Telugu Global
National

ద‌త్తాత్రేయ పీఠం కానున్న ద‌ర్గా

17వ శతాబ్దానికి చెందిన బాబా బుడాన్ దర్గాను దత్తాత్రేయ క్షేత్రంగా మార్చే ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి. ఈ దర్గా దత్తాత్రేయ పీఠం అని హిందువులు భావిస్తారు. ఈ దర్గాను ముస్లింలతో పాటు హిందువులు కూడా సందర్శిస్తారు.

ద‌త్తాత్రేయ పీఠం కానున్న ద‌ర్గా
X

చరిత్రను తిరగ రాయడమే కాకుండా ఇతర మతాలకు చెందిన ప్రార్థనా స్థలాలను, దర్గాలను కూడా హిందూ గుళ్లు గోపురాలుగా మార్చడానికి కర్నాటకలోని బీజేపీ ప్రభుత్వం కంకణం కట్టుకుంది. 17వ శతాబ్దానికి చెందిన బాబా బుడాన్ దర్గాను దత్తాత్రేయ క్షేత్రంగా మార్చే ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి. ఈ దర్గా దత్తాత్రేయ పీఠం అని హిందువులు భావిస్తారు. ఈ దర్గాను ముస్లింలతో పాటు హిందువులు కూడా సందర్శిస్తారు. ఆ మాటకొస్తే హిందువులు దర్గాలకు వెళ్లడం కొత్తేమీ కాదు. కానీ దాన్ని ఏకంగా హిందూ దేవాలయంగా మార్చేయడానికి కర్నాటక ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఆందోళన కలిగిస్తున్నాయి. కర్నాటక బీజేపీ ప్రభుత్వం ఇటీవల విద్వేష రాజకీయాల జోరు పెంచింది. హిజాబ్ రగడ ఆ రాష్ట్రంలోనే మొదలైంది.

బాబా బుడాన్ దర్గాను హిందూ ఆలయంగా మలచడానికి బీజేపీ ప్రభుత్వం కొత్త ఎత్తుగడ అనుసరిస్తోంది. విభిన్న తాత్విక వ్యవస్థల నుండి ప్రయోజనకరమైన వాటిని స్వీకరించే మిషన్‌తో ఆ దర్గా స్వరూపాన్నే మార్చేయాలని ప్రయత్నిస్తోంది. ఈ దర్గా నిర్వహణ కోసం ఒక పాలక వర్గాన్ని నియమిస్తామని ప్రతిపాదించింది. అక్కడ ఒక అర్చకుడిని, ఒక ముజవ్వర్ (ఫకీర్ లాంటి వ్యక్తి) ను కూడా నియమిస్తారట. అయితే అక్కడ హిందూ ఆగమ శాస్త్ర ప్రకారం పూజాదికాలు జరగాలంటున్నారు.

ఈ పాలనా కమిటీ సభ్యులుగా ఉండడానికి నలుగురు హిందువుల, నలుగురు ముస్లింల పేర్లు ప్రతిపాదించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ ఎనిమిది మందిలో ఇద్దరు మహిళలు, ఒక దళిత, ఒక గిరిజన వ్యక్తులు సభ్యులుగా ఉంటారట. పైకి చూడడానికి ఇది అత్యంత ప్రజాస్వామ్య ప్రక్రియగా కనిపిస్తున్నప్పటికీ క్రమంగా దీని హిందూ, ముస్లిం సమానత్వ స్వభావాన్ని నిర్మూలించాలన్నది అసలు ఉద్దేశం. అప్పుడు అది పూర్తిగా దత్తత్రేయ దేవాలయంగా మారి పోతుంది.

అధికారికంగా దీనిని శ్రీ గురు దత్తాత్రేయస్వామి బాబా బుడాన్ దర్గా అంటారు. ఈ దర్గా పశ్చిమ కనుమల్లో దాదాకి పహాడ్ (కొండ) మీద ఉంది. దాదా అంటే సూఫీ సన్యాసి దాదా హయాత్ మీర్ ఖలందర్. చరిత్రను పరిశీలిస్తే బాబా బుడాన్ దర్గా అన్న పేరే విస్తృత ప్రచారంలో ఉంది. ఆయన 17వ శతాబ్దంలో యెమెన్ నుంచి వచ్చారంటారు. ఆయన కాఫీ తోటల పెంపకాన్ని ప్రవేశ పెట్టారు. కాఫీ తోటల పెంపకం అప్పటి నుంచే అలవటైంది అంటారు.

హయాత్ మీర్ ఖలందర్ ను హిందూ, ముస్లిం మతాలకు చెందిన అణగారిన వర్గాల వారు ఆరాధించడం మొదలైంది. ఆయన మరణం తరువాత దర్గా వెలిసింది. 1792 నాటి చారిత్రక ఆధారాల ప్రకారం టిప్పు సుల్తాన్ ఈ క్షేత్రానికి మడులు మాన్యాలు ఇచ్చారు. ఆ తరువాత బ్రిటిష్ వారూ ఆ విధానాన్ని కొనసాగించారు. బ్రిటిష్ ప్రభుత్వ, మైసూరు ప్రభుత్వ రికార్డులను పరిశీలిస్తే స్వాతంత్ర్యానికి ముందు ఈ దర్గాను ఇస్లాం మతానికి చెందిన షా ఖాద్రీ కుటుంబం వారు నిర్వహించే వారని స్పష్టం అవుతుంది.

First Published:  23 Aug 2022 3:04 AM GMT
Next Story