Telugu Global
National

ఉగ్ర ఘాతుకం.. ఐదుగురు భారత జవాన్లు సజీవ దహనం

భారీ వర్షాలు, వెలుతురు సరిగా లేకపోవడం వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో ఆర్మీ వాహనం వెలుతుండగా.. అదే వాతావరణాన్ని తమకు అనుకూలంగా చేసుకుని ఉగ్రవాదులు ఆర్మీ ట్రక్కుని పేల్చేశారు.

ఉగ్ర ఘాతుకం.. ఐదుగురు భారత జవాన్లు సజీవ దహనం
X

జమ్మూ కాశ్మీర్‌ లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ఆర్మీ జవాన్లే లక్ష్యంగా దాడికి పాల్పడ్డారు. పూంచ్ జిల్లాలో జరిగిన ఉగ్రదాడిలో ఐదుగురు ఆర్మీ జవాన్లు సజీవ దహనమయ్యారు. ఈ ఘటనలో రాష్ట్రీయ రైఫిల్స్ యూనిట్‌ కు చెందిన ఐదుగురు ఉగ్రవాదులు మరణించారని ఆర్మీ అధికారులు తెలిపారు. దాడిలో తీవ్రంగా గాయపడిన మరో సైనికుడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆ ప్రాంతాన్ని ప్రస్తుతం ఆర్మీ జల్లెడ పడుతోంది.


ఆర్మీ వాహనం పూంచ్ జిల్లాలోని భింబర్ గలి నుంచి సాంగ్యోట్‌ కు వెళ్తుండగా ఈ దాడి జరిగింది. భింబర్ గలి ప్రాంతానికి సమీపంలోనే మధ్యాహ్నం 3 గంటలకు ఈ దాడి జరిగింది. మొదట పిడుగుపాటు అని అనుమానాలు వ్యక్తమైనా తర్వాత ఉగ్రఘాతుకం అని తేలింది. ఉగ్రవాదులు గ్రెనెేడ్లతో దాడి చేయడంతో ఆర్మీ వాహనం ఒక్కసారిగా తగలబడిపోయింది. అందులో ఉన్న ఐదుగురు జవాన్లు అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. ఒక్కరు మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. గాయపడ్డ జవానుని రాజౌరిలోని ఆర్మీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

భారీ వర్షాలు, వెలుతురు సరిగా లేకపోవడం వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో ఆర్మీ వాహనం వెలుతుండగా.. అదే వాతావరణాన్ని తమకు అనుకూలంగా చేసుకుని ఉగ్రవాదులు ఆర్మీ ట్రక్కుని పేల్చేశారు. గ్రెనేడ్లతో మెరుపుదాడికి పాల్పడ్డారు. ఆ తర్వాత 50రౌండ్లు కాల్పులు జరిపారని తెలుస్తోంది. పీపుల్స్ యాంటీ ఫాసిస్ట్ ఫ్రంట్ ఉగ్రవాద సంస్థ ఈ దాడికి బాధ్యత వహిస్తున్నట్లుగా ప్రకటన విడుదల చేసింది. ఈ ఏడాది మే 20న శ్రీనగర్‌ లో జి-20 టూరిజం వర్కింగ్‌ గ్రూప్‌ సమావేశం జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఈ ఉగ్రదాడి ఆందోళనకు గురి చేస్తోంది. మే నెలలో గోవాలో జరిగే షాంఘై సహకార సంస్థ విదేశాంగ మంత్రుల సమావేశానికి పాకిస్తాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ భారత్‌ కు వస్తారని ఈరోజే ప్రకటన విడులైంది. ఆ ప్రకటన వచ్చిన కొన్ని గంటల వ్యవధిలోనే ఈ దాడి జరగడం విశేషం.

First Published:  20 April 2023 4:24 PM GMT
Next Story