Telugu Global
Sports

పారిస్ ఒలింపిక్స్ కు 100 రోజుల కౌంట్ డౌన్!

ఫ్రెంచ్ నేలపై మూడోసారి ఒలింపిక్స్ నిర్వహణకు పారిస్ వేదికగా 100 రోజుల కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది.

పారిస్ ఒలింపిక్స్ కు 100 రోజుల కౌంట్ డౌన్!
X

ఫ్రెంచ్ నేలపై మూడోసారి ఒలింపిక్స్ నిర్వహణకు పారిస్ వేదికగా 100 రోజుల కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది. జులై, ఆగస్టు మాసాలలో 16 రోజులపాటు జరిగే ఈ క్రీడల పండుగలో 200కు పైగా దేశాలు పాలు పంచుకోనున్నాయి.

2024 ఒలింపిక్స్ కు వందరోజుల కౌంట్ డౌన్ వేడుకలు పారిస్ గడ్డపై ప్రారంభమయ్యాయి. 16 రోజులపాటు జరిగే ఈ 33వ వేసవి ఒలింపిక్స్ లో 204 దేశాలకు చెందిన 10వేల మంది అథ్లెట్లు 32 రకాల క్రీడల్లో పోటీపడనున్నారు.

మరిన్నిపతకాలు లక్ష్యంగా భారత్..

టోక్యో వేదికగా ముగిసిన గత ఒలింపిక్స్ పతకాల పట్టిక 48వ స్థానంలో నిలిచిన భారత్..ప్రస్తుత పారిస్ ఒలింపిక్స్ లో మెరుగైన ఫలితాలు సాధించాలన్న పట్టుదలతో ఉంది. మీరాబాయి చాను, లవ్లీనా బోర్గోహెయిన్, పీవీ సింధు, రవికుమార్ దహియా, బజరంగ్ పూనియా,నీరజ్ చోప్రా వ్యక్తిగత విభాగాలలో పతకాలు తెస్తే..పురుషుల హాకీలో భారత్ కాంస్య పతకం గెలుచుకోడం ద్వారా సంచలనం సృష్టించింది.

పురుషుల జావలిన్ త్రోలో నీరజ్ చోప్రా సాధించిన బంగారు పతకం పుణ్యమా అని భారత్ గత నాలుగు దశాబ్దాల ఒలింపిక్స్ చరిత్రలో అత్యుత్తమంగా 48వ స్థానం సంపాదించగలిగింది.

తొలిసారిగా స్టేడియం వెలుపల ప్రారంభవేడుకలు...

జులై 26 నుంచి ఆగస్టు 11 వరకూ 16రోజులపాటు సాగే పారిస్ ఒలింపిక్స్ ను వినూత్నంగా నిర్వహించనున్నారు. స్టేడియాలలోనే నిర్వహించే ప్రారంభ వేడుకల సాంప్రదాయాన్ని తప్పించి వెలుపల నిర్వహించడానికి పారిస్ గేమ్స్ ద్వారా శ్రీకారం చుట్టారు.

పారిస్ ఒలింపిక్స్ ప్రారంభవేడుకలను స్టేడియంలో కాకుండా ఫ్రెంచ్ రాజధాని శివారులో ఉన్న సీన్ నది తీరంలో నిర్వహించడానికి భారీస్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు.

సీన్ నదిలో 6 కిలోమీటర్ల దూరం పడవల పరేడ్ తో ప్రారంభవేడుకలు నిర్వహించనున్నారు. ప్రారంభవేడుకలకు కేవలం 3 లక్షల 25వేల మందిని మాత్రమే అనుమతించనున్నారు.

ప్రారంభవేడుకల కవాతులో పాల్గొనే ఒక్కోజట్టుకు ఒక్కో బోటును కేటాయించారు. బోట్ల కవాతు సీన్ నదీ తీరంలోని ఆస్టర్ లిడ్ వంతెన వద్ద మొదలై..రెండు ద్వీపాలను చుట్టి వచ్చి..ట్రోకాడెరోలో ముగియనుంది.

భద్రత కారణాల దృష్ట్యా ప్రారంభ వేడుకలను సెయింట్ డెన్నిస్ లోని స్టేడియం ఫ్రాన్స్ లో కాకుండా సీన్ నదీతీరంలో నిర్వహించాలని నిర్ణయించినట్లు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుల్ మాక్రోన్ వివరణ ఇచ్చారు.

ప్రారంభ వేడుకలకు ముందే ఫుట్ బాల్, రగ్బీ సెవెన్స్, హ్యాండ్ బాల్, ఆర్చరీ పోటీలకు తరలేవనుంది.

సరికొత్త క్రీడ బ్రేక్ డాన్సింగ్....

పారిస్ ఒలింపిక్స్ లో తొలిసారిగా బ్రేక్ డాన్సింగ్ క్రీడను పతకం అంశంగా ప్రవేశపెట్టారు. టోక్యో ఒలింపిక్స్ లో నిర్వహించిన కరాటే, సాఫ్ట్ బాల్, బేస్ బాల్ అంశాలకు పారిస్ ఒలింపిక్స్ క్రీడాంశాలలో చోటు దక్కలేదు.

స్కేట్ బోర్డింగ్, స్పోర్ట్ క్లయింబింగ్, సర్ఫింగ్ క్రీడలకు పారిస్ ఒలింపిక్స్ ప్రధాన క్రీడల జాబితాలో చోటు దక్కింది. 2018 యూత్ ఒలింపిక్స్ లో తొలిసారిగా నిర్వహించిన డ్యాన్సింగ్ కమ్ బ్రేక్ డ్యాన్సింగ్ క్రీడను వేసవి ఒలింపిక్స్ లోనూ తొలిసారిగా పతకం అంశంగా నిర్వహిస్తున్నారు.

వెయిట్ లిఫ్టింగ్ లోని నాలుగు అంశాలను తొలగించి..కనోయింగ్ విభాగంలో రెండు అంశాలను అదనంగా చేర్చారు.

32 క్రీడల్లో 329 పతకాలకు పోటీ....

పారిస్ ఒలింపిక్స్ ను 16 రోజులపాటు..32 రకాల క్రీడల్లో 329 పతకాల కోసం 10వేల మంది అథ్లెట్లు పోటీపడనున్నారు.పారిస్ చుట్టు పక్కల ఉన్న మొత్తం 35 వేదికల్లో పోటీలు నిర్వహిస్తారు.

పారిస్ లోని ఐఫిల్ టవర్ చెంతనే ఏర్పాటు చేసిన తాత్కాలిక వేదికలో బీచ్ బాలీబాల్ పోటీలను, పాలెస్ ఆఫ్ వెర్సెలో వేదికగా ఈక్వెష్టిరియన్, మోడర్న్ పెంటాథ్లాన్ పోటీలను, 124 సంవత్సరాల చరిత్ర కలిగిన గ్రాండ్ పాలెస్ వేదికగా ఫెన్సింగ్ టైక్వాండో పోటీలను నిర్వహించనున్నారు.

1924 పారిస్ ఒలింపిక్స్ ప్రారంభవేడుకలకు వేదికగా నిలిచిన 117 సంవత్సరాల యువ్స్ డు మాన్యోర్ స్టేడియం వేదికగా ఫీల్డ్ హాకీ పోటీలు నిర్వహిస్తారు.

క్రీడల ప్రధాన స్టేడియం వేదికగా ట్రాక్ అండ్ ఫీల్డ్ అంశాలతో పాటు ముగింపు వేడుకలు జరుగుతాయి.

రోలాండ్ గారోస్ వేదికగా టెన్నిస్ తో పాటు బాక్సింగ్ పోటీలను, పార్క్ డెస్ ప్రిన్సెస్ వేదికగా ఫుట్ బాల్ మ్యాచ్ లను నిర్వహిస్తారు.

తాహితీ ద్వీపాల వేదికగా సర్ఫింగ్ పోటీలు...

ఫ్రెంచ్ పాలిత పోలినీసియన్ ద్వీపం తాహితీ వేదికగా సర్ఫింగ్ పోటీలను తొలిసారిగా నిర్వహించబోతున్నారు. ఒలింపిక్స్ నిర్వహణకు సిద్ధం చేసిన వేదికల్లో 95 శాతం ఇప్పటికే ఉన్నవి లేదా తాత్కాలికంగా ఏర్పాటు చేసినవే కావడం విశేషం.

అప్పుడు 126..ఇప్పుడు...?

టోక్యో వేదికగా ముగిసిన గత ఒలింపిక్స్ లో 126 మంది అథ్లెట్ల బృందంతో 18 క్రీడాంశాలలో మాత్రమే పోటీకి దిగిన భారత్ తరపున ప్రస్తుత ఒలింపిక్స్ కోసం ఇప్పటి వరకూ కేవలం 42 మంది అథ్లెట్లు మాత్రమే అర్హత సంపాదించగలిగారు.

రానున్నవారాలలో జరిగే ఒలింపిక్స్ అర్హత పోటీల ద్వారా మరింత మంది పారిస్ బెర్త్ లు సాధించే అవకాశం లేకపోలేదు.

ఇప్పటి వరకూ అథ్లెటిక్స్ లో 9 మంది, టేబుల్ టెన్నిస్ లో ఆరుగురు, బ్యాడ్మింటన్లో 5, బాక్సింగ్ లో 4, వెయిట్ లిఫ్టింగ్ లో ఒక్కరు, విలువిద్య, పురుషుల హాకీ, సెయిలింగ్ అంశాలలో భారతజట్లు పాల్గొనటానికి అర్హత సంపాదించాయి.

స్వర్ణం నెగ్గిన అథ్లెట్లకు 50 వేల డాలర్లు...

ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ట్రాక్ అండ్ ఫీల్డ్ విభాగంలోని మొత్తం 45 అంశాలలో బంగారు పతకాలు సాధించిన అథ్లెట్లకు 50వేల డాలర్లు చొప్పున మొత్తం 2.4 మిలియన్ డాలర్లు నజరానాగా ఇవ్వనున్నట్లు అంతర్జాతీయ ఒలింపిక్స్ సంఘం సీఈవో సెబాస్టియన్ కో ప్రకటించారు.

మొత్తం 45వేల మంది పోలీసులు, మిలిటరీ సిబ్బంది భద్రతా విధుల్లో పాల్గొంటారని ఫ్రెంచ్ అంతర్గత వ్యవహారాల శాఖ ప్రకటించింది.

ఇజ్రాయిల్- హమస్, ఇరాన్- ఇజ్రాయిల్ దేశాల నడుమ జరుగుతున్న పోరు ప్రభావం సైతం ఒలింపిక్స్ పైన పడే అవకాశం లేకపోలేదు. రష్యా- ఉక్రెయిన్ ల యుద్ధం కారణంగా రష్యా అథ్లెట్లు పాల్గొనటంపై ఆంక్షలు విధించారు.

రష్యా అథ్లెట్లు తమ దేశానికి కాకుండా వ్యక్తిగత హోదాలో లేదా..తటస్థ పతాకం కింద పాల్గొనవచ్చునని నిర్వాహక సంఘం ప్రకటించింది.

పతకాల వేటలో పోటీ ప్రధానంగా అమెరికా, చైనాల నడుమే జరుగనుంది.

First Published:  18 April 2024 9:00 AM GMT
Next Story