Telugu Global
National

ఢిల్లీ లిక్కర్ కేసులో సంచలనం.. కేజ్రీవాల్ అరెస్టు

లిక్కర్ పాలసీ కేసులో విచారణకు రావాలని కేజ్రీవాల్‌కు 9 సార్లు సమన్లు జారీ చేసింది ఈడీ. ఐతే ఈ విచారణలకు కేజ్రీవాల్ డుమ్మా కొట్టారు. మరోవైపు అరెస్టు నుంచి మినహాయించాలని కేజ్రీవాల్ హైకోర్టును ఆశ్రయించగా..అరెస్టు నుంచి మినహాయించేందుకు హైకోర్టు నిరాకరించింది.

ఢిల్లీ లిక్కర్ కేసులో సంచలనం.. కేజ్రీవాల్ అరెస్టు
X

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సంచలనం చోటు చేసుకుంది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఆయన నివాసంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్టు చేశారు. దాదాపు రెండు గంటల పాటు ఆయన నివాసంలో సోదాలు నిర్వహించిన అధికారులు కేజ్రీవాల్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేజ్రీవాల్‌ అరెస్టుతో ఢిల్లీలో నిఘాను పటిష్టం చేశారు పోలీసులు. డ్రోన్లతో శాంతిభద్రతలను పర్యవేక్షిస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ కేసులో ఇప్పటికే ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్టయ్యారు. గత వారం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆమె ఈడీ రిమాండ్‌లో ఉన్నారు.

మొత్తం 12 మంది అధికారులతో కూడిన ఈడీ బృందం ఇవాళ సాయంత్రం కేజ్రీవాల్ ఇంటికి చేరుకుంది. ఈడీ అధికారుల రాకతో కొద్దిసేపు కేజ్రీవాల్ ఇంటి దగ్గర హైడ్రామా నడిచింది. అనంతరం ఇంటి లోపలికి వెళ్లిన అధికారులు దాదాపు రెండు గంటల పాటు సోదాలు చేశారు. కేజ్రీవాల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కేజ్రీవాల్‌ను రాత్రి 9 గంటల 11 నిమిషాలకు అరెస్టు చేసినట్లు ప్రకటించారు. మరోవైపు కేజ్రీవాల్‌ అరెస్టుపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఆప్‌ నేతలు. ఐతే ఈ పిటిషన్ రేపు అనగా శుక్రవారం విచారణకు రానుంది.

లిక్కర్ పాలసీ కేసులో విచారణకు రావాలని కేజ్రీవాల్‌కు 9 సార్లు సమన్లు జారీ చేసింది ఈడీ. ఐతే ఈ విచారణలకు కేజ్రీవాల్ డుమ్మా కొట్టారు. మరోవైపు అరెస్టు నుంచి మినహాయించాలని కేజ్రీవాల్ హైకోర్టును ఆశ్రయించగా..అరెస్టు నుంచి మినహాయించేందుకు హైకోర్టు నిరాకరించింది. ప్రస్తుతం ఈ కేసు పురోగతి దృష్ట్యా ఇందులో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. కోర్టు ఇలా చెప్పిన గంటల వ్యవధిలోనే ఈడీ అధికారులు కేజ్రీవాల్‌ ఇంటికి చేరుకుని ఆయనను అదుపులోకి తీసుకున్నారు. కేజ్రీవాల్‌ అరెస్టయినప్పటికీ ఆయనే సీఎంగా కొనసాగుతారని, జైలు నుంచే పాలన కొనసాగిస్తారని ఆప్‌ వర్గాలు చెప్తున్నాయి. మరోవైపు లోక్‌సభ ఎన్నికల ముందు బీజేపీ పెద్ద కుట్రకు తెరలేపిందని ఆప్ వర్గాలు ఆరోపిస్తున్నాయి.

First Published:  22 March 2024 2:15 AM GMT
Next Story