Telugu Global
Sports

మహిళా టెన్నిస్ లో టీనేజ్ సంచలనం!

ప్రపంచ మహిళాటెన్నిస్ లో అమెరికా టీనేజ్ సంచలనం కోకో గాఫ్ నాలుగో డబ్లుటిఏ టూర్ టైటిల్ నెగ్గడం ద్వారా సరికొత్త చరిత్ర సృష్టించింది.

మహిళా టెన్నిస్ లో టీనేజ్ సంచలనం!
X

ప్రపంచ మహిళాటెన్నిస్ లో అమెరికా టీనేజ్ సంచలనం కోకో గాఫ్ నాలుగో డబ్లుటిఏ టూర్ టైటిల్ నెగ్గడం ద్వారా సరికొత్త చరిత్ర సృష్టించింది.

ప్రపంచ మహిళా టెన్నిస్ లోకి వివిధ దేశాలకు చెందిన ఎందరో నవయువ క్రీడాకారులు దూసుకొస్తున్నా 19 ఏళ్ల అమెరికన్ సంచలనం కోకో గాఫ్ తర్వాతే ఎవరైనా.

2009 తర్వాత నుంచి టీనేజర్ గా నాలుగు ప్రపంచ మహిళా టెన్నిస్ టూర్ టైటిల్స్ నెగ్గిన తొలిప్లేయర్ గా ఓ అరుదైన రికార్డు నెలకొల్పింది.

వాషింగ్టన్ డీసీ ఓపెన్ టైటిల్ అందుకోడం ద్వారా గత 14 సంవత్సరాలలో ఈ ఘనత సాధించిన తొలి టీనేజర్ గా నిలిచింది.

అప్పుడు వోజ్నియాకీ..ఇప్పుడు కోకో గాఫ్..

2023 గ్రాండ్ స్లామ్ సీజన్ ఆఖరి టోర్నీగా న్యూయార్క్ లో జరిగే అమెరికన్ ఓపెన్ కు సన్నాహాలలో భాగంగా వాషింగ్టన్ డీసీ ఓపెన్ టోర్నీ బరిలోకి దిగిన కోకో ఫైనల్లో మారియా సక్కారీని 6-2, 6-3తో చిత్తు చేయడం ద్వారా 20వ పుట్టినరోజుకు ముందే నాలుగో టూర్ టైటిల్ ట్రోఫీని అందుకోగలిగింది.

గత నెలలో ముగిసిన వింబుల్డన్ మహిళల సింగిల్స్ తొలిరౌండ్లోనే పరాజయం చవిచూసిన కోకో..అమెరికన్ హార్డ్ కోర్టు టెన్నిస్ లో సత్తా చాటుకోవాలన్న పట్టుదలతో ఉంది.

2009కు ముందు ఇదే ఘనతను ప్రపంచ మాజీనంబర్ వన్ ప్లేయర్ కారోలిన్ వోజ్నియాకీ ఓ టీనేజర్ గా సాధించింది. ప్రస్తుత ప్రపంచ మహిళా టెన్నిస్ ర్యాంకింగ్స్ ప్రకారం 7వ ర్యాంకులో ఉన్న కోకో 3వ సీడ్ హోదాలో డీసీ కప్ రేస్ లో నిలిచింది.

కోకో ఆటతీరులో మార్పు ఎంతో కనపడుతోందని కోచ్ పెరీ రిబా అంటున్నారు. కోకో 19 సంవత్సరాల చిరుప్రాయంలోనే నాలుగు టూర్ టైటిల్స్ సాధించడం పట్ల టెన్నిస్ విఖ్యాత కన్సల్టెంట్ బ్రాడ్ గిల్బర్ట్ సంతోషం వ్యక్తం చేశారు.

అమెరికన్ ఓపెన్ వైపు కోకో చూపు....

2022 ఫ్రెంచ్ ఓపెన్ టోర్నీలో రన్నరప్ గా నిలవడంతో పాటు ప్రపంచ దృష్టిని ఆకర్షించిన కోకో ప్రస్తుత డీసీ కప్ టోర్నీలో 9వ ర్యాంకర్ సక్కారీని చిత్తు చేయటానికి ముందే..డిఫెండింగ్ చాంపియన్ లూద్మిలా సామ్సనోవా, టోక్యో ఒలింపిక్స్ గోల్డ్ మెడల్ విన్నర్ బెలిండా బెన్ సిచ్ లపై విజయాలు సాధించింది. వారంరోజుల వ్యవధిలో ముగ్గురు ప్రపంచ మేటి ప్లేయర్ల పై విజయాలు సాధించడం తనకు ఎనలేని సంతృప్తినిచ్చినట్లు కోకో ప్రకటించింది.

2023 సీజన్లో కోకో సాధించిన రెండో టూర్ టైటిల్ గా డీసీ కప్ నిలిచింది. జనవరిలో న్యూజిలాండ్ ఓపెన్ టైటిల్ నెగ్గిన కోకో ఆరుమాసాల వ్యవధిలో రెండో ట్రోఫీ అందుకోగలిగింది.

డీసీ కప్ ట్రోఫీతో పాటు కోకో లక్షా 20వేల 150 డాలర్ల ప్రైజ్ మనీని సైతం సొంతం చేసుకోగలిగింది.

32 డిగ్రీల సెలీసియస్ వేడి, 55 శాతం ఉక్కపోత కలిగిన వాతావరణంలో జరిగిన ఫైనల్లో 28 సంవత్సరాల సక్కారీని 19 సంవత్సరాల కోకో గాఫ్ వరుస సెట్లలో చిత్తు చేయటం విశేషం.

First Published:  7 Aug 2023 12:27 PM GMT
Next Story