయివాళ్లకి అమ్మేస్తోంది. ఈ మధ్యే ఏపీలోని అనంత‌పురం గోశాలకు వెళ్లాను. అక్కడ ఒక్క ఆవు కూడా ఆరోగ్యంగా లేదు. ఒక్క దూడ కూడా కనిపించలేదు. అంటే ఆవులను కసాయివాళ్లకు అమ్ముతున్నారనేగా అర్థం. ఇస్కాన్ అమ్మినంతగా దేశంలో మరెవరూ ఆవుల్ని ఇలా అమ్ముకోరు. కానీ మళ్లీ వాళ్లే రోడ్లపైకి వచ్చి హరే రామ హరే కృష్ణ అని భజనలు చేస్తారు. మేన‌కా చేసిన ఈ వ్యాఖ్యలే ఇప్పుడు వివాదాస్పదమయ్యాయి.

First Published:  29 Sep 2023 3:03 PM GMT
Next Story