Telugu Global
Sports

రంజీ క్రికెటర్లకు ఇక సీజన్ కు కోటి?!

దేశవాళీ క్రికెటర్ల రొట్టె విరిగి నేతిలో పడింది. వచ్చే సీజన్ నుంచి మ్యాచ్ ఫీజు ఇక రెట్టింపు కానుంది.

రంజీ క్రికెటర్లకు ఇక సీజన్ కు కోటి?!
X

దేశవాళీ క్రికెటర్ల రొట్టె విరిగి నేతిలో పడింది. వచ్చే సీజన్ నుంచి మ్యాచ్ ఫీజు ఇక రెట్టింపు కానుంది.

భారత దేశవాళీ క్రికెటర్ల నెత్తిన పాలు పోయాలని..ప్రపంచంలోనే అత్యంత భాగ్యవంతమైన భారత క్రికెట్ బోర్డు నిర్ణయించింది. వచ్చే సీజన్ నుంచి రంజీట్రోఫీ మ్యాచ్ లు ఆడే ఆటగాళ్లకు భారీగా మ్యాచ్ ఫీజు ఇవ్వాలని భావిస్తోంది.

సీజన్ కు 75 లక్షల నుంచి కోటి వరకూ...

ప్రపంచంలోనే అత్యంత భాగ్యవంతమైన భారత క్రికెట్లో అంతర్జాతీయ క్రికెటర్లు, ఐపీఎల్ కాంట్రాక్టులు పొందిన ఆటగాళ్లు కోట్లకు పడగలెత్తుతుంటే..ఒళ్లు హూనం చేసుకొంటూ దేశవాళీ క్రికెట్ మ్యాచ్ లు ఆడే క్రికెటర్లు మాత్రం లక్షల రూపాయల మ్యాచ్ ఫీజులతో సరిపెట్టుకోవాల్సి వస్తోంది. అయితే..ఈ పరిస్థితిని సరిదిద్దాలని బీసీసీఐ గట్టిగా నిర్ణయించింది.

2024-25 రంజీ సీజన్ నుంచి దేశవాళీ క్రికెట్ టోర్నీలలో పాల్గొనే ఆటగాళ్ల కు మ్యాచ్ ఫీజుల రూపంలో 75 లక్షల రూపాయల నుంచి కోటి రూపాయల వరకూ అందచేయటానికి ప్రణాళిక సిద్ధం చేసింది.

దీనికి సంబంధించిన తుదినిర్ణయాన్ని బీసీసీఐ ఎంపిక సంఘం చైర్మన్ అజిత్ అగర్కార్ నేతృత్వంలోని బృందం ప్రకటించాల్సి ఉంది. దేశవాళీ క్రికెటర్లకు, ప్రధానంగా రంజీ క్రికెటర్లకు హేతుబద్దంగా మ్యాచ్ ఫీజులు చెల్లించే విధానానికి బీసీసీఐ రూపకల్పన చేసే పనిలో ఉంది.

రంజీ క్రికెటర్లకు మ్యాచ్ ఫీజులు ఇలా..

ప్రస్తుతం దేశవాళీ రంజీట్రోఫీ మ్యాచ్ ల్లో పాల్గొనే ఆటగాళ్లకు సీనియారిటీని బట్టి మ్యాచ్ ఫీజులు చెల్లిస్తూ వస్తున్నారు. 40కి పైగా రంజీమ్యాచ్ లు ఆడిన ప్లేయర్లకు రోజుకు 60వేల రూపాయలు, 21 నుంచి 40 మ్యాచ్ లు ఆడిన అనుభవం ఉన్నవారికి రోజుకు 50 వేల రూపాయలు, 20 కంటే తక్కువ మ్యాచ్ లు ఆడినవారికి 30వేల రూపాయలు చొప్పున మ్యాచ్ ఫీజులుగా బీసీసీఐ చెల్లిస్తూ వస్తోంది.

ఐపీఎల్ కాంట్రాక్టులు దక్కక తీవ్రనిరాశలో పడిపోయిన క్రికెటర్లను ఆదుకోడానికి వీలుగా రంజీ మ్యాచ్ ఫీజులు పెంచాలన్న ప్రతిపాదనలు గత ఏడాది నుంచి బీసీసీఐకి వస్తున్నాయి.

తమ కష్టానికి తగ్గ ఫలితం దక్కడం లేదన్న బాధను దేశవాళీ క్రికెటర్లలో లేకుండా చేయాలంటే రంజీమ్యాచ్ ఫీజులు పెంచడమే దారని బీసీసీఐ పెద్దలు గట్టిగా నిర్ణయించారు.

వచ్చే సీజన్ నుంచి రంజీ ట్రోఫీలో పాల్గొనే క్రికెటర్లకు 75 లక్షల రూపాయల నుంచి కోటి రూపాయల వరకూ మ్యాచ్ ఫీజులుగా అందే విధంగా చర్యలు తీసుకోనున్నారు.

ఇప్పటి వరకూ..రంజీట్రోఫీ ఫైనల్స్ వరకూ చేరిన జట్టులోని ఆటగాళ్లకు 25 లక్షల రూపాయలు, అంతకు ముందే నిష్క్ర్రమించిన జట్లలోని క్రికెటర్లకు 17 లక్షల నుంచి 22 లక్షల వరకూ మ్యాచ్ ఫీజుగా చెల్లిస్తున్నారు.

విజయ్ హజారే, సయ్యద్ ముస్తాక్ అలీ, దేవధర్, ఇరానీ ట్రోఫీ మ్యాచ్ ల్లో సైతం పాల్గొనే ఆటగాళ్లకు సైతం మ్యాచ్ ఫీజులుగా భారీగా పెంచనున్నారు. టీ-20 క్రికెట్ కంటే దేశవాళీ క్రికెట్లో పాల్గొనేలా యువక్రికెటర్లను ప్రోత్సహించడానికి వీలుగా రంజీమ్యాచ్ ఫీజులు పెంచాలని పలువురు బీసీసీఐకి గతంలోనే సూచించారు.

ఐపీఎల్ ముద్దు..దేశవాళీ వద్దు...

నేటితరం క్రికెటర్లలో ఇషాన్ కిషన్, దీపక్ చాహర్ లాంటి ఆటగాళ్లు కాసుల వర్షం కురిపించే ఐపీఎల్ కు ఇస్తున్న ప్రాధాన్యతను..రంజీక్రికెట్లో పాల్గొనటానికి ఇవ్వకపోడాన్ని బీసీసీఐ తీవ్రంగా పరిగణిస్తోంది.

దేశవాళీ క్రికెట్ మ్యాచ్ లు ఆడిన ఆటగాళ్లకు మాత్రమే భారతజట్టులో చోటు కల్పించేలా చర్యలు చేపట్టింది. భారతజట్టులో చోటుకు ఐపీఎల్ ఏమాత్రం ప్రాతిపదిక కాదని బీసీసీఐ తేల్చి చెప్పింది.

మొత్తం మీద దేశవాళీ క్రికెటర్లకు వచ్చే సీజన్ నుంచి మంచిరోజులేనని చెప్పక తప్పదు.

First Published:  26 April 2024 3:30 AM GMT
Next Story