Telugu Global
Sports

భారత టెన్నిస్ చుక్కాని సుమిత్ నగాల్!

ప్రపంచ టెన్నిస్ పురుషుల సింగిల్స్ లో 80వ ర్యాంక్ సాధించడం ద్వారా సుమిత్ నగాల్ భారత ఉనికిని కాపాడగలిగాడు. మోంటేకార్లో మాస్టర్స్ మెయిన్ డ్రాలో చోటు సంపాదించిన తొలి భారత ప్లేయర్ గా చరిత్ర సృష్టించాడు.

భారత టెన్నిస్ చుక్కాని సుమిత్ నగాల్!
X

ప్రపంచ టెన్నిస్ పురుషుల సింగిల్స్ లో 80వ ర్యాంక్ సాధించడం ద్వారా సుమిత్ నగాల్ భారత ఉనికిని కాపాడగలిగాడు. మోంటేకార్లో మాస్టర్స్ మెయిన్ డ్రాలో చోటు సంపాదించిన తొలి భారత ప్లేయర్ గా చరిత్ర సృష్టించాడు.

అంతర్జాతీయ టెన్నిస్ లో భారత్ కు ప్రత్యేకస్థానం ఉంది. రామనాథన్ కృష్ణన్, విజయ్ అమృత్ రాజ్, రమేశ్ కృష్ణన్, లియాండర్ పేస్, మహేశ్ భూపతి, రోహన్ బొపన్న లాంటి ఎందరో గొప్పగొప్ప ఆటగాళ్లను అందించిన ఘనత సైతం ఉంది. అయితే సోమ్ దేవ్ వర్మన్ లాంటి స్టార్స్ రిటైర్మెంట్ తో పురుషుల సింగిల్స్ లో భారత్ పోటీ నామమాత్రంగా మారిపోయింది.

ఒకే ఒక్కడు ....

రామ్ కుమార్, ప్రజ్ఞేశ్, సాకేత్ మైనేని లాంటి ఆటగాళ్లు ఎందరు తెరమీదకు వచ్చినా తమకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోలేకపోయారు. భారత టెన్నిస్ పైన ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయారు.

మహిళల డబుల్స్ లో సానియా మీర్జా, పురుషుల డబుల్స్ లో రోహన్ బొప్పన సాధించిన విజయాలు చూస్తూ భారత్ సరిపెట్టుకొనే పరిస్థితిలో పురుషుల సింగిల్స్ లో సుమిత్ నగాల్ నిలకడగా రాణిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోగలిగాడు. ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ మెయిన్ డ్రాకు అర్హత సాధించడం ద్వారా సింగిల్స్ తొలిరౌండ్ విజయంతో అందరి దృష్టి ఆకట్టుకొన్న సుమిత్..ఏటీపీ తాజా ర్యాంకింగ్స్ ప్రకారం 80వ స్థానంలో నిలవడం ద్వారా చరిత్ర సృష్టించాడు.

ఏటీపీ టూర్ ర్యాంకింగ్స్ లో భారత ఆటగాళ్లు గత దశాబ్దకాలంలో మొదటి 200 ర్యాంకుల్లో నిలవడమే గగనంగా మారింది. అలాంటి పరిస్థితి నుంచి ఓ భారత ఆటగాడు పురుషుల సింగిల్స్ లో టాప్-100లో ..అదీ 80వ ర్యాంక్ లో నిలవడాన్ని గొప్ప ఘనతగా చెప్పుకోవాలి.

మోంటేకార్లో మాస్టర్స్ లో మెరుపులు...

2024 ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ తొలిరౌండ్ విజయంతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకొన్ననగాల్..ఫ్రెంచ్ ఓపెన్ కు సన్నాహకంగా జరుగుతున్న మోంటే కార్లో మాస్టర్స్1000 టోర్నీలో చెలరేగిపోయాడు. క్వాలిఫైయింగ్ రౌండ్లలో తనకంటే మెరుగైన ర్యాంకుల్లో నిలిచిన ముగ్గురు ఆటగాళ్లను నగాల్ చిత్తు చేయడం అరుదైన ఘనతగా నిలిచిపోతుంది.

మాస్టర్స్ మెయిన్ డ్రాలో చోటు కోసం జరిగిన క్వాలిఫైయింగ్ రౌండ్లలో ఇటలీ ఆటగాడు ఫ్లావియో కోబొల్లీ, అర్జెంటీనా ఆటగాడు ఫాకుండో డియాజ్ అకోస్టాను చిత్తు చేసిన తీరు అందరినీ ఆ కట్టుకొంది.

8వ సీడ్ ఫ్లావియో కోబొల్లీ, 3వ సీడ్ ఫాకుండో డియాజ్ లతో పాటు..మెయిన్ డ్రా తొలిరౌండ్ పోరులో ఇటాలియన్ ఆటగాడు మాటియో ఆర్నాల్డీని 5-7, 6-2, 6-4తో అధిగమించాడు.

భారత టెన్నిస్ ఆల్ టైమ్ గ్రేట్ స్టార్లు విజయ్ అమృత్ రాజ్, రమేశ్ కృష్ణన్ తరువాత మోంటేకార్లో మాస్టర్స్ లో పాల్గొ్న్న భారత తొలి ఆటగాడి ఘనతను సుమిత్ నగాల్ దక్కించుకోగలిగాడు.

1990 నుంచి నిర్వహిస్తున్నమోంటేకార్లో మాస్టర్స్ క్లే కోర్టు టోర్నీ తొలిరౌండ్ విజయం సాధించిన భారత తొలి క్రీడాకారుడిగా కూడా రికార్డుల్లో చేరాడు.

13 ర్యాంకులు మెరుగైన నగాల్...

మోంటేకార్లో మాస్టర్స్ ప్రారంభానికి ముందు వరకూ 93వ ర్యాంకులో కొనసాగుతూ వచ్చిన నగాల్ తొలిరౌండ్ విజయం ద్వారా 13 స్థానాల మేర తన ర్యాంకును మెరుగు పరచుకోగలిగాడు.

రెండోరౌండ్ లో 7వ సీడ్ హోల్జర్ రునే చేతిలో ఓటమితో నగాల్ పోరుకు తెరపడింది. ఏటీపీ టూర్ ర్యాంకింగ్స్ చరిత్రలో అత్యుత్తమ ర్యాంకుల్లో నిలిచిన విజయ్ అమృత్ రాజ్, రమేశ్ కృష్ణన్, సోమ్ దేవ్ వర్మన్, శశి మీనన్, ఆనంద్ అమృత్ రాజ్, ప్రజ్ఞేశ్ ల సరసన సుమిత్ నగాల్ నిలిచాడు.

భారత్ కు చెందిన 7వ అత్యుత్తమ ర్యాంకర్ గా రికార్డుల్లో చేరాడు.

రోహన్ చేజారిన టాప్ ర్యాంక్...

మోంటేకార్లో పురుషుల డబుల్స్ ప్రీ- క్వార్టర్ లోనే పరాజయం పొందడంతో ఇప్పటి వరకూ ప్రపంచ నంబర్ వన్ ర్యాంకులో కొనసాగుతూ వచ్చిన వెటరన్ రోహన్ బొపన్న రెండోర్యాంకుకు పడిపోయాడు.

ఆస్ట్ర్రేలియా ఆటగాడు మాథ్యూ ఇబెడెన్ తో జంటగా రోహన్ బొపన్న పాల్గొంటున్న సంగతి తెలిసిందే.

First Published:  16 April 2024 1:17 PM GMT
Next Story