Telugu Global
National

పంజాబ్ లో కల్తీ మద్యం కలకలం.. 21మంది మృతి

ఇథనాల్ కలిపిన కల్తీ మద్యం సేవించిన 40 మంది సమీప ఆస్ప‌త్రుల్లో చేరారు. అందులో మార్చి 20 బుధవారం నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. గురువారం పాటియాలాలోని రాజింద్ర ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ మరో నలుగురు మరణించారు. శుక్రవారం మరో 8 మంది, శనివారం ఐదుగురు చనిపోయారు.

పంజాబ్ లో కల్తీ మద్యం కలకలం.. 21మంది మృతి
X

పంజాబ్‌ రాష్ట్రంలోని సంగ్రూర్‌ జిల్లాలో కల్తీ మద్యం వ్యవహారం కలకలం రేపుతోంది. కల్తీ మద్యం సేవించి పదుల సంఖ్యలో ఆస్ప‌త్రుల్లో చేరుతున్నారు. వారిలో ఇప్పటి వరకూ 20 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.

వివరాలలోకి వెళితే.. ఇథనాల్ కలిపిన కల్తీ మద్యం సేవించిన 40 మంది సమీప ఆస్ప‌త్రుల్లో చేరారు. అందులో మార్చి 20 బుధవారం నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. గురువారం పాటియాలాలోని రాజింద్ర ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ మరో నలుగురు మరణించారు. శుక్రవారం మరో 8 మంది, శనివారం ఐదుగురు చనిపోయారు. దీంతో కల్తీ మద్యం కారణంగా మరణించిన వారి సంఖ్య 21కి పెరిగినట్లు సంగ్రూర్‌ చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ తెలిపారు. కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే కల్తీ మద్యం కారణంగా 20 మంది ప్రాణాలు కోల్పోవడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ విషయంపై కేసు నమోదు చేసిన పోలీసులు 200 లీటర్ల ఇథనాల్, 156 మద్యం బాటిళ్లు, 130 కల్తీ మద్యం సీసాలు, లేబుల్ లేని 80 సీసాలు, 4,500 ఖాళీ సీసాలు, బాట్లింగ్ మెషిన్లను స్వాధీనం చేసుకున్నారు. రానున్న లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాంతంలో నకిలీ మద్యం విక్రయాలు ప్రారంభించిన ముఠా సభ్యులు నలుగురు వ్యక్తులు ఒక మహిళను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. బాధితులలో ప్రస్తుతం 11 మంది పాటియాలాలోని రాజింద్ర ఆస్పత్రిలో, ఆరుగురు సంగ్రూర్‌లోని సివిల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.



ఈ ఘటనకు సంబంధించి అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ర్యాంక్ అధికారి నేతృత్వంలో నలుగురు సభ్యులతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ మొత్తం వ్యవహారాన్ని ప్రొఫెషనల్, సైంటిఫిక్‌ పద్ధతుల్లో వెలికితీసేందుకు ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు.



గతంలో కూడా పంజాబ్ రాష్ట్రంలో కల్తీ మద్యం సేవించి పలువురు ప్రాణాలు కోల్పోయిన ఘటన చోటుచేసుకుంది. ఏప్రిల్ 2023లో సంగ్రూర్‌లో నకిలీ మద్యం తాగి ముగ్గురు వ్యక్తులు మరణించారు. అదేవిధంగా 2020 ఆగస్టులో రాష్ట్రంలోని మూడు జిల్లాల్లో లూథియానాకు చెందిన ఓ దుకాణం తయారు చేసిన మద్యం తాగి ఏకంగా 112 మంది ప్రాణాలు కోల్పోయారు.

First Published:  23 March 2024 10:52 AM GMT
Next Story