Telugu Global
National

నెహ్రూ ముని మనవడితో కలిసి నడిచిన‌ గాంధీ ముని మనవడు

రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో ఈ రోజు మహాత్మా గాంధీ మునిమనవడు తుషార్ గాంధీ పాల్గొన్నారు. మహారాష్ట్ర‌లోని షెగావ్‌లో తుషార్ గాంధీ రాహుల్ తో చేయి కల్పి నడిచారు.

నెహ్రూ ముని మనవడితో కలిసి నడిచిన‌ గాంధీ ముని మనవడు
X

మహాత్మా గాంధీ ముని మనవడు తుషార్ గాంధీ, రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు. ఈ ఉదయం మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలోని షెగావ్‌లో తుషార్ గాంధీ భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీతో చేయి కలిపి నడిచారు.

నవంబర్ 7న‌ మహారాష్ట్రలో ప్రవేశించిన ఈ యాత్ర, ఈ రోజు ఉదయం 6 గంటలకు అకోలా జిల్లాలోని బాలాపూర్ లో ప్రారంభమై కొన్ని గంటల తర్వాత షెగావ్ చేరుకుంది, అక్కడ రచయిత, కార్యకర్త తుషార్ గాంధీ జోడో యాత్రలో పాల్గొన్నారు.

తన జన్మస్థలం షెగావ్ అని తుషార్ గాంధీ గురువారం ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు.

'నేను 18న షెగావ్‌లో భారత్ జోడో యాత్రలో పాల్గొంటాను. షెగావ్ నా జన్మస్థలం కూడా. మా అమ్మ ప్రయాణిస్తున్న హౌరా మెయిల్ రైలు, 1960 జనవరి 17న షెగావ్ స్టేషన్‌లో ఆగిపోయింది. అప్పుడే నేను పుట్టాను.'' అని పోస్ట్‌లో పేర్కొన్నాడు.

భారత్ జోడో యాత్రలో తుషార్ గాంధీ పాల్గొనడం "చారిత్రకమైనది" అని కాంగ్రెస్ ప్రశంసించింది.

జవహర్‌లాల్ నెహ్రూ, మహాత్మాగాంధీ ల ముని మనవళ్లు రాహుల్ గాంధీ, తుషార్ గాంధీలను ఆ ఇద్దరు దివంగత నాయకుల వారసత్వ వాహకాలుగా ఆ పార్టీ అభివర్ణించింది.

" ప్రస్తుత పాలకులు ప్రజాస్వామ్యాన్ని ముప్పులోకి నెడుతున్న తరుణంలో ఈ ఇద్దరు కలిసి నడవడం ప్రజాస్వామ్యాన్ని అంతం చేయడానికి తాము అనుమతించబోమని పాలకులకు ఇస్తున్న సందేశం" అని కాంగ్రెస్ పార్టీ ఒక ప్రకటనలో పేర్కొంది.

ఈ యాత్రలో ఈ రోజు తుషార్ గాంధీతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేతలు ముకుల్ వాస్నిక్, దీపేందర్ హుడా, మిలింద్ దేవరా, మాణిక్‌రావ్ ఠాక్రే, ముంబై కాంగ్రెస్ అధ్యక్షుడు భాయ్ జగ్తాప్, పార్టీ రాష్ట్ర శాఖ చీఫ్ నానా పటోలే లు రాహుల్ గాంధీ వెంట నడిచారు.

ఈ సాయంత్రం షెగావ్‌లో జరిగే బహిరంగ సభ‌లో రాహుల్ గాంధీ ప్రసంగించనున్నారు. భారత్ జోడో యాత్ర మహారాష్ట్రలో చివరి దశలో ఉంది. ఈ యాత్ర నవంబర్ 20వ తేదీన మధ్యప్రదేశ్‌లో ప్రవేశించనుంది.

First Published:  18 Nov 2022 9:18 AM GMT
Next Story