Telugu Global
National

ప్లీజ్ యోగీజీ, మమ్ములను ఈ 'బాయ్ కాట్' ల బాధల నుంచి కాపాడమని మోడీకి చెప్పండి -బాలీవుడ్ ప్రముఖుల విజ్ఞప్తి

బాలీవుడ్‌లో 99 శాతం మంది డ్రగ్స్ తీసుకోరని, ప్రజలకు చేరువ కావడానికి కష్టపడి పనిచేయడంపై దృష్టి సారిస్తారని, అందుకే ట్రెండింగ్‌లో ఉన్న #BoycottBollywood అనే క్యాంపెన్ ను జరగకుండా చూడాలని సునీల్ షెట్టి యోగీ ఆదిత్యానాథ్ ను కోరారు.

ప్లీజ్ యోగీజీ, మమ్ములను ఈ బాయ్ కాట్ ల బాధల నుంచి కాపాడమని మోడీకి చెప్పండి -బాలీవుడ్ ప్రముఖుల విజ్ఞప్తి
X

ఈ మధ్య బాలీ వుడ్ మూవీ ఏది వచ్చినా బైకాట్ పిలుపులు మామూలయిపోయాయి. బాలీవుడ్ లో అందరూ డ్రగ్స్ తీసుకుంటారనే ప్రచారం కూడా జరుగుతోంది. అలాగే కొందరైతే బైకాట్ బాలీవుడ్ అంటూ క్యాంపెయిన్ సాగిస్తున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో బైకాట్ క్యాంపెన్ చేయడం, నిరసన ప్రదర్శనలు చేయడం, పోస్టర్లను చించడం, థియేటర్ల మీద దాడులు చేయడం , హత్యలు చేస్తామని బెదిరింపులకు దిగడం వంటివి తరచుగా జరుగుతున్నాయి. తాజాగా పఠాన్ మూవీపై నిరసన ప్రదర్శనలు మొదలయ్యాయి. సోషల్ మీడియాలో బైకాట్ క్యాంపెన్ కూడా సాగుతోంది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ ప్రముఖులు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యానాథ్ తో సమావేశమయ్యారు.

ఉత్తరప్రదేశ్ లో సినిమా రంగాన్ని అభివృద్ది పర్చడంలో భాగంగా, బాలీవుడ్ ను యూపీకి తరలించాలనే ఆలోచనతో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ముంబైలో పర్యటిస్తున్నారు. ఆయన పలువురు బాలీవుడ్ ప్రముఖులతో ముచ్చటించారు.

ఈ సమావేశానికి సునీల్ శెట్టి, రవి కిషన్, జాకీ భగ్నాని, జాకీ ష్రాఫ్, రాజ్‌పాల్ యాదవ్, సోనూ నిగమ్, బోనీ కపూర్, సుభాష్ ఘయ్ సహా ఇతర ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సునీల్ షెట్టి మాట్లాడుతూ...

బాలీవుడ్‌లో 99 శాతం మంది డ్రగ్స్ తీసుకోరని, ప్రజలకు చేరువ కావడానికి కష్టపడి పనిచేయడంపై దృష్టి సారిస్తారని, అందుకే ట్రెండింగ్‌లో ఉన్న #BoycottBollywood అనే క్యాంపెన్ ను జరగకుండా చూడాలని కోరారు.

"ఈ హ్యాష్‌ట్యాగ్ తీసివేయాలి. బుట్టలో కుళ్ళిన ఆపిల్ ఉండవచ్చు, కానీ అందరం అలా కాదు. మన కథలు, మన సంగీతాన్ని ప్రపంచ ప్రజలందరూ ఆదరిస్తున్నారు. కాబట్టి ఈ కళంకం తొలగించాల్సిన అవసరం ఉంది. దయచేసి ఈ సందేశాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కి తెలియజేయండి'' అని యోగీ ఆదిత్యానాథ్ కు విజ్ఞప్తి చేశారు.

కాగా, ఉత్తరప్రదేశ్‌లో విద్యపై దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని ప్రముఖ దర్శకుడు సుభాష్ ఘయ్ నొక్కి చెప్పారు.

"మీరు మౌలిక సదుపాయాల గురించి మాట్లాడతారు, ఇది మంచి విషయమే, కానీ విద్య కూడా పరిశీలించాల్సిన ముఖ్యమైన అంశం. UP బయటి నుండి ప్రతిభను వెతకాల్సిన అవసరం లేదు." అని ఘాయ్ అన్నారు.

First Published:  6 Jan 2023 6:53 AM GMT
Next Story