Telugu Global
Telangana

ఓల్డ్ సిటీలో విద్యుత్ సరఫరా మెరుగుపరచడానికి రూ.1,404 కోట్ల వ్యయం

పాతనగరంలో ఇప్పటికే రూ.1,330.94 కోట్ల మేర పనులు పూర్తయ్యాయని.. మరో రూ.73.64 కోట్ల పనులు పురోగతిలో ఉన్నట్లు మంత్రి తెలిపారు.

ఓల్డ్ సిటీలో విద్యుత్ సరఫరా మెరుగుపరచడానికి రూ.1,404 కోట్ల వ్యయం
X

హైదరాబాద్ ఓల్డ్ సిటీ ప్రాంతంలో విద్యుత్ సరఫరాను మెరుగు పరచడానికి రూ.1,404.58 కోట్ల మేర ఖర్చు చేస్తున్నారు. కొత్త నగరానికి ధీటుగా.. పాత నగరంలో కూడా నాణ్యమైన, నిరంతరాయమైన విద్యుత్ అందించడానికి అదనంగా సబ్‌స్టేషన్లు, ట్రాన్స్‌ఫార్మర్లు, లైన్లు నిర్మించాల్సి ఉన్నది. ఈ మేరకు ఇప్పటికే ట్రాన్స్‌కో, టీఎస్‌ఎన్‌పీడీసీఎల్ ఆధ్వర్యంలో విద్యుత్ నిర్మాణాలు చేపట్టినట్లు విద్యుత్ శాఖ మంత్రి గుండకంట్ల జగదీశ్ రెడ్డి తెలిపారు.

పాతనగరంలో ఇప్పటికే రూ.1,330.94 కోట్ల మేర పనులు పూర్తయ్యాయని.. మరో రూ.73.64 కోట్ల పనులు పురోగతిలో ఉన్నట్లు మంత్రి తెలిపారు. శాసన మండలిలో ఎంఐఎం ఎమ్మెల్సీలు మీర్జా రియాజల్ హసన్, మీర్జా రహమత్ బేగ్‌లు అడిగిన ప్రశ్నకు మంత్రి జగదీశ్ రెడ్డి సమాధానం ఇచ్చారు. ఓల్డ్ సిటీలో విద్యుత్ నిర్మాణ పనులకు రూ.1,404.58 కోట్ల మేర ఖర్చు అవుతుండగా.. అందులో ట్రాన్స్‌కో రూ.957.29 కోట్లు, దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ రూ.447.29 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.

పాతనగరంలో ఇంత భారీ మొత్తంలో ఖర్చు చేసి విద్యుత్ సరఫరాను క్రమబద్దీకరించామని, గతంలో ఏ ప్రభుత్వం చేయకపోయినా.. బీఆర్ఎస్ ప్రభుత్వం 9 ఏళ్లలో భారీగా ఖర్చు పెట్టిందని మంత్రి పేర్కొన్నారు. పాత నగరం పరిధిలో నాలుగు 220కేవీ సబ్ స్టేషన్లు, రెండు 132కేవీ సబ్ స్టేషన్లు, 33/11కేవీ సబ్‌స్టేషన్లు నిర్మించామని.. అలాగే 15,256 కిలోమీటర్ల మేర 33 కేవీ లైన్‌తో పాటు 63 అదనపు ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. 16 ట్రాన్స్‌ఫార్మర్ల సామర్ధ్యాన్ని పెంచడంతో పాటు 565 కిలోమీటర్ల మేర 11కేవీ లైన్ వేసినట్లు మంత్రి తెలిపారు.

ఓల్డ్ సిటీలో సబ్ స్టేషన్ల నిర్మాణానికి అవసరమైన స్థల సేకరణ విషయంలో ఇబ్బందులు ఏర్పడ్డాయి. అయితే ఆ ప్రాంత శాసనసభ్యులతో సమీక్షా సమావేశం నిర్వహించి.. వారి ప్రమేయంతో ఆ సమస్యను పరిష్కరించినట్లు మంత్రి వెల్లడించారు. రాష్ట్రంలో ఎలాంటి విద్యుత్ కోతలు లేవని.. విపత్తు సమయంలో కూడా నిరంతరాయ విద్యుత్ అందించిన ఘనత తెలంగాణ విద్యుత్ సంస్థలదని కొనియాడారు. ఇందుకు అహర్నిషలు పని చేస్తున్న యాజమాన్యాలు, సిబ్బందిని మంత్రి ప్రశంసించారు.

First Published:  4 Aug 2023 11:18 AM GMT
Next Story