Telugu Global
Sports

ఢిల్లీ ఢమాల్...ఐపీఎల్ విజేత బెంగళూరు!

2024- మహిళా ఐపీఎల్ విజేతగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నిలిచింది. హాట్ ఫేవరెట్ ఢిల్లీ క్యాపిటల్స్ వరుసగా రెండోఫైనల్లోనూ విఫలమయ్యింది.

ఢిల్లీ ఢమాల్...ఐపీఎల్ విజేత బెంగళూరు!
X

2024- మహిళా ఐపీఎల్ విజేతగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నిలిచింది. హాట్ ఫేవరెట్ ఢిల్లీ క్యాపిటల్స్ వరుసగా రెండోఫైనల్లోనూ విఫలమయ్యింది.

దేశంలోని మహిళా క్రికెట్ అభిమానులను గత రెండువారాలుగా అలరించిన 2024 సీజన్ మహిళా ఐపీఎల్ కు న్యూఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా తెరపడింది.

అందరి అంచనాలు తలకిందులు చేసి..స్మృతి మందన నాయకత్వంలోని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తొలిసారిగా టైటిల్ గెలుచుకొంది.

శ్రేయాంకా స్పిన్ మ్యాజిక్.....

హాట్ ఫేవరెట్ గా టైటిల్ బరిలోకి దిగడమే కాదు...ఐదుజట్ల లీగ్ టేబుల్ టాపర్ గా నేరుగా ఫైనల్లో అడుగుపెట్టిన ఢిల్లీ క్యాపిటల్స్ వరుసగా రెండోసీజన్ టైటిల్ సమరంలోనూ పరాజయం పాలయ్యింది.

మెగ్ లానింగ్, షెఫాలీవర్మ, జెమీమా రోడ్రిగేజ్, ఆలిస్ కాప్సే లాంటి స్టార్ బ్యాటర్లతో కూడిన ఢిల్లీ క్యాపిటల్స్ ముందుగా బ్యాటింగ్ కు దిగినా ప్రత్యర్థి ఎదుట తగిన విజయలక్ష్యాన్ని ఉంచలేకపోయింది. యువస్పిన్నర్ శ్రేయాంకా పాటిల్ మాయలో గల్లంతయ్యింది.

ఈ కీలకపోరులో ముందుగా టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకొన్న ఢిల్లీని 113 పరుగులకే బెంగళూరు కట్టడి చేయగలిగింది. లానింగ్- షెఫాలీ మొదటి వికెట్ కు 64 పరుగుల భాగస్వామ్యంతో మెరుపు ఆరంభాన్ని ఇచ్చినా..ఆ తరువాత వికెట్ వెంట వికెట్ కోల్పోడం ద్వారా ఢిల్లీ చతికిల పడిపోయింది. కేవలం 23 పరుగుల వ్యవధిలోనే 7 వికెట్లు కోల్పోడం ద్వారా ఢిల్లీ ఆలౌటయ్యింది.

కెప్టెన్ లానింగ్ 23 బంతుల్లో 23 పరుగులు, షెఫాలీ 27 బంతుల్లో 44 పరుగుల స్కోర్లకు అవుట్ కావడంతోనే మ్యాచ్ పైన బెంగళూరు పట్టు బిగించగలిగింది.

వన్ డౌన్ జెమీమా, మెలీన్ కాప్సే డకౌట్లు కాగా...కాప్ 8, జోనాసెన్ 3 పరుగులకు చిక్కారు. లోయర్ ఆర్డర్లో రాధా యాదవ్ 12, అరుంధతి రెడ్డి10 పరుగుల స్కోర్లు సాధించడంతో ఢిల్లీ 18.3 ఓవర్లలో 113 పరుగులకే కుప్పకూలింది.

బెంగళూరు బౌలర్లలో శ్రేయాంక పాటిల్ 12 పరుగులిచ్చి 4 వికెట్లు, సోఫీ మోలీనెక్స్ 20 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టారు.

బెంగళూరు బ్యాంగ్ బ్యాంగ్....

మ్యాచ్ నెగ్గాలంటే 20 ఓవర్లలో 114 పరుగులు చేయాల్సిన బెంగళూరు 19.3 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు మాత్రమే నష్టపోయి లక్ష్యాన్నిచేరుకోగలిగింది. కెప్టెన్ కమ్ ఓపెనర్ స్మృతి మందన 39 బంతుల్లో 3 బౌండ్రీలతో 31 పరుగులు, సోఫీ డివైన్ 27 బంతుల్లో 32 పరుగుల స్కోర్లకు వెనుదిరిగారు.

వన్ డౌన్ ఎల్సీ పెర్రీ 35 నాటౌట్, రిచా ఘోశ్ 17 పరుగుల నాటౌట్ స్కోర్లతో నిలవడంతో బెంగళూరు విజేతగా నిలిచింది. ఢిల్లీ బౌలర్లలో శిఖా పాండే, మిన్ను మణి చెరో వికెట్ పడగొట్టారు.

ప్రస్తుత సీజన్ టోర్నీ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును దీప్తి శర్మ, ప్లేయర్ ఆఫ్ ది ఫైనల్స్ అవార్డును సోఫీ మోలినెక్స్ దక్కించుకొన్నారు. బెంగళూరు ఆల్ రౌండర్ ఎల్పీ పెర్రీకి ఆరెంజ్ క్యాప్ లభించింది.

బెంగళూరు మహిళలే నయం...

పురుషుల ఐపీఎల్ లో గత 16 సీజన్లుగా విఫలమవుతూ వస్తున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పరువును మహిళల జట్టు దక్కించగలిగింది. 2009, 2011, 2016 ఐపీఎల్ టోర్నీల ఫైనల్స్ కు చేరినా పురుషులజట్టు పరాజయాలతో రన్నరప్ గానే మిగిలింది.

క్రిస్ గేల్, విరాట్ కొహ్లీ, ఏబీ డివిలియర్స్, ఫాఫ్ డూప్లెసిస్ లాంటి ప్రపంచ మేటి బ్యాటర్లున్న బెంగళూరు టైటిల కల నెరవేరలేదు. అయితే..మహిళా ఐపీఎల్ రెండోసీజన్లోనే

స్మృతి మందన నాయకత్వంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు టైటిల్ విన్నర్ గా నిలవడంతో అభిమానులు సంబరాలు జరుపుకొన్నారు.

ఫైనల్ మ్యాచ్ కు 28వేల 781 మంది అభిమానులు హాజరు కావడం విశేషం.

First Published:  18 March 2024 5:00 AM GMT
Next Story