Telugu Global
National

తెలంగాణ పథకాన్ని కాపీ కొట్టిన యోగీ సర్కార్.. పశువైద్య అంబులెన్స్‌లు ప్రారంభం

తెలంగాణలో పశువుల కోసం సంచార వైద్యశాల (అంబులెన్స్) పథకాన్ని 2017లో బీఆర్ఎస్ ప్రభుత్వం మొదలు పెట్టింది.

తెలంగాణ పథకాన్ని కాపీ కొట్టిన యోగీ సర్కార్.. పశువైద్య అంబులెన్స్‌లు ప్రారంభం
X

తెలంగాణలో అమలు అవుతున్న సంక్షేమ పథకాలు దేశమంతటా అమలు కావల్సిన అవసరం ఉందని సీఎం కేసీఆర్ పదే పదే చెబుతుంటారు. ఇప్పుడు దేశానికి కావల్సింది తెలంగాణ మోడల్ అని కేసీఆర్ ఎన్నో సార్లు చెప్పారు. దీనిపై బీజేపీ నాయకులు విమర్శలు చేస్తుంటారు. కానీ అదే బీజేపీ పాలిత రాష్ట్రాలు తెలంగాణ పథకాలు కాపీ కొడుతున్నాయి. తాజాగా యూపీలోని యోగీ ప్రభుత్వం తెలంగాణలో అమలు అవుతున్న పశువైద్య అంబులెన్స్ పథకాన్ని ప్రారంభించింది. ఇటీవలే కర్ణాటక ప్రభుత్వం కూడా సంచార పశు వైద్యశాలలను మొదలు పెట్టింది. వాస్తవానికి దేశంలో ఇలాంటి పథకాన్ని అమలు చేసిన మొదటి రాష్ట్రం తెలంగాణ మాత్రమే. సీఎం కేసీఆర్ ఆలోచనల్లోంచి పుట్టిన పశువైద్య అంబులెన్స్ పథకాన్ని ఇప్పుడు బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా అమలు చేస్తున్నాయి.

తెలంగాణలో పశువుల కోసం సంచార వైద్యశాల (అంబులెన్స్) పథకాన్ని 2017లో బీఆర్ఎస్ ప్రభుత్వం మొదలు పెట్టింది. తొలుత 100 అంబులెన్స్‌లతో ఈ పథకాన్ని ప్రారంభించగా.. దీనికి అనుబంధంగా 1962 నెంబర్‌తో కాల్ సెంటర్ కూడా ప్రారంభించింది. ఈ అంబులెన్స్‌లు ప్రతీ ఏడాది లక్షలాది పశువులు, జీవాలకు వైద్యాన్ని అందిస్తున్నాయి. ఇందుకోసం తెలంగాణ ప్రభుత్వం తమ సొంత నిధులను దాదాపు రూ.40 కోట్లను ఖర్చు చేస్తోంది. ఇప్పటి వరకు సంచార పశువైద్యశాలల కోసం రూ.300 కోట్ల మేర తెలంగాణ ప్రభుత్వం ఖర్చు చేసింది.

తెలంగాణలో అమలు అవుతున్న ఈ పథకం విజయవంతం కావడంతో పలు రాష్ట్రాలు దీనిపై ఆసక్తి చూపించాయి. కేంద్ర ప్రభుత్వం కూడా దీనిని అమలు చేయాలని భావించింది. ఇందుకోసం కేంద్ర పశుసంవర్ధక శాఖ మంత్రి పురుషోత్తం రూపాలా స్వయంగా రాష్ట్రానికి వచ్చి పథకం అమలు తీరును, దీని ద్వారా అందుతున్న సేవలను పరిశీలించారు. ఈ పథకం చాలా గొప్పగా ఉందని ప్రశంసలు కూడా కురిపించారు. తెలంగాణ రోల్ మోడల్‌గా దేశమంతా అన్ని రాష్ట్రాల్లో కేంద్రమే అమలు చేసేలా చూస్తామని ప్రకటించారు.

ఆనాడు కేంద్ర మంత్రి ప్రకటించిన విధంగానే పలు రాష్ట్రాలకు నిధులు అందిస్తోంది. కేంద్రం ఇచ్చిన నిధులతోనే ఏపీ, కర్ణాటక, తమిళనాడు, ఒడిషా రాష్ట్రాల్లో ఈ పథకం అమలు అవుతోంది. తాజాగా యూపీలో కూడా ప్రారంభమైంది. కేవలం సంచార పశు వైద్యశాలల పథకాన్నే కాకుండా తెలంగాణలో అమలవుతున్న రైతు బంధ, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి పథకాలను కూడా పలు రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం కాపీ కొడుతోంది. మొత్తానికి కేసీఆర్ పథకాలు ఇప్పుడు దేశానికి రోల్ మోడల్‌గా మారాయనడంలో అతిశయోక్తి లేదు.

First Published:  27 March 2023 1:58 AM GMT
Next Story