Telugu Global
Sports

టీ-20 ప్రపంచకప్ ప్రచారకర్తగా మానవచిరుత!

2024-ఐసీసీ టీ-20 ప్రపంచకప్ ప్రచారకర్తగా దిగ్గజ రన్నర్, జమైకన్ థండర్ ఉసెన్ బోల్ట్ వ్యవహరించనున్నాడు.

టీ-20 ప్రపంచకప్ ప్రచారకర్తగా మానవచిరుత!
X

2024-ఐసీసీ టీ-20 ప్రపంచకప్ ప్రచారకర్తగా దిగ్గజ రన్నర్, జమైకన్ థండర్ ఉసెన్ బోల్ట్ వ్యవహరించనున్నాడు.

పరుగులో జగజ్జేత, మానవ చిరుత ఉసెన్ బోల్ట్ సరికొత్త అవతారం ఎత్తాడు. 2024-ఐసీసీ టీ-20 ప్రపంచకప్ కు ప్రచారకర్తగా వ్యవహరించనున్నాడు.

వెస్టిండీస్, అమెరికా దేశాల సంయుక్త ఆతిథ్యంలో మరో మూడుమాసాలలో జరిగే 2024- ఐసీసీ టీ-20 ప్రపంచకప్ సన్నాహాలు జోరందుకొన్నాయి. తొలిసారిగా 20 జట్లతో నిర్వహిస్తున్నఈ టోర్నీకి బ్రాండ్ అంబాసిడర్ గా జమైకన్ థండర్ ఉసెన్ బోల్ట్ ను నియమించినట్లు ఐసీసీ ప్రకటించింది.

జూన్ 1 నుంచి 29 వరకూ ప్రపంచకప్...

జూన్ 1 నుంచి 29 వరకూ జరిగే టీ-20 ప్రపంచకప్ మ్యాచ్ లకు వెస్టిండీస్ బోర్డు పరిథిలోని కరీబియన్ ద్వీప దేశాలతో పాటు..అమెరికాలోని ఫ్లారిడా వేదికగానూ పోటీలు నిర్వహంచనున్నారు.

విశ్వవ్యాప్తంగా ఈ పోటీల ప్రచారం జోరందుకొంది. 2008 బీజింగ్ ఒలింపిక్స్ పురుషుల 100 మీటర్లు, 200 మీటర్ల పరుగుతో పాటు 400 మీటర్ల రిలే పరుగులో సైతం ప్రపంచ రికార్డు టైమింగ్ తో పాటు బంగారు పతకాలు సాధించిన మానవ చిరుత ఉసెన్ బోల్ట్ సైతం టీ-20 ప్రపంచకప్ ప్రచారాన్ని నిర్వహించనున్నాడు.

పురుషుల 100 మీటర్ల పరుగును 9.58 సెకన్లు, 200మీటర్ల పరుగును 19.19 సెకన్లు, 400 మీటర్ల రిలేను 36. 84 సెకన్ల టైమింగ్ తో నెలకొల్పిన ప్రపంచ రికార్డులు ఇప్పటికీ ఉసెన్ బోల్ట్ పేరుతోనే ఉన్నాయి.

ఆనందడోలికల్లో ఉసెన్ బోల్ట్...

తనకు ఎంతో ఇష్టమైన క్రికెట్ ఆటకు ప్రచారకర్త కావడం గర్వకారణమని, ప్రపంచకప్ కు తనను ఐసీసీ బ్రాండ్ అంబాసిడర్ గా నియమించడం తన అదృష్టమని బోల్ట్ చెప్పాడు.

కరీబియన్ ద్వీప దేశాల ప్రజల దైనందినజీవితంలో క్రికెట్ ఓ ప్రధానభాగమని, ఏ ద్వీపానికి వెళ్లినా క్రికెట్ ఆడుతూనే కనిపిస్తారని, తన గుండెల్లో క్రికెట్ కు ప్రత్యేక స్థానముందని బోల్ట్ ప్రకటించాడు.

అమెరికాలాంటి దేశం వేదికగా ప్రపంచకప్ క్రికెట్ మ్యాచ్ లు నిర్వహించడం గొప్ప విషయమని, క్రికెట్ కు ఇది ఎంతో మేలు చేస్తుందని చెప్పాడు. 2028 లాస్ ఏంజలిస్ ఒలింపిక్స్ లో క్రికెట్ ను పతకం అంశంగా ప్రవేశపెట్టడం కూడా గొప్ప పరిణామమని చెప్పాడు.

2024 టీ-20 ప్రపంచకప్ ప్రత్యేక ప్రచార గీతాన్ని విఖ్యాత గాయకులు సీన్ పాల్, కెస్ లతో కలసి బోల్ట్ వచ్చే వారం ఆవిష్కరించనున్నాడు.

ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులున్న ఉసెన్ బోల్ట్ ప్రపంచకప్ ప్రచారకర్త బాధ్యతలు చేపట్టడం తమకు ఎనలేని సంతోషాన్ని కలిగించిందని, పరుగుతో పాటు క్రికెట్ కూడా బోల్ట్ కు ఇష్టమని ఐసీసీ ప్రధానకార్యనిర్వహణాధికారి జెఫ్ అలార్ డెస్ ప్రకటించారు.

55 మ్యాచ్ లతో టీ-20 ప్రపంచకప్...

టీ-20 ప్రపంచకప్ గ్రూపులీగ్ కమ్ నాకౌట్ రౌండ్ మ్యాచ్ లను కరీబియన్ ద్వీపాలలోని ఆరు ( బార్బడోస్ లోని కెన్సింగ్టన్ ఓవల్, ట్రినిడాడ్ లోని బ్రియాన్ లారా అకాడమీ స్టేడియం, గయానాలోని ప్రావిడెన్స్ స్టేడియం, ఆంటీగా లోని సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియం, సెయింట్ లూకాలోని డారెన్ సామీ క్రికెట్ గ్రౌండ్, సెయింట్ విన్సెంట్ లోని ఆర్నోస్ వాలే స్టేడియం ) వేదికలుగాను, అమెరికాలోని మూడు ( న్యూయార్క్ లోని ఐసెన్ హోవర్ పార్క్, ఫ్లారిడాలోని లాడెర్ హిల్, , టెక్సస్ లోని గ్రాండ్ ప్రయరీ) వేదికల్లోనూ 55 మ్యాచ్ ల గ్రూప్ లీగ్ కమ్ నాకౌట్ ప్రపంచకప్ మ్యాచ్ లు నిర్వహించనున్నారు.

జూన్ 1 నుంచి 18 వరకూ గ్రూప్ లీగ్ పోటీలు..

జూన్ 1 నుంచి 18 వరకూ గ్రూపు దశ పోటీలు జరుగుతాయి. జూన్ 19 నుంచి 24 వరకూ సూపర్ - 8, జూన్ 26, 27 తేదీలలో సెమీఫైనల్స్, జూన్ 29న ఫైనల్స్ నిర్వహిస్తారు.

గ్రూప్- ఏ లీగ్ లో హాట్ ఫేవరెట్ భారత్, మాజీ చాంపియన్ పాకిస్థాన్ జట్లతో ఐర్లాండ్, కెనడా, అమెరికా జట్లు తలపడతాయి.

గ్రూపు- బీ లీగ్ లో ఇంగ్లండ్, ఆస్ట్ర్రేలియా, నమీబియా, స్కాట్లాండ్, ఒమన్ జట్లు పోటీపడతాయి. గ్రూప్- సీ లీగ్ లో న్యూజిలాండ్, అప్ఘనిస్థాన్, ఉగాండా, పాపువా న్యూగినియా, గ్రూప్- డీ లో దక్షిణాఫ్రికా, శ్రీలంక, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్, నేపాల్ ఢీ కొంటాయి.

First Published:  25 April 2024 6:56 AM GMT
Next Story