Telugu Global
National

దక్షిణ భారతదేశంలో తొలి వందేభారత్ రైలు నేడే ప్రారంభం

చెన్నై నుంచి మైసూరు వరకు నడిచే వందేభారత్ రైలును ఈ రోజు ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. ఇది దక్షిణాదిలో మొదటి సెమీ-హై-స్పీడ్ రైలు.

దక్షిణ భారతదేశంలో తొలి వందేభారత్ రైలు  నేడే ప్రారంభం
X

ద‌క్షిణ భార‌త‌దేశంలోనే మొద‌టి వందే భారత్ రైలు మైసూరు - చెన్నై మధ్య శుక్ర‌వారం నుంచి నడవనుంది. ఇది రెండు న‌గ‌రాల మ‌ధ్య ప్రయాణ సమయాన్ని భారీగా త‌గ్గిస్తుంది.

భారతదేశ ఐదవ వందే భారత్ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం బెంగళూరు నుండి జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఇది దక్షిణాదిలో మొదటి సెమీ-హై-స్పీడ్ రైలు. ఈ రైలు మైసూరు - చెన్నై మధ్య నడుస్తుంది. ఈ రోజు మాత్రం ఈ రైలు కెఎస్‌ఆర్ బెంగళూరు రైల్వే స్టేషన్ నుంచి బ‌య‌లుదేరి చెన్నైకి చేరుకుంటుంది.

కొత్త వందే భారత్ రైలులో విశేషాలివే:

* చెన్నై నుండి మైసూర్ వెళ్లే ప్రయాణీకులకు కారు కుర్చీకి టికెట్ ధ‌ర రూ. 1,200లు, ఎగ్జిక్యూటివ్ క్లాస్ టికెట్ ధ‌ర 2,295గా నిర్ణ‌యించారు; మైసూర్ నుండి చెన్నైకి ప్రయాణించేందుకు టికెట్ ధ‌ర‌లు వరుసగా రూ.1,365లు, రూ.2,486 చెల్లించాల్సి ఉంటుంది.

*ఈ రైలు 6 గంటల 30 నిమిషాల్లో 500 కి.మీల గ‌మ్యాన్ని చేరుకుంటుంద‌ని, చెన్నై -మైసూరు మధ్య కాట్పాడి‍, బెంగ‌ళూరు..ఈ రెండు స్టాప్‌లలో మాత్ర‌మే ఆగుతుందని రైల్వే అధికారులు తెలిపారు. శనివారం నుంచి ఈ రైలు సాధారణ కార్యకలాపాలు ప్రారంభమవుతాయి.

*ఈ రైలును చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF) అభివృద్ధి చేసింది. సెక‌న్ల‌లోనే వేగాన్ని అందుకోవ‌డానికి, తగ్గించడానికి అనువుగా ఇంటెలిజెంట్ బ్రేకింగ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు.

* అన్ని కోచ్‌లలో ఆటోమేటిక్ డోర్లు, GPS-ఆధారిత ఆడియో-విజువల్ ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, ఎంటర్‌టైన్‌మెంట్ కోసం ఆన్‌బోర్డ్ హాట్‌స్పాట్ Wi-Fiతో పాటు సౌకర్యవంతమైన సీట్లు ఉంటాయి.

*మొదటి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ఫిబ్రవరి 15, 2019న న్యూఢిల్లీ-కాన్పూర్-అలహాబాద్-వారణాసి మార్గంలో ప్రారంభించారు.

First Published:  11 Nov 2022 5:57 AM GMT
Next Story