Telugu Global
Sports

ప్రపంచకప్ జట్టులో హార్ధిక్ పాండ్యాకు చోటు అనుమానమే?

భారత సూపర్ ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యాకు సీన్ రివర్స్ అయ్యింది. 2024 టీ-20 ప్రపంచకప్ లో పాల్గొనే భారతజట్టులో చోటు అనుమానంగా మారింది.

ప్రపంచకప్ జట్టులో హార్ధిక్ పాండ్యాకు చోటు అనుమానమే?
X

గతేడాది వరకూ భారత టీ-20 జట్టుకు కెప్టెన్ గా ఓ వెలుగు వెలిగిన పేస్ ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా కెరియర్ లో తిరోగమన దశ ప్రారంభమయ్యింది. తరచూ గాయాలు, వరుస వైఫల్యాలతో పాండ్యా పరిస్థితి అయోమయంగా తయారయ్యింది.

పాండ్యాచోటుకు గ్యారెంటీలేదు...

ఒకప్పుడు హార్ధిక్ పాండ్యా లేని భారత టీ-20 జట్టును ఊహించడం అసాధ్యం అనుకొనే పరిస్థితి ఉండేది. గతేడాది వరకూ భారత టీ-20 జట్టుకు హార్ధిక్ పాండ్యా నాయకుడిగా వ్యవహరించాడు. రోహిత్ శర్మ వారసుడు హార్ధిక్ పాండ్యా మాత్రమేనని, 2024 ఐసీసీ టీ-20 ప్రపంచకప్ లో పాల్గొనే భారతజట్టుకు పాండ్యానే నాయకత్వం వహిస్తాడని అందరూ భావించారు. అయితే..గాయంతో కొద్దిమాసాలపాటు భారతజట్టుకు పాండ్యా దూరం కావడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది.

అహ్మదాబాద్ టు ముంబై...

2022, 2023 ఐపీఎల్ సీజన్లలో అహ్మదాబాద్ ఫ్రాంచైజీకి చెందిన గుజరాత్ టైటాన్స్ కు పాండ్యా నాయకత్వం వహించడమే కాదు..వరుసగా రెండుసార్లు ఫైనల్స్ చేర్చడంతో పాటు ఓ విన్నర్, ఓ రన్నరప్ టైటిల్ అందించాడు. దీంతో హార్ధిక్ పాండ్యా గ్రాఫ్ ఒక్కసారిగా మారిపోయింది. ఏకంగా ముంబై ఫ్రాంచైజీకి కెప్టెన్ గా వ్యవహరించే స్థాయికి చేరాడు.

గత పుష్కరకాలంగా ముంబైని ఐపీఎల్ లో తిరుగులేని జట్టుగా నిలిపిన రోహిత్ శర్మ నాయకత్వానికే హార్ధిక్ పాండ్యా ఎసరు పెట్టాడు. అయితే..ప్రస్తుత 2024 సీజన్లో ముంబై తలరాతను ఏమాత్రం మార్చలేకపోయాడు. మొదటి 6రౌండ్ల మ్యాచ్ ల్లో ముంబై నాలుగు పరాజయాలతో 10 జట్ల లీగ్ టేబుల్ 8వ స్థానానికి పడిపోయింది.

ధోనీ ముందు తేలిపోయిన పాండ్యా...

హోంగ్రౌండ్ వాంఖడే స్టేడియం వేదికగా డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన సూపర్ ఫైట్ లో వెటరన్ ధోనీ అనుభవం, వ్యూహాలు, జిత్తుల ముందు పాండ్యా నాయకత్వంలోని ముంబైజట్టు తేలిపోయింది. చివరకు రోహిత్ శర్మ సాధించిన ఫైటింగ్ సెంచరీ సైతం వృధాగా మారిపోయింది.

చెన్నై ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో బౌలింగ్ కు దిగిన హార్థిక్ పాండ్యా బౌలింగ్ లో ధోనీ సిక్సర్ల హ్యాట్రిక్ తో సహా సాధించిన 20 పరుగుల తేడాతోనే సూపర్ కింగ్స్ విజేతగా నిలువగలిగింది.

పాండ్యా తన కోటా 4 ఓవర్లలో 3 ఓవర్లు మాత్రమే బౌల్ చేసి 43 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. ఇక..బ్యాటింగ్ లో సైతం పాండ్యా 6 బంతుల్లో 2 పరుగులు మాత్రమే చేసి అవుటయ్యాడు. ఆల్ రౌండర్ గా,కెప్టెన్ గా పాండ్యా దారుణంగా విఫలం కావడం కూడా ముంబై పరాజయానికి కారణాలలో ఒకటిగా నిలిచింది.

మొదటి 6 మ్యాచ్ ల్లో పాండ్యా వెలవెల..

ప్రస్తుత సీజన్ డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ మొదటి ఆరు రౌండ్ల మ్యాచ్ ల్లో హార్థిక్ పాండ్యా 131 పరుగులు మాత్రమే చేయగలిగాడు. దీనికితోడు బౌలింగ్ లో సైతం పాండ్యా అంతంత మాత్రంగానే రాణించడం చర్చనీయాంశంగా మారింది. గత ఆరుమ్యాచ్ ల్లో పాండ్యా 3 వికెట్లు మాత్రమే పడగొట్టగలిగాడు.

అంతేకాదు..పాండ్యాను ఫిట్ నెస్ సమస్యలు సైతం వెంటాడుతున్నాయి.కాలిమడమ గాయంతో 2023 ఐసీసీ వన్డే ప్రపంచకప్ కు దూరమైన పాండ్యా..2024 ఐసీసీ టీ-20 ప్రపంచకప్ జట్టులో చోటు సంపాదించాలంటే ఏదైనా అద్భుతమే జరిగి తీరాలి.

పాండ్యా మెడపైన శివం కత్తి...

భారతజట్టులో పేస్ ఆల్ రౌండర్ స్థానం కోసం హార్థిక్ పాండ్యాకు ముంబై ఆల్ రౌండర్ శివం దూబే ప్రధాన పోటీదారుడుగా తయారయ్యాడు. భారతజట్టు తరపున మాత్రమే కాదు..ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున సైతం శివం అద్భుతంగా రాణిస్తూ సెలెక్టర్ల దృష్టిని ఆకట్టుకొన్నాడు.

ప్రత్యర్థి ఎవరైనా సరే లెక్కలేకుండా..గ్రౌండ్ నలుమూలలకూ సిక్సర్లు బాదడంలో శివం తరువాతే ఎవరైనా. ప్రస్తుత సీజన్ మొదటి ఆరు రౌండ్ల మ్యాచ్ ల్లో శివం

242 పరుగులు సాధించడంతో పాటు 15 సిక్సర్లు బాదాడు. 160కి పైగా స్ట్ర్రయిక్ రేట్ తో వారేవ్వా అనిపించుకొన్నాడు. 44 సగటుతో ఉన్న శివంను భారతజట్టులోకి తీసుకొని తీరాల్సిందేనని భారత మాజీ క్రికెటర్లు, వ్యాఖ్యాతలు యువరాజ్ సింగ్, వెంకటేశ్ ప్రసాద్ పట్టు పడుతున్నారు.

ఇప్పటి వరకూ ఆడిన మొదటి ఆరురౌండ్ల మ్యాచ్ ల్లో శివం దూబే 34 నాటౌట్, 51, 18, 45, 28, 66 నాటౌట్ స్కోర్లు సాధించడం విశేషం.

ఈనెల ఆఖరి వారంలో బీసీసీఐ ఎంపిక సంఘం..రోహిత్ శర్మ నాయకత్వంలో 15మంది సభ్యుల భారతజట్టును ఎంపిక చేయనుంది. పేస్ ఆల్ రౌండర్ స్థానం హార్థిక్ పాండ్యాకు దక్కుతుందా? లేక శివం దూబేకు చిక్కుతుందా? అన్నది ఆసక్తి రేపుతోంది.

అంతంతమాత్రం ఫామ్, నూటికి నూరుశాతం ఫిట్ నెస్ లేని హార్ధిక్ పాండ్యాను ఎంపిక చేస్తే కుంటిగుర్రంతో రేసులో పాల్గొన్నట్లే అవుతుందని క్రికెట్ విమర్శకులు హెచ్చరిస్తున్నారు.

ఇదంతా చూస్తుంటే..హార్థిక్ పాండ్యా స్థానాన్ని శివం దూబే తన్నుకుపోడం ఖాయమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

First Published:  15 April 2024 1:17 PM GMT
Next Story