మేకతోక (For Children)

పూర్వం ఒక గ్రామంలో ఏడుగురు అన్నదమ్ములు ఉండేవాళ్ళు. వాళ్ళందరికీ పెళ్ళయింది. అందరూ కలిసి జీవించేవారు. ఉదయాన్నే అన్నదమ్ములంతా పొలం వెళితే మధ్యాహ్నానికి వాళ్ళ భార్యలు వంట వండి పొలానికి తీసుకెళ్లేవాళ్ళు. అట్లా ప్రశాంతంగా జీవిస్తూ కాలం గడుపుతూ ఉన్నారు.

అన్నదమ్ములు గ్రామదేవతకు జంతువును బలిఇస్తామని మొక్కుకున్నారు. ఒక మేకను కొనిబాగా మేపారు. పండుగ దినం కోసం ఎదురుచూశారు.

ఒకరోజు కుటుంబమంతా పొలం దగ్గర ఉంటే హఠాత్తుగా రాజభటుల వచ్చి ఏడుగురు అన్నదమ్ముల్ని బంధించి రాజు దగ్గరకు తీసుకుపోయారు. కారణం ప్రతి సంవత్సరం వాళ్ళు చెల్లిస్తున్న నాగలి పన్ను సకాలంలో చెల్లించకపోవడమే. సంవత్సరం ఆరంభంలో ఇంట్లోని ప్రతి నాగలికీ ఇంతని రాజుగారికి పన్ను చెల్లించాలి. అన్నదమ్ములు ఆ విషయం మరచిపోయారు.

భర్తల్ని రాజభటులు బంధించుకుపోయే సరికి ఏడుగురు ఆడవాళ్ళు దిగాలు పడిపోయారు. ఇప్పుడు ఏంచెయ్యాలన్న ఆలోచనలో పడ్డారు.

ఏది ఆగినా అమ్మవారి మొక్కు చెల్లించడం మటుకు యథావిధిగా జరిగి తీరాలని నిర్ణయించారు. ఆ పూజా విధానమంతా ఇంటికి పెద్ద కోడలు నిర్వహించాలని తీర్మానించారు. పూజా విధానంతో తనకు సహకరించాలలని తన చెల్లెళ్ళు ఆరుమందిని అడిగింది. సరేనన్నారు. మేకను అమ్మవారికి కూడా పెద్దకోడలే బలి ఇవ్వాలి. పెద్దకోడలు ఆలోచనలో పడింది. అమ్మవారిక బలి ఐతే ఇవ్వాలి. ఐతే మేకలో ఎక్కడ ప్రాణం ఉందో వెతికి ఆ భాగాన్నే అమ్మవారికి బలియిస్తే ఎలా ఉంటుంది? అని చెల్లెళ్ళనడిగింది. సరేనన్నారు. అందరూ మేకను శ్రద్ధగా పరిశీలించారు. దాంట్లోఎక్కడ ప్రాణం కదుల్తుందో పరిశీలించారు. మాటిమాటికీ కదిలించే తోకను చూసి మేక ప్రాణంతోకలో ఉందని తీర్మానించారు. అందరూ గట్టిగా మేకను పట్టుకుంటే పెద్దకోడలు కత్తితో మేకతోకను తెగ్గోసింది. మేకబాధతో మేమే అనుకుంటూ పట్టువిడిపించుకుని పారిపోయింది. అందరూ వెంటబడ్డారు. పొలాల గుండా మేక కొండల్లోకి పారిపోయింది. మేక కనిపించక అందరూ ఇంటికి తిరిగి వచ్చారు.

ఉదయాన్నే రాజుగారి భటులు బంధించుకుపోయిన భర్తలు ఏడుగురు ఇంటికి తిరిగి వచ్చారు. నాగలి పన్నుగా ఒక మేకను ఇస్తానని రాజుగారితో ఒప్పందం కుదుర్చుకుని వచ్చారు. వస్తే మేకలేదు. విషయం తెలుసుకుని అన్నదమ్ములు నవ్వారు. తమ భార్యల తెలివితక్కువతనానికి వాళ్ళకు నవ్వు వచ్చింది. వెంటనే కొండల్లో వెతికి మేకను పట్టుకుని పన్నుగా రాజుకు సమర్పించుకున్నారు.

– సౌభాగ్య

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here