Telugu Global
National

అయోధ్యకు బాబ్రీ తాళం.. మోదీ విద్వేష ప్రసంగం

"మోదీకి 400 సీట్లు ఇవ్వండి లేదంటే కాంగ్రెస్, అయోధ్య రామమందిరానికి బాబ్రీ తాళం వేస్తుంది."

అయోధ్యకు బాబ్రీ తాళం.. మోదీ విద్వేష ప్రసంగం
X

"మోదీకి 400 సీట్లు ఇవ్వండి లేదంటే కాంగ్రెస్, అయోధ్య రామమందిరానికి బాబ్రీ తాళం వేస్తుంది." మధ్యప్రదేశ్‌లోని ధార్‌లో జరిగిన ర్యాలీలో ప్రధాని మోదీ ప్రసంగంలో ముఖ్యాంశం ఇది. తాను 400 సీట్లు ఎందుకు అడుగుతున్నానో తెలుసుకోవడం దేశానికి అవసరం అని అన్న మోదీ.. విద్వేష ప్రసంగంతో ప్రజల్ని రెచ్చగొట్టారు. తనకు 400 సీట్లు ఇస్తేనే.. కాంగ్రెస్ చేసే అన్ని కుట్రలను తాను ఆపగలనని చెప్పుకొచ్చారు. ఎన్డీఏకి మెజార్టీ రాకపోతే కాంగ్రెస్ ఏర్పాటు చేసే ప్రభుత్వం ఆర్టికల్ 370 తిరిగి తీసుకొస్తుందని హెచ్చరించారు మోదీ.

దేశంలోని ఖాళీ భూములు, దీవులను కాంగ్రెస్ ఇతర దేశాలకు అప్పగిస్తుందని విమర్శించారు మోదీ. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు ఇచ్చిన రిజర్వేషన్లను కాంగ్రెస్ తొలగిస్తుందని, తన ఓటు బ్యాంకుకి వాటిని బదిలీ చేస్తుందని అన్నారు. రాత్రికి రాత్రే ఓటు బ్యాంకులోని అన్ని కులాలను ఓబీసీలుగా ప్రకటిస్తారని, అది జరగకూడదు అంటే ఎన్డీఏ కూటమికి 400కి పైగా సీట్లు రావాలన్నారు మోదీ.

ఎందుకింత విద్వేషం..?

ఇప్పటికే ముస్లిం రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ ని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు బీజేపీ నేతలు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ముస్లింలకు ఉన్న రిజర్వేషన్లు తొలగిస్తామని అంటున్నారు. సాక్షాత్తూ ప్రధాని మోదీ కూడా తన స్థాయిని దిగజార్చుకుని విద్వేష ప్రసంగాలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. దేశ సంపదనంతా ముస్లింలకు దోచిపెట్టేలా కాంగ్రెస్ ప్రయత్నం చేస్తోందని అర్థం వచ్చేలా ఇటీవల మోదీ ఆరోపణలు చేశారు. ఆ వ్యాఖ్యలపై విమర్శలు వచ్చినా కూడా ఆయన వెనక్కు తగ్గలేదు. ఆ తర్వాత రాహుల్ ని ప్రధానిని చేయాలని పాకిస్తాన్ అనుకుంటోందని కూడా మోదీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు అయోధ్య రామమందిరానికి బాబ్రీ తాళం అంటూ మరోసారి ప్రజల్ని రెచ్చగొట్టారు మోదీ. అయోధ్య రాముడిని ఎన్నికలకోసం బీజేపీ ఉపయోగించుకుంటోందన్న విషయం తెలిసిందే. అయితే రామ మందిరానికి బాబ్రీ తాళం అంటూ మరింత విద్వేషాన్ని కుమ్మరించారు మోదీ. ఓటు బ్యాంకు రాజకీయాలకు పూర్తిగా మతం రంగు పులిమేశారు.

First Published:  7 May 2024 3:16 PM GMT
Next Story