Telugu Global
Sports

భారత మహిళా షూటర్ కు పారిస్ ఒలింపిక్స్ బెర్త్!

భారత మహిళా షూటర్ కు పారిస్ ఒలింపిక్స్ బెర్త్!
X

పారిస్ ఒలింపిక్స్ షూటింగ్ లో పాల్గొనటానికి రికార్డుస్థాయిలో భారత షూటర్లు అర్హత సంపాదించారు. పాలక్ గులియా సైతం ఒలింపిక్ కోటా బెర్త్ ను కైవసం చేసుకోడం ద్వారా చరిత్ర సృష్టించింది.

2024-పారిస్ ఒలింపిక్స్ షూటింగ్ విభాగంలో భారత్ అతిపెద్ద బృందంతో పతకాలవేటకు గురిపెట్టింది. గతంలో ఎన్నడూ లేని విధంగా పురుషుల, మహిళల విభాగాలలో మొత్తం 20 మంది భారత షూటర్లు ఇప్పటికే ఒలింపిక్స్ బెర్త్ లను ఖాయం చేసుకోగలిగారు.

ఎయిర్ పిస్టల్ విభాగంలో పాలక్ అర్హత..

ఒలింపిక్స్ కోటా బెర్త్ ల కోసం రియో డి జెనీరో వేదికగా జరిగిన ప్రపంచ షూటింగ్ సమాఖ్య అర్హత పోటీల మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో పాలక్ గులియా కాంస్య పతకం సాధించడం ద్వారా పారిస్ ఒలింపిక్స్ బెర్త్ ను ఖాయం చేసుకోగలిగింది.

ఆసియాక్రీడల మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో బంగారు పతకం సాధించిన పాలక్ ప్రపంచ పోటీలలో మాత్రం మూడోస్థానంలో నిలువగలిగింది.

పాలక్ గులియా కాంస్య పతకం నెగ్గడంతో పారిస్ ఒలింపిక్స్ కు అర్హత సాధించిన భారత షూటర్ల సంఖ్య 20కి చేరింది.

ఒలింపిక్స్ అర్హత టోర్నీలో థాయ్ షూటర్ కమోన్ లాక్ సంచే 221.6 పాయింట్లతో బంగారు పతకం గెలుచుకోగా..ఆర్మీనియా షూటర్ ఇల్మిరా కరపెటియాన్ 220.4 పాయింట్లతో రజత, పాలక్ గులియా 217.6 పాయింట్లతో కాంస్య పతకాలు అందుకొన్నారు.

24 షాట్ల ఫైనల్లో పాలక్ ఎంతో ఏకాగ్రతతో రాణించి మూడో అత్యుత్తమ షూటర్ గా నిలువగలిగింది. హర్యానాలోని జజ్జర్ కు చెందిన 18 ఏళ్ల పాలక్ ఒలింపిక్స్ కు అర్హత సాధించడం ఇదే మొదటిసారి.

అతిపెద్ద బృందంతో భారత్ పోరు..

2021 టోక్యో ఒలింపిక్స్ షూటింగ్ లో 15 మంది సభ్యుల బృందంతో పాల్గొన్న భారత్ జులై- ఆగస్టు మాసాలలో జరుగనున్న పారిస్ ఒలింపిక్స్ లో మాత్రం 20 మంది సభ్యుల జట్టుతో సవాలు విసురుతోంది.

అదృష్టం కలసి వస్తే టీమ్ లేదా వ్యక్తిగత విభాగాలలో భారత్ షూటింగ్ పతకాలు సాధించే అవకాశం లేకపోలేదు.

First Published:  15 April 2024 10:30 AM GMT
Next Story