Telugu Global
Sports

ఐపీఎల్ లో రికార్డుల వెల్లువ, హైదరా..బాదుడే బాదుడు!

ఐపీఎల్ 17 సీజన్లలో హైదరాబాద్ సన్ రైజర్స్ ప్రపంచ రికార్డుల మోతతో సరికొత్త చరిత్ర సృష్టించింది. తన రికార్డులను తానే అధిగమించుకొంటూ ప్రత్యర్ధిబౌలర్లను బెంబేలెత్తిస్తోంది.

ఐపీఎల్ లో రికార్డుల వెల్లువ, హైదరా..బాదుడే బాదుడు!
X

ఐపీఎల్ 17 సీజన్లలో హైదరాబాద్ సన్ రైజర్స్ ప్రపంచ రికార్డుల మోతతో సరికొత్త చరిత్ర సృష్టించింది. తన రికార్డులను తానే అధిగమించుకొంటూ ప్రత్యర్ధిబౌలర్లను బెంబేలెత్తిస్తోంది...

ఐపీఎల్-2024 డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ తొలిదశ పోటీలే రసపట్టుగా సాగుతున్నాయి. 10 జట్ల మొదటి 30 మ్యాచ్ ల్లోనే ప్రపంచ రికార్డుల మోత మోగుతోంది.

మాజీ చాంపియన్ హైదరాబాద్ సన్ రైజర్స్ ప్రస్తుత సీజన్ మొదటి ఆరురౌండ్లలోనే రెండు సరికొత్త రికార్డులను నమోదు చేసింది.

చిన్నస్వామి స్టేడియంలో పెద్దరికార్డులు...

బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ చాలెంజర్స్ తో జరిగిన హైస్కోరింగ్ వార్ లో మాజీ చాంపియన్ హైదరాబాద్ సన్ రైజర్స్ చెలరేగిపోయింది. 20 ఓవర్లలో కేవలం 3 వికెట్ల నష్టానికే రికార్డుస్థాయిలో 287 పరుగుల స్కోరు సాధించింది.

ఈ 6వ రౌండ్ పోరులో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన సన్ రైజర్స్ కు ఓపెనింగ్ జోడీ అభిషేక్ శర్మ- ట్రావిస్ హెడ్ మొదటి వికెట్ కు 8.1 ఓవర్లలోనే 108 పరుగులతో సరికొత్త రికార్డు భాగస్వామ్యాన్ని అందించారు.

ట్రావిస్ హెడ్ కేవలం 41 బంతుల్లోనే 9 ఫోర్లు, 8 సిక్సర్లతో 102 పరుగులు, అభిషేక్ 34, క్లాసెన్ 67, మర్కరమ్ 32, సమద్ 37 పరుగులు సాధించడంతో సన్ రైజర్స్ 287 పరుగుల స్కోరుతో తన రికార్డును తానే అధిగమించుకోగలిగింది.

టీ-20 చరిత్రలో అత్యధికంగా 20 ఓవర్లలో 3 వికెట్లకు 314 పరుగుల ప్రపంచ రికార్డు స్కోరు సాధించిన ఘనత పసికూన నేపాల్ పేరుతో ఉంది. ఆసియాక్రీడల క్రికెట్లో భాగంగా మంగోలియాతో జరిగిన పోరులో నేపాల్ ఈ రికార్డు నెలకొల్పగలిగింది.

ఐపీఎల్ చరిత్రలో ఇదే అత్యుత్తమ స్కోరు...

ఐపీఎల్ 17 సీజన్ల చరిత్రలో మొదటి రెండు అత్యుత్తమ టీమ్ స్కోర్లు సాధించిన ఏకైకజట్టుగా హైదరాబాద్ సన్ రైజర్స్ నిలిచింది. ప్రస్తుత సీజన్లోనే హోంగ్రౌండ్ హైదరాబాద్ రాజీవ్ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్ తో జరిగిన పోరులో 3 వికెట్లకు 277 పరుగుల రికార్డు స్కోరు సాధించిన సన్ రైజర్స్ ..కొద్దిరోజుల వ్యవధిలోనే తన రికార్డును తానే తిరగరాసుకోగలిగింది.

ఫ్రాంచైజీ క్రికెట్ చరిత్రలోనే అత్యధిక టీమ్ స్కోరు సాధించిన జట్టుగా హైదరాబాద్ సన్ రైజర్స్ చరిత్ర సృష్టించింది. బెంగళూరు బౌలర్లలో లాకీ ఫెర్గూసన్ 2 వికెట్లు, టోప్లే 1 వికెట్ పడగొట్టారు.

దినేశ్ కార్తీక్ ఒంటరిపోరాటం...

288 పరుగుల టార్గెట్ తో చేజింగ్ కు దిగిన బెంగళూరు రాయల్ చాలెంజర్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 262 పరుగుల స్కోరు మాత్రమే సాధించి..25 పరుగుల ఓటమి చవిచూసింది.

అయితే..ఐపీఎల్ చరిత్రలోనే చేజింగ్ కు దిగి..రెండో ఇన్నింగ్స్ లో అత్యధిక స్కోరు సాధించిన జట్టుగా రాయల్ చాలెంజర్స్ సరికొత్త రికార్డు నమోదు చేయగలిగింది.

ఓపెనర్లు విరాట్ కొహ్లీ (42 ), డూప్లెసిస్ ( 62 ) స్కోర్లకే వెనుదిరిగినా..టాపార్డర్ విఫలమైనా..మిడిలార్డర్లో దినేశ్ కార్తీక్ కేవలం 35 బంతుల్లోనే 5 ఫోర్లు, 7 సిక్సర్లతో 83 పరుగులతో వీరోచిత పోరాటమే చేశాడు.

మహీపాల్ లోమ్ రోర్ 19, అనూజ్ రావత్ 25 పరుగుల స్కోర్లతో దినేశ్ కార్తీక్ కు తోడుగా నిలిచినా ప్రయోజనం లేకపోయింది.

హైదరాబాద్ బౌలర్లలో లెగ్ స్పిన్నర్ మయాంక్ మార్కెండే 2 వికెట్లు, కమిన్స్ 3 వికెట్లు, నటరాజన్ 1 వికెట్ పడగొట్టారు.

సన్ రైజర్స్ రికార్డు విజయంలో ప్రధానపాత్ర వహించిన ట్రావిస్ హెడ్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

ఫోర్ల హోరు..సిక్సర్ల జోరు...రికార్డుల వెల్లువ...

హైదరాబాద్- బెంగళూరు జట్ల ఈ సమరం బౌండ్రీల హోరు, సిక్సర్ల జోరు, రికార్డుల వెల్లువలా సాగింది. కేవలం 40 ఓవర్లలో రెండుజట్లూ కలసి 549 పరుగులు సాధించడం ఐపీఎల్ చరిత్రలో ఇదే మొదటిసారి.

ఐపీఎల్ చరిత్రలో ఇప్పటి వరకూ నమోదైన మొదటి ఐదు అత్యుత్తమ స్కోర్లలో..నాలుగు అత్యధిక స్కోర్లు ప్రస్తుత సీజన్ మొదటి 30 మ్యాచ్ ల్లోనే నమోదు కావడం విశేషం.

రెండుజట్ల బ్యాటర్లు కలసి 81 బౌండ్రీలు బాదడం ప్రపంచ రికార్డుగా నిలిచిపోతుంది. మొత్తం 81 హిట్లలో 38 సిక్సర్లు, 43 ఫోర్లు ఉన్నాయి. సన్ రైజర్స్ బ్యాటర్లు మొత్తం 22 సిక్సర్లు బాదడం ద్వారా ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సిక్సర్లు బాదినజట్టుగా హైదరాబాద్ ను నిలిపారు.

రెండుజట్లూ కలసి ఏడు 50 పరుగుల భాగస్వామ్యాలు నమోదు చేయడం కూడా ఇదే మొదటిసారి. మొత్తం మీద అరడజనుకు పైగా సరికొత్త రికార్డులు ఈ మ్యాచ్ ద్వారా వచ్చి చేరాయి.

ఈ విజయంతో మొదటి 6 రౌండ్లలో నాలుగో గెలుపుతో సన్ రైజర్స్ పాయింట్ల పట్టిక 4వ స్థానంలో నిలిచింది. రాజస్థాన్, కోల్ కతా, చెన్నై మొదటి మూడుస్థానాలలో కొనసాగుతున్నాయి.

మొత్తం 7 మ్యాచ్ లు ఆడిన బెంగళూరు ఐదు వరుస పరాజయాలు, ఒకే ఒక్క గెలుపుతో లీగ్ టేబుల్ ఆఖరి స్థానానికి పడిపోయింది. ఐదుసార్లు విజేత ముంబై ఇండియన్స్ 6 రౌండ్లలో 2 విజయాలు, 4 పరాజయాలతో 4 పాయింట్లు సాధించడం ద్వారా లీగ్ టేబుల్ 8వ స్థానంలో కొట్టిమిట్టాడుతోంది.

First Published:  16 April 2024 7:02 AM GMT
Next Story