Telugu Global
Sports

మూడేళ్ల తరువాత ఫెడరేషన్ కప్ బరిలో బల్లెం వీరుడు!

గత మూడేళ్లుగా అంతర్జాతీయ టోర్నీలకే పరిమితమైన బల్లెం విసురుడులో భారత బాహుబలి నీరజ్ చోప్రా దేశవాళీ ఫెడరేషన్ కప్ పోటీల బరిలోకి దిగనున్నాడు.

మూడేళ్ల తరువాత ఫెడరేషన్ కప్ బరిలో బల్లెం వీరుడు!
X

గత మూడేళ్లుగా అంతర్జాతీయ టోర్నీలకే పరిమితమైన బల్లెం విసురుడులో భారత బాహుబలి నీరజ్ చోప్రా దేశవాళీ ఫెడరేషన్ కప్ పోటీల బరిలోకి దిగనున్నాడు.

నీరజ్ చోప్రా.. ప్రపంచ..ప్రధానంగా భారత క్రీడాభిమానులకు ఏమాత్రం పరిచయం అవసరం లేని పేరు. బల్లెం విసురుడు ( జావెలిన్ త్రో) లో ప్రపంచానికే బాహుబలిగా పేరుపొందిన నీరజ్ ఇప్పటికే ఒలింపిక్స్, ప్రపంచ పోటీల బంగారు పతకాలతో భారత ప్రతిష్టను అంతర్జాతీయంగా ఎవరెస్టు ఎత్తుకు తీసుకు వెళ్ళాడు.

గత మూడేళ్లుగా అంతర్జాతీయ పోటీలకే పరిమితం కావడంతో దేశావాళీ ట్రాక్ అండ్ ఫీల్డ్ టోర్నీలకు నీరజ్ దూరంగా ఉంటూ వచ్చాడు. అయితే.. మరికొద్ది మాసాలలో ప్రారంభంకానున్న పారిస్ ఒలింపిక్స్ కు సన్నాహాలలో భాగంగా జాతీయ ఫెడరేషన్ కప్ పోటీలలో పాల్గొనాలని నిర్ణయించాడు.

భువనేశ్వర్ వేదికగా ఫెడరేషన్ కప్...

భారత అథ్లెట్ల సత్తాకు పరీక్షగా నిలిచే అత్యుత్తమ ట్రాక్ అండ్ ఫీల్డ్ టో్ర్నీ 2024 ఫెడరేషన్ కప్ మే 12 నుంచి 15 వరకూ ఒడిషా రాజధాని భువనేశ్వర్ వేదికగా జరుగనుంది.

ఈ పోటీల బరిలో నిలిచే అథ్లెట్ల జాబితాలో నీరజ్ చోప్రా పేరు సైతం ఉండడంతో క్రీడాభిమానులు ఉబ్బితబ్బిబవుతున్నారు. 26 సంవత్సరాల నీరజ్ తన ప్రతిభను సొంతం గడ్డపై, స్వదేశీ క్రీడాభిమానుల ముందు చాటుకొనే అవకాశం వచ్చింది.

ఈ పోటీల తరువాత మే 10 నుంచి దోహా వేదికగా జరిగే డైమండ్ లీగ్ తొలి అంచె పోటీలలో నీరజ్ పాల్గోనున్నాడు.

మే 12 నుంచి జరిగే ఫెడరేషన్ కప్ టోర్నీ పురుషుల జావెలిన్ త్రో విభాగంలో భారత జోడీ నీరజ్ చోప్రా, కిశోర్ కుమార్ జెనా పాల్గొంటారని భారత ఒలింపిక్స్ సమాఖ్య ప్రకటించింది.

హాంగ్జు వేదికగా ముగిసిన ఆసియాక్రీడల్లో భారత జోడీ నీరజ్ చోప్రా, కిశోర్ కుమార్ జెనా స్వర్ణ, రజత పతకాలు సాధించారు. ప్రస్తుతం క్లాజ్ బార్టోనిట్జ్ కోచ్ గా యూరోప్ లో శిక్షణ పొందుతున్న నీరజ్..యూరోప్ నుంచి భువనేశ్వర్ కు తరలి రానున్నాడు.

2021 ఫెడ్ కప్ లో చివరిసారిగా...

నీరజ్ చోప్రా చివరిసారిగా 2021 మార్చి 17న జరిగిన ఫెడరేషన్ కప్ టోర్నీలో పాల్గొని 87. 80 మీటర్ల రికార్డుతో బంగారు పతకం గెలుచుకొన్నాడు. ఆ తరువాత టోక్యో ఒలింపిక్స్ స్వర్ణం, 2022లో జరిగిన డైమండ్ లీగ్ మీట్ లో బంగారు, 2023 ప్రపంచ పోటీలలో బంగారు, ఆసియాక్రీడల్లో స్వర్ణపతకాలతో నీరజ్ తనకు తానే సాటిగా నిలిచాడు.

అయితే..2024 ఒలింపిక్స్ ప్రారంభానికి ముందే 90 మీటర్ల లక్ష్యాన్ని చేరుకోవాలన్న పట్టుదలతో నీరజ్ సాధన చేస్తున్నాడు. నీరజ్ సాధించిన అత్యుత్తమ రికార్డు 89 .94 మీటర్లు మాత్రమే.

First Published:  8 May 2024 10:56 AM GMT
Next Story