Telugu Global
Sports

హైదరాబాద్ లో నేడు సన్ రైజర్స్ కు రాయల్స్ చాలెంజ్!

దేశంలోని పదినగరాల చుట్టూ తిరుగుతున్న ఐపీఎల్-2024 సర్కస్ మరోసారి హైదరాబాద్ కు చేరింది. ఈ రోజు జరిగే కీలక పోరులో రాజస్థాన్ రాయల్స్ కు సన్ రైజర్స్ సవాలు విసురుతోంది.

హైదరాబాద్ లో నేడు సన్ రైజర్స్ కు రాయల్స్ చాలెంజ్!
X

దేశంలోని పదినగరాల చుట్టూ తిరుగుతున్న ఐపీఎల్-2024 సర్కస్ మరోసారి హైదరాబాద్ కు చేరింది. ఈ రోజు జరిగే కీలక పోరులో రాజస్థాన్ రాయల్స్ కు సన్ రైజర్స్ సవాలు విసురుతోంది.

దేశంలోని వేసవి తీవ్రతస్థాయిలోనే ఐపీఎల్ 17వ సీజన్ లీగ్ మ్యాచ్ లు సైతం హాట్ హాట్ గా సాగిపోతున్నాయి. దేశంలోని 10 నగరాలు 11 వేదికల్లో గత నాలుగువారాలుగా జరుగుతున్న తొలిఅంచె డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ లోని 50వ మ్యాచ్ కు హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం ఆతిథ్యమిస్తోంది.

లీగ్ టేబుల్ టాపర్ రాజస్థాన్ రాయల్స్, 5వ స్థానంలో నిలిచిన సన్ రైజర్స్ జట్ల పోరు ఈ రోజురాత్రి 7-30కి ప్రారంభమవుతుంది.

హాట్ ఫేవరెట్ రాజస్థాన్ రాయల్స్...

ప్రస్తుత సీజన్లో ఇప్పటి వరకూ ఆడిన మొదటి 9 రౌండ్లలో 8 విజయాలతో 16 పాయింట్లు సాధించడం ద్వారా ప్లే-ఆఫ్ రౌండ్ బెర్త్ ఖాయం చేసుకొన్న రాజస్థాన్ రాయల్స్ తన విజయపరంపరను కొనసాగించాలన్న పట్టుదలతో ఉంది.

డాషింగ్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ నాయకత్వంలోని రాయల్స్ జట్టు హాట్ ఫేవరెట్ గా పోటీకి దిగుతోంది. జోస్ బట్లర్, యశస్వీ జైశ్వాల్ లాంటి పవర్ ఫుల్ ఓపెనింగ్ జోడీతో పాటు..రియాన్ పరాగ్, సంజు శాంసన్, ధృవ్ జురెల్, హెట్ మేయర్, రోవ్ మన్ పావెల్ లాంటి సూపర్ హిట్టర్లతో రాజస్థాన్ బ్యాటింగ్ లైనప్ అత్యంత పటిష్టంగా కనిపిస్తోంది.

ఇక..బౌలింగ్ విభాగంలో సైతం రాజస్థాన్ సమతూకంతో కనిపిస్తోంది. ట్రెంట్ బౌల్ట్, నాండ్రే బర్గర్, ఆవేశ్ ఖాన్, సందీప్ శర్మలతో పాటు స్పిన్ త్రయం అశ్విన్, చహాల్, కేశవ్ మహారాజ్ కీలకం కానున్నారు.

సన్ రైజర్స్ మరో రికార్డుకు తహతహ...

ప్రస్తుత సీజన్ లీగ్ లో ఇప్పటికే రెండుసార్లు రికార్డు ( 287, 277) స్కోర్లు సాధించిన సన్ రైజర్స్ ..హోంగ్రౌండ్లో మరోభారీ స్కోరు సాధించడం ద్వారా గెలుపు గాడిలో పడాలని భావిస్తోంది.

ఇప్పటి వరకూ ఆడిన 9 రౌండ్ల మ్యాచ్ ల్లో 5 విజయాలు, 4 పరాజయాల రికార్డుతో...10 పాయింట్లు మాత్రమే సాధించిన సన్ రైజర్స్..ప్లే-ఆఫ్ రౌండ్ చేరాలంటే మిగిలిన 5 రౌండ్లలో కనీసం మూడు విజయాలు సాధించితీరాల్సి ఉంది.

నిలకడలేమితో కొట్టిమిట్టాడుతున్న సన్ రైజర్స్ జోరు కొనసాగాలంటే ఓపెనింగ్ జోడీ ట్రావిస్ హెడ్- అభిషేక్ శర్మ ఇచ్చే ఆరంభంతో పాటు..మిడిల్ ఓవర్లలో సఫారీజోడీ మర్కరమ్, క్లాసెన్, నితీశ్ రెడ్డి సాధించే పరుగులు కీలకం కానున్నాయి.

బౌలింగ్ లో సైతం సన్ రైజర్స్ ను నిలకడలేమి వెంటాడుతోంది. భువనేశ్వర్ కుమార్, నటరాజన్ తో పాటు కెప్టెన్ కమిన్స్, ఉనద్కత్, మయాంక్ మార్కండేలకు రాజస్థాన్ హిట్టర్స్ నుంచి అసలు సిసలు పరీక్ష ఎదురుకానుంది.

రాజస్థాన్ 9- హైదరాబాద్ 9

ఈ రెండుజట్ల ఫేస్ టు ఫేస్ రికార్డులు చూస్తే చెరో 9 విజయాలతో సమఉజ్జీలుగా కనిపిస్తున్నాయి. బ్యాటింగ్ స్వర్గధామం లాంటి హైదరాబాద్ రాజీవ్ స్టేడియం పిచ్ పైన ముందుగా బ్యాటింగ్ కు దిగిన జట్టు 260కి పైగా స్కోరు సాధించినా విజయానికి గ్యారెంటీ లేకపోడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.

టాస్ నెగ్గినజట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకొంటుందా? లేక చేజింగ్ వైపు మొగ్గు చూపుతుందా? అన్నది కూడా బిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. మొదటి 7 రౌండ్లలో 5 విజయాలు సాధించిన సన్ రైజర్స్..ఆ తర్వాతి రెండు రౌండ్లలో బెంగళూరు, చెన్నైజట్ల చేతిలో పరాజయాలతో డీలా పడిపోయింది. చేజంగ్ లో విఫలం కావడం సన్ రైజర్స్ ప్రధాన బలహీనతగా మారింది.

ముందుగా బ్యాటింగ్ కు దిగిన సమయంలో భారీస్కోర్లు సాధిస్తూ..భారీవిజయాలు సాధించడం సన్ రైజర్స్ కు ఓ అలవాటుగా మారింది. ఈ రోజు జరిగే మ్యాచ్ లో సైతం సన్ రైజర్స్ కెప్టెన్ కమిన్స్ ముందుగా టాస్ నెగ్గితే..మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్ కు దిగడం ఖాయంగా కనిపిస్తోంది.

సన్ రైజర్స్ కు సంజు శాంసన్ టెన్షన్...

హైదరాబాద్ సన్ రైజర్స్ ప్రత్యర్థిగా అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్ రికార్డు రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ పేరుతో ఉంది. సంజు 21 ఇన్నింగ్స్ లో 49.43 సగటుతో..791 పరుగులు సాధించాడు. 23 ఇన్నింగ్స్ లో 762 పరుగులతో విరాట్ కొహ్లీ ఆ తర్వాతి స్థానంలో ఉన్నాడు. హైదరాబాద్ వేదికగా ఆడిన మ్యాచ్ ల్లో సంజు 71.75 సగటుతో 147.17 స్ట్ర్రయిక్ రేటుతో 287 పరుగులతో టాపర్ గా నిలిచాడు.

అంతేకాదు...ప్రస్తుత సీజన్ చేజింగ్ లో రాజస్థాన్ రాయల్స్ గత ఆరుకు ఆరుమ్యాచ్ ల్లోనూ నెగ్గడం ద్వారా అరుదైన రికార్డు నెలకొల్పింది. అయితే ..హైదరాబాద్ సన్ రైజర్స్ ఐదుసార్లు ముందుగా బ్యాటింగ్ కు దిగితే నాలుగుసార్లు విజేతగా నిలిచింది.

ఈ రోజు జరిగే పోరులో సన్ రైజర్స్ టాస్ నెగ్గితే ముందుగా బ్యాటింగ్ ఎంచుకొంటుందా? లేక చేజింగ్ కు దిగుతుందా? అన్నది ఆసక్తిని కలిగిస్తోంది.

ఓ వైపు నిప్పులు చెరిగే ఎండవేడి, ఉక్కబోత వాతావరణం..మరోవైపు హాట్ హాట్ ఐపీఎల్ ఫైట్. స్టేడియానికి భారీసంఖ్యలో అభిమానులు తరలి వస్తారా? అనుమానమే.

First Published:  2 May 2024 5:00 AM GMT
Next Story