Telugu Global
National

రాహుల్ గాంధీ.. రెండు దోసకాయలు.. ఓ అవ్వ.. ఏమిటి ఆ స్టోరీ!

ఓ అవ్వ.. రాహుల్ దగ్గరకు వచ్చి రెండు దోసకాయలు (కీరా దోస) చేతిలో పెట్టింది. ఇంత కంటే విలువైన వస్తువు నేను నీకు ఇవ్వలేను అని చెప్పింది.

రాహుల్ గాంధీ.. రెండు దోసకాయలు.. ఓ అవ్వ.. ఏమిటి ఆ స్టోరీ!
X

రాహుల్ గాంధీ ప్రస్తుతం భారత్ జోడో యాత్ర పేరుతో పాదయాత్ర చేస్తున్నారు. కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో జోడో యాత్రకు అనూహ్య స్పందన లభించింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగుతున్న యాత్రకు భారీగా జనాలు వస్తున్నారు. సామాన్య ప్రజలు రాహుల్ గాంధీతో కలిసి నడవటానికి, తమ సమస్యలు చెప్పుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. చిన్నారుల నుంచి ముసలి వారి వరకు రాహుల్‌ను దగ్గర నుంచి చూడాలని కోరుకుంటున్నారు. రాహుల్ గాంధీ చేస్తున్న భారత్ జోడో యాత్రకు సంబంధించి నిత్యం ఎన్నో ఫొటోలు సోషల్ మీడియాలో కనపడుతున్నాయి. అయితే రాహుల్.. చేతిలో రెండు దోసకాయలు పట్టుకొని, పక్కన ఉన్న అవ్వను దగ్గర తీసుకున్న ఫొటో విపరీతంగా వైరల్ అయ్యింది. అయితే ఆ ఫొటో వెనుక ఉన్న స్టోరీ ఏంటో తెలిసి కాంగ్రెస్ అభిమానులు ఉద్వేగానికి లోనవుతున్నారు.

రాహుల్ గాంధీ కర్ణాటకలోని బళ్లారి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తుండగా ఓ అవ్వ అతడిని కలవడానికి ప్రయత్నించింది. ముందు సెక్యూరిటీ ఆమెను వారించినా.. రాహుల్ చూసి అవ్వను పిలిచాడు. ఆమె రాహుల్ దగ్గరకు వచ్చి రెండు దోసకాయలు (కీరా దోస) చేతిలో పెట్టింది. ఇంత కంటే విలువైన వస్తువు నేను నీకు ఇవ్వలేను అని చెప్పింది. ఇది నేను మీ నానమ్మకు బాకీ పడిన దానికి చెల్లించుకుంటున్న బహుమతి అని ఉద్వేగంగా అన్నది. అయితే రాహుల్ గాంధీకి ఆమె అన్న మాటలు అర్థం కాలేదు. కాసేపటి వరకు పక్కనే నవ్వుతూ నడిచాడు. ఆ తర్వాత ఆ అవ్వ చెప్పిన పూర్తి స్టోరీ విని ఉద్వేగానికి గురయ్యాడు.

'మాది చాలా నిరుపేద కుటుంబం. మాకు రెండెకరాల పొలం ఉన్నది. దాంట్లోనే సేద్యం చేసి జీవనం కొనసాగిస్తున్నాము. ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో భూ సంస్కరణలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్న తర్వాత మాకు ఆ రెండెకరాల పొలం దక్కింది. ఆ పొలంలో పండిన దోసకాయలనే ఇప్పుడు తీసుకొచ్చి నీకు ఇచ్చాను' అని అవ్వ చెప్పింది. నేను ఇంత కంటే విలువైన బహుమతి ఇవ్వలేనని కంట తడి పెట్టుకున్నది. అవ్వ మాటలకు రాహుల్ కూడా ఉద్వేగానికి గురయ్యాడు. ఆమెను గట్టిగా హత్తుకున్నాడు. అవ్వ రాహుల్ గాంధీని దీవించి వెళ్లిపోయింది. రాహుల్ ఆ దోసకాయలను చేతిలో పట్టుకొని ముందుకు కదిలాడు. ఆ రోజు అక్కడ జరిగిన సంఘటన మొత్తాన్ని కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ ప్రతాప్‌గర్హి ట్విట్టర్‌లో షేర్ చేశారు. దీంతో ఆ ఫొటోతో సహా కథనం వైరల్‌గా మారింది.

First Published:  19 Oct 2022 6:45 AM GMT
Next Story