Telugu Global
Sports

50వ పడిలో మాస్టర్ సచిన్..వాంఖడేలో విగ్రహం!

భారత క్రికెట్ ఆల్ టైమ్ గ్రేట్ మాస్టర్ సచిన్ టెండుల్కర్ 50వ పడిలోకి ప్రవేశించాడు. ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు సచిన్ పుట్టినరోజు వేడుకలను జరుపుకొంటున్నారు.

50వ పడిలో మాస్టర్ సచిన్..వాంఖడేలో విగ్రహం!
X

భారత క్రికెట్ ఆల్ టైమ్ గ్రేట్ మాస్టర్ సచిన్ టెండుల్కర్ 50వ పడిలోకి ప్రవేశించాడు. ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు సచిన్ పుట్టినరోజు వేడుకలను జరుపుకొంటున్నారు.

భారత క్రికెట్లోకి ఎందరో క్రికెటర్లు వచ్చారు, వెళ్లారు. అయితే..మాస్టర్ సచిన్ టెండుల్కర్ మాత్రం గత మూడున్నర దశాబ్దాలుగా భారత క్రికెట్ తో తన అనుబంధాన్ని కొనసాగిస్తూనే వస్తున్నాడు.

బాంద్రా నుంచి ప్రపంచ స్థాయికి...

సచిన్ రమేశ్ టెండుల్కర్....మొన్నటి, నిన్నటి, నేటితరాల క్రికెట్ కమ్ క్రీడాభిమానులకు అత్యంత సుపరిచితమైన పేరు. పరిచయం ఏమాత్రం అవసరమే లేని పేరు. కూడా. 1973 ఏప్రిల్ 24న ముంబైలోని బాంద్రాలోని ఓ మధ్యతరగతి కుటుంబంలో 49 సంవత్సరాల క్రితం జన్మించిన సచిన్...15 ఏళ్ల చిరుప్రాయంలోనే ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ప్రభంజనం సృష్టించాడు. 16 ఏళ్ల వయసులోనే భారత టెస్ట్ జట్టులో చోటు సంపాదించాడు.

ఆ తర్వాత నుంచి 22 సంవత్సరాల పాటు ఏకబిగిన క్రికెట్ కెరియర్ కొనసాగించి...రికార్డుల మోత మోగించాడు. ఇన్ స్టంట్ వన్డే క్రికెట్, సాంప్రదాయ టెస్ట్ క్రికెట్ అన్నతేడాలేకుండా...భారత, ప్రపంచ క్రికెట్ కే మూలవిరాట్టుగా నిలిచాడు. తన ఆటతీరు, ఎదిగినకొద్దీ ఒదిగి ఉండాలనే తత్వం, అంతకుమించి అసాధారణ వ్యక్తిత్వంతో...ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకొన్నాడు. జనసంమోహక క్రికెటర్ గా నీరాజనాలు అందుకొన్నాడు.

200 టెస్టుల ఒకే ఒక్కడు...

సాంప్రదాయ టెస్ట్ క్రికెట్లో 200 టెస్టులు, 51 సెంచరీలు, టన్నుల కొద్దీ పరుగులు, వన్డే క్రికెట్లో 443 వన్డేలు , 49 శతకాలు, 15వేలకు పైగా పరుగులు సాధించి... ఈఘనత సాధించిన ఒకే ఒక్కడిగా నిలిచాడు.

మానవసాధ్యంకాని ఎన్నో రికార్డులు నమోదు చేసి....ప్రపంచ క్రికెట్ తొలి సూపర్ మ్యాన్ గా గుర్తింపు తెచ్చుకొన్నాడు.

రెండు దశాబ్దాల తన అవిశ్రాంత క్రికెట్ కెరియర్ తర్వాత.....రిటైర్మెంట్ ప్రకటించిన సచిన్ ఆ తర్వాత...రాజ్యసభ సభ్యుడిగా, క్రికెటేతర క్రీడల ప్రమోటర్ గా సేవలు అందించాడు.

క్రికెట్ కు పూర్తిస్థాయి రిటైర్మెంట్ తర్వాత తన పూర్తిసమయాన్ని కుటుంబం, సమాజసేవల కోసమే కేటాయించి పాటుపడుతున్నాడు.

అప్నాలయ ట్రస్టు ద్వారా సేవ...

క్రికెటర్ గా ఉన్న సమయంలోనే తన కుటుంబసభ్యుల సహకారంతో ముంబైలోని మురికివాడల్లో నివసించే బాలల కోసం అప్నాలయ్ ట్రస్టును సచిన్ ఏర్పాటు చేసి సేవలు అందిస్తున్నాడు.

ముంబై మహానగరంలోని మురికివాడల పిల్లల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సచిన్..రాజ్యసభ్య సభ్యుడిగా పని చేసిన సమయంలో మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఒక్కో గ్రామాన్ని దత్తత తీసుకొని...అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేశాడు.

అంతేకాదు...రాజ్యసభ సభ్యుడిగా ఐదేళ్ల కాలానికి తాను అందుకొన్న 90 లక్షల రూపాయల జీతభత్యాలను సైతం...ప్రధానమంత్రి సహాయనిధికి అందచేసి తన పెద్దమనసు చాటుకొన్నాడు.

ఐపీఎల్ లో ముంబై మెంటార్ గా..

ఐపీఎల్ లో 2008 నుంచి 2013 వరకూ ముంబై ఫ్రాంచైజీకి ఆడిన సచిన్ ..రిటైర్మెంట్ తర్వాత నుంచి ముంబై ఇండియన్స్ కు మెంటార్ గా వ్యవహరిస్తున్నాడు. క్రికెటేతర క్రీడల అభివృద్ధికి తనవంతుగా పాటుపడుతున్నాడు.

ఇండియన్ సాకర్ లీగ్ లో కేరళ బ్లాస్టర్స్ కో-ఓనర్ గా, ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ లో...ముంబై జట్టు సహయజమానిగా ఉన్న సచిన్ క్రికేటతర క్రీడాకారులను సైతం పలు విధాలుగా ఆదుకొంటూ వస్తున్నాడు.

భారత రత్నతో మరింత ఎత్తుకు..

క్రికెట్ శిఖరం సచిన్ కు అవార్డులు, రివార్డులు ఏమాత్రం కొత్తకాదు. అయితే..భారతప్రభుత్వ అత్యున్నత పురస్కారం..భారతరత్నతో తన జీవితాన్ని సార్థకం చేసుకొన్నాడు.

క్రికెట్ కు సంబంధించి డజన్ల కొద్దీ అంతర్జాతీయ పురస్కారాలు , అవార్డులు అందుకొన్న సచిన్ ప్రస్తుతం భారత వైమానిక దళానికి గౌరవ గ్రూపు కెప్టెన్ గా సేవలు అందిస్తున్నాడు.

2023 ఏప్రిల్ 24న తన 50వ పుట్టినరోజు జరుపుకొంటున్న సచిన్ ను అపూర్వరీతిలో సత్కరించాలని ముంబై క్రికెట్ సంఘం నిర్ణయించింది.

వాంఖడేలో సచిన్‌ నిలువెత్తు విగ్రహం

భారత క్రికెట్ కు విశ్వవ్యాప్తంగా గుర్తింపు తీసుకు వచ్చిన తన ముద్దుబిడ్డ మాస్టర్ సచిన్ టెండుల్కర్ ను అపూర్వరీతిలో గౌరవించాలని ముంబై క్రికెట్ సంఘం నిర్ణయించింది.

భారత క్రికెట్ కే తలమానికంగా నిలిచే ముంబై వాంఖడే స్టేడియంలో సచిన్ నిలువెత్తు విగ్రహం ఏర్పాటు చేయనున్నట్లు ముంబై క్రికెట్ సంఘం ప్రకటించింది.

క్రికెట్‌కు సచిన్‌ చేసిన అసమాన సేవలకు గుర్తుగా ఓ చిరుకానుక ఇవ్వనున్నట్లు ముంబై క్రికెట్ సంఘం అధ్యక్షుడు అమోల్ కాలే తెలిపారు.ఏప్రిల్‌ 24న 50 పడిలోకి ప్రవేశిస్తున్న సచిన్‌ క్రికెట్‌లో పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.

దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న , అత్యున్నత క్రీడాపురస్కారం రాజీవ్ గాంధీ ఖేల్ రత్నకూడా సచిన్‌ను వరించింది. అటువంటి మేటి ఆటగాడిని సన్మానించుకోవడం తమ అదృష్టమని ఎంసీఏ అధ్యక్షుడు అమోల్‌ కాలె అన్నారు.

ఆస్ట్ర్రేలియా క్రికెట్ ప్రధాన స్టేడియం ఎమ్ సీజిలో లెగ్ స్పిన్ జాదూ షేన్‌ వార్న్‌ విగ్రహం ఏర్పాటు చేసిన విధంగానే ..ముంబై వాంఖడే స్టేడియంలో సచిన్‌ విగ్రహం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ యేడాది భారత్ వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్‌ సందర్భంగా సచిన్ విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

వాంఖడేతో పాతికేళ్ల అనుబంధం..

సచిన్ పుట్టిపెరిగిన ముంబై మహానగరంలోని వాంఖడే స్టేడియంలో విగ్రహం ఏర్పాటు చేయటానికి మాస్టర్ సమ్మతిని ముంబై క్రికెట్ సంఘం తీసుకొంది.ఈ సందర్భంగా సచిన్‌... వాంఖడేస్టేడియంతో పాతికేళ్ల తన అనుబంధాన్ని గుర్తు చేసుకొన్నాడు. 15 సంవత్సరాల చిరుప్రాయంలో తన కెరీర్‌ ఇక్కడే ప్రారంభమైందని, ఈ స్టేడియంతో తనకు విడదీయరాని అనుబంధముందని మురిసిపోయాడు. అంతేకాదు..రెండు దశాబ్దాల తన క్రికెట్ జీవితం ముగిసింది కూడా వాంఖడే స్టేడియంలోనేనంటూ సచిన్ భావోద్వేగానికి గురయ్యాడు.

ముంబై ఇండియన్స్- పంజాబ్ కింగ్స్ జట్ల 6వ రౌండ్ ఐపీఎల్ లీగ్ మ్యాచ్ జరిగే సమయంలోనే ముందస్తుగా సచిన్ 50వ పుట్టినరోజు వేడుకల కేకును మాస్టర్ సచిన్ తోనే కట్ చేయించారు.

అభినవ బ్రాడ్మన్ సచిన్ టెండుల్కర్ 50వ పుట్టినరోజు వేడుకలను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న లక్షలాదిమంది అభిమానులు సైతం జరుపుకొంటున్నారు. క్రికెట్ ఉన్నంతకాలం సచిన్ రికార్డులు, ఘనత చిరంజీవులుగా మిగిలిపోతాయి.

First Published:  24 April 2023 3:05 AM GMT
Next Story