Telugu Global
Telangana

లాజిక్ మిస్ అయిన అమిత్ షా టార్గెట్

తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీకి ఓట్లు వేయడం వృథా అని అన్నారు అమిత్ షా. ఆయా పార్టీలకు ఓటు వేస్తే దుర్వినియోగం అవుతుందని తెలంగాణ ప్రజలు బీజేపీకి పట్టం కట్టాలని అన్నారు.

లాజిక్ మిస్ అయిన అమిత్ షా టార్గెట్
X

మూడు నెలల క్రితం జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెల్చుకున్న సీట్లు 8. అంటే 119 సీట్ల తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ వాటా కేవలం 6.7 శాతం. ఆ లెక్కన చూస్తే తెలంగాణలోని 17 లోక్ సభ స్థానాల్లో బీజేపీ గెలవగలిగేది కేవలం ఒక సీటు మాత్రమే. పోనీ 2019 సార్వత్రిక ఎన్నికల్లో 4 సీట్లు గెలిచాం కదా అనుకున్నా ఇప్పుడు అంతకంటే ఎక్కువ గెలిచే సీన్ బీజేపీకి ఉందనుకోలేం. కానీ కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాత్రం తెలంగాణలో బీజేపీ టార్గెట్ 12 లోక్ సభ స్థానాలు అని తేల్చి చెప్పారు. లాజిక్ అందని ఈ సంఖ్య స్థానిక నేతల్ని కూడా అయోమయంలో పడేసింది.


రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 400కి పైగా ఎంపీ సీట్లు గెలిచేందుకు బీజేపీ వ్యూహ రచన చేసిందని అంటున్న అమిత్ షా, అందులో తెలంగాణ వాటా 12 సీట్లు అని తేల్చి చెప్పారు. సికింద్రాబాద్‌లో సోషల్ మీడియా వారియర్స్ తో జరిగిన సమావేశంలో పాల్గొన్న ఆయన.. తెలంగాణ బీజేపీ సైబర్ యోధులకు ధన్యవాదాలు తెలిపారు. అతి త్వరలో లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ వస్తుందని, మళ్లీ బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు.

వారికి వేసిన ఓటు వృథా..

తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీకి ఓట్లు వేయడం వృథా అని అన్నారు అమిత్ షా. ఆయా పార్టీలకు ఓటు వేస్తే దుర్వినియోగం అవుతుందని తెలంగాణ ప్రజలు బీజేపీకి పట్టం కట్టాలని అన్నారు. ఆరు గ్యారెంటీల విషయంలో కాంగ్రెస్ ప్రకటనలకే పరిమితం అయిందన్నారు. దేశంలో ఎవరిని అడిగినా బీజేపీ ప్రభుత్వాన్ని మెచ్చుకుంటున్నారని, మేనిఫెస్టోలో హామీలన్నీ నెరవేరుస్తున్నామని చెప్పారు. పదేళ్లలో ఎన్నో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నట్టు తెలిపారు అమిత్ షా. దేశంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ను మారుస్తామన్నారు. అవినీతిరహిత భారత్‌ నిర్మాణమే తమ లక్ష్యం అన్నారు.

తెలంగాణలోని మూడు పార్టీలు 10కి పైగా స్థానాలు తమవేనని చెబుతున్నాయి. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ ఆ స్థాయిలో టార్గెట్ పెట్టుకోవడం సహజమే. కానీ మూడు నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 8 స్థానాలకు పరిమితం అయిన బీజేపీ కూడా ఇప్పుడు 12 లోక్ సభ స్థానాలు గెలిచేస్తామని చెప్పడం విడ్డూరం. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా అమిత్ షా ఇలాగే హడావిడి చేశారు, ఇప్పుడు కూడా తెలంగాణలో ఆయన హడావిడి మొదలైంది.

First Published:  12 March 2024 10:31 AM GMT
Next Story