చిరుతపులి తోక

చిరుత పులిని దానితోక గుండాపట్టుకోవడం గురించిన మాటలు మలయాళంలో సుప్రసిద్ధమైనవి.

ఎవడయినా దిక్కు తోచకుండా వుంటే అయోమయంలో వుంటే అతన్ని చిరుతపులిని తోకగుండా పట్టుకో అనడం ఆనవాయితీ కింద మారింది.

పూర్వం కేరళలో ఒక తెలివైన వ్యాపారుస్థుడు వుండేవాడు. అతను చాలా చురకయిన వాడు రోజు తన సరుకుల్ని తీసుకుని పక్క గ్రామాలకు వెళ్ళి వ్యాపారం చేసుకుని చీకటి పడకముందే యింటికి చేరేవాడు.

ఒక రోజు మధ్యాహ్నమే తన వ్యాపారం ముగించుకుని తన గ్రామం బయల్దేరాడు. మధ్యలో ఒక చిన్న అడవి వుంది. అది దాటితే తన గ్రామం, పైగా మధ్యాహ్నం ఎండ, ఎట్లాంటి జంతు భయము వుండదులే అనుకుని బయల్దేరాడు.

అనుకోకుండా ఒక చిరుతపులి ఎదురయింది. అది వూహించని విష యం చిరుతపులిని చూసి అతను ఆశ్యర్యపడ్డాడు. చిరుతపులి అతని మీదకు లంఘించి అతన్ని చంపి తినడానికి సిద్ధంగా వుంది.

వ్యాపారికి ఏం చెయ్యాలో పాలు పోలేదు. కానీ ఏదో చేయ్యాలి కదా! అది తన మీదకు లంఘించేలోగా దాని తోక పట్టుకుని దాని చుట్టూ తిరిగాడు. అది అతన్ని అందుకోబోతే అతను అందలేదు. కారణం దాని తోక పట్టుకుని దాని చుట్టూ తిరగడమే. ఆ ఆట కొనసాగుతోంది.

అతనూ అలసిపోతున్నాడు. పులికూడా అలసిపోతోంది. ఈ లోగా దాని చుట్టూ తిరగడం వల్ల అతని నడుంచుట్టూ కట్టుకున్న డబ్బు సంచి నాణేలు చెల్లా చెదరుగా పడ్డాయి. ఎండకు మెరిసిపోతున్నాయి.

అందినట్టే దగ్గరికి వచ్చి అతను అందకుండా పులిచుట్టూ తిరుగుతున్నాడు.

యింతలో ఆ దారంటీ ఒక వ్యక్తి వచ్చాడు. వ్యాపారుస్థుడు, పులి ఒకరివెనక ఒకరు తిరగడం, అక్కడ నాణేలు చెల్లా చెదరుగా పడివుండడం అతనికి ఆశ్చర్యాన్ని కలిగించింది.

అతను వ్యాపారుస్థుడితో ‘ఎందుకునువ్వు చిరుతపులి తోకను పట్టుకుని తిరుగుతున్నావు’ అన్నాడు.

వ్యాపారస్థుడు ఈ చిరుతపులి తోకను పట్టుకు లాగే కొద్దీ కావలసినన్ని నాణేలు పడుతాయి. కావాలంటే నువ్వు ప్రయత్నించి చూడు’ అన్నాడు.

ఆ వ్యక్తి దగ్గరకొచ్చాడు. వ్యాపారస్థుడు చిరుతపులి తోకను అతనికి అందించాడు చిరుపులి మీదకు వచ్చినకొద్దీ అతను తోకపట్టుకుని దానితో బాటు అందకుండా తిరగడం ప్రారంభించాడు.

ఈలోగా వ్యాపారస్థుడు కిందపడిన తన డబ్బులన్నిటీ పోగుచేసుకుని అక్కణ్ణించీ వెళ్ళిపోయాడు.

– సౌభాగ్య

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here