Telugu Global
NEWS

ప్లే స్టోర్‌కు పోటీగా ఫోన్‌పే వారి ఇండస్ యాప్ స్టోర్

ఆండ్రాయిడ్ డెవలపర్లు త‌మ యాప్‌ల‌ను ఇంగ్లీష్‌తోపాటు 12 భారతీయ భాషల్లో ఇండస్ యాప్ స్టోర్‌లో నమోదు చేసుకోవచ్చు.

ప్లే స్టోర్‌కు పోటీగా ఫోన్‌పే వారి ఇండస్ యాప్ స్టోర్
X

ఫిన్ టెక్, పేమెంట్ యాప్ ఫోన్ పే.. ఏకంగా గూగుల్ ప్లే స్టోర్‌నే స‌వాల్ చేస్తోంది. ఇండస్ యాప్ స్టోర్ పేరుతో దేశీయంగా డెవ‌ల‌ప్ చేసిన ఆండ్రాయిడ్ యాప్ స్టోర్‌ను మార్కెట్లోకి తెచ్చింది. యాప్ డౌన్‌లోడ్స్‌లో ప్ర‌పంచంలోనే ఇండియా టాప్‌.. కాబ‌ట్టి మ‌న మార్కెట్లో మెరుగైన షేర్ కోసం ఫోన్ పే ఈ యాప్ స్టోర్‌ను ప్ర‌వేశ‌పెట్టింది.

ఇండ‌స్ యాప్ స్టోర్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఏపీకే డౌన్‌లోడ్ చేసుకుంటే యాప్ మ‌న ఫోన్లో ఇన్‌స్టాల్ అవుతుంది. త‌ర్వాత దాన్ని గూగుల్ ప్లే స్టోర్ మాదిరిగానే వాడుకోవ‌చ్చు. గూగుల్ ప్లే స్టోర్ యూజ్ చేయాలంటే ఈమెయిల్ ఐడీ త‌ప్ప‌నిస‌రి. కానీ ఇండ‌స్ యాప్ స్టోర్‌లో మొబైల్ నంబ‌ర్ ఇస్తే చాలు.

12 భారతీయ భాషల్లో యాప్స్‌

ఆండ్రాయిడ్ డెవలపర్లు త‌మ యాప్‌ల‌ను ఇంగ్లీష్‌తోపాటు 12 భారతీయ భాషల్లో ఇండస్ యాప్ స్టోర్‌లో నమోదు చేసుకోవచ్చు. ఇన్-యాప్ ప‌ర్చేజ్‌ల‌పై ఫీజు కూడా లేదు. గూగుల్ ప్లే స్టోర్‌, యాపిల్ యాప్ స్టోర్ల‌లో ఈ ఫీజు 15-30% వరకు వసూలు చేస్తున్నాయి. యాప్ డెవ‌ల‌ప‌ర్స్ తొలి ఏడాది యాప్‌లు ఉచితంగా ఎన్‌రోల్ చేసుకోవ‌చ్చు. త‌ర్వాత కూడా నామిన‌ల్ ఫీజే తీసుకుంటామ‌ని ఫోన్ పే చెబుతోంది.

నోకియా, లావాల‌తో టై అప్

ఇండ‌స్ యాప్ స్టోర్ ఇప్ప‌టికే నోకియా, లావా వంటి కంపెనీలతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీంతో ఆయా కంపెనీలు త‌మ ఫోన్ల‌లో యాప్ స్టోర్‌ను డైరెక్ట్‌గా ప్రీలోడ్ చేసి ఉంచుతాయి. మ‌నం ఆండ్రాయిడ్ ఫోన్ కొత్త‌ది కొని ఓపెన్ చేసేస‌రికే గూగుల్ ప్లే స్టోర్ ఉన్న‌ట్టే ఇక ఈ కంపెనీ ఫోన్ల‌లో ఇండ‌స్ యాప్ స్టోర్ కూడా ముందే సిద్ధంగా ఉంటుంది.

First Published:  22 Feb 2024 6:23 AM GMT
Next Story