ఇద్దరు కూతుళ్ళు (For Children)

కురవలు అనే ఒక గిరిజనుల తెగ వాళ్ళలో ఒక పేదవాడు వుండేవాడు. అతనికి యిద్దరు కూతుళ్ళు. పెద్ద కూతుర్ని ఒక పేదవానికిచ్చి పెళ్ళిచేశాడు. చిన్నమ్మాయికి అనుకోకుండా ఒక ధనవంతుల కుటుంబంలో సంబంధం కుదిరింది. కారణం వాళ్ళు ఏదో వ్యాపారం చేసి బాగా గడించారు.

ఒక సారి తండ్రి పెద్దమ్మాయి యింటికి వెళ్ళాడు అక్కడ ఎంతో ఆనందంగా గడిపాడు. అక్కడి ఆహారంతో ఎంతో సంతృప్తి పడ్డాడు. ఎండు చేపల పులుసు, వేడివేడి అన్నం మహారుచిగా వుంది భోజనం. పల్చటి చాపమీద రాత్రి పడుకున్నాడు సంతోషంతో యింటికి తిరిగివచ్చాడు. భార్య పెద్దమ్మాయి ఎట్లావుంది అంది. ‘అమ్మాయి చాలా నెమ్మదిగా, ఆనందంగావుంది’ అన్నాడు.

కొన్నాళ్ళకు రెండో అమ్మాయి ఇంటికి వెళ్ళాడు వాళ్ళు ధనవంతులు కదా! యిల్లు చాలా పెద్దది. పొద్దున్నే పళ్ళుతోముకోడానికి ఏదో పౌడర్‌ యిచ్చే వాళ్ళు అదిమింగేశాడు గొంతంతా ఎలాగోలా ఐంది. రకరకాల వంటలు ఏదితీనాలో తెలీలేదు. రాత్రికి ఎత్తయిన పరుపు పెద్దమంచం మీద వేశారు. దానికి ఓ దొమతెర రాత్రంతా వూపిరాడనట్లు చాలా యిబ్బంది పడ్డాడు. పొద్దున్నే యింటికి తిరిగి వచ్చాడు.

రెండో అమ్మాయి ఎలావుంది? అంది భార్య ‘అమ్మాయి బాగానే వుంది కానీ నాకే అంతా యిబ్బందిగా వుంది’ అన్నాడు భర్త.

– సౌభాగ్య

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here