Telugu Global
National

కోట్లు ఖర్చు పెట్టినా తేలని ఓబీసీ లెక్కలు

ఆఫీస్ ఖర్చుల విషయంలోనే అంతులేని గోల్ మాల్ జరిగిందనే అనుమానాలు బలపడుతున్నాయి. 2021 ఆగస్ట్ నుంచి ఇప్పటి వరకు ఆఫీస్ ఖర్చులకు సంబంధించిన రికార్డ్ లు లేవని కేంద్రం చేతులెత్తేసింది. ఆర్టీఐ దరఖాస్తుకి సమాధానమిస్తూ ఆ రికార్డులు తమ వద్ద లేవని పేర్కొంది.

కోట్లు ఖర్చు పెట్టినా తేలని ఓబీసీ లెక్కలు
X

ప్రజా ధనంతో వేసే కమిటీలకు జమాఖర్చులు ఉండాల్సిందే. అయితే కేంద్రం మాత్రం ఓబీసీ వర్గీకరణ కమిటీ ఖర్చులకు లెక్కలు చూపించకుండా చేతులెత్తేసింది. రెండేళ్లపాటు ఆఫీస్ ఖర్చులకు సంబంధించిన రికార్డ్స్ లేవని చెప్పేసింది. సమాచార హక్కు ద్వారా కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కళ్లకు కట్టినట్టయింది.

ఓబీసీ వర్గీకరణకోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఇంతవరకు తుది నివేదిక ఇవ్వలేదు. రైటైర్డ్ జడ్జి రోహిణి ఈ కమిటీకి నేతృత్వం వహిస్తున్నారు. ఈ కమిటీని 2017లో ఏర్పాటు చేశారు, 12వారాల గడువు విధించారు. ఆలోగా పని ముందుకు సాగకపోవడంతో అప్పటినుంచి ఇప్పటి వరకు గడువు పెంచుకుంటూ పోయారు. ఏకంగా 14సార్లు పొడిగించారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. జస్టిస్ రోహిణితోపాటు పలువురు అధికారులు ఇందులో సభ్యులుగా ఉన్నారు. వీరితోపాటు కన్సల్టెంట్ల సేవలు కూడా వినియోగించుకుంటున్నారు. ఇంతమందికి జీతాలకోసం ఇప్పటి వరకు అయిన ఖర్చు అక్షరాలా రూ.3,75,53,250 కన్సల్టెంట్లకోసం రూ.26,04,775 ఖర్చు చేసినట్లు అధికారిక లెక్కలున్నాయి. ఆర్టీఐ ద్వారా ఈ సమాచారం బయటకొచ్చింది.

పోనీ ఇంతవరకు లెక్కలున్నాయనుకుందాం. అయితే ఆఫీస్ ఖర్చుల విషయంలోనే అంతులేని గోల్ మాల్ జరిగిందనే అనుమానాలు బలపడుతున్నాయి. 2017 అక్టోబర్ నుంచి 2021 ఆగస్ట్ మధ్య ప్యానెల్ సభ్యుల ఆఫీస్ ఖర్చుల కింద 7.2 లక్షల రూపాయలు లెక్క రాశారు. ఆ తర్వాత మాత్రం ఆ లెక్కలు రాయడమే మానేశారు. 2021 ఆగస్ట్ నుంచి ఇప్పటి వరకు ఆఫీస్ ఖర్చులకు సంబంధించిన రికార్డ్ లు లేవని కేంద్రం చేతులెత్తేసింది. ఆర్టీఐ దరఖాస్తుకి సమాధానమిస్తూ ఆ రికార్డులు తమ వద్ద లేవని పేర్కొంది.

ఓబీసీ వర్గీకరణకోసం ఏర్పాటు చేసిన కమిటీకి 14సార్లు గడువు పొడిగించడమే కాకుండా ఇప్పటి వరకు జీతభత్యాల కింద దాదాపు 4.02కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. దీనికి ఆఫీస్ ఖర్చులు అదనం. ఆ ఆఫీస్ ఖర్చులకి కూడా ఇప్పుడు లెక్కలు లేవు. ఓ రిటైర్డ్ జడ్జితో వేసిన కమిటీ విషయంలోనే కేంద్రం ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందా అనే ఆరోపణలు వినపడుతున్నాయి. 12 వారాల్లోగా నివేదిక ఇవ్వాలని వేసిన కమిటీ.. ఆరేళ్లవుతున్నా ఎందుకు సైలెంట్ గా ఉంది. కోట్ల రూపాయల జీతాలు తీసుకుంటూ కమిటీ సభ్యులు చేస్తున్నదేంటి..? సామాన్య ప్రజలకు వచ్చే అనుమానాలివి. లెక్కలు చూపించడంలేదు సరే, కనీసం వీటికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా కేంద్రానికి లేదా..?

First Published:  24 May 2023 6:32 AM GMT
Next Story