Telugu Global
Telangana

పార్టీపై నిందలెందుకు..? ఇదెక్కడి సంస్కృతి..?

పార్టీలో సమన్వయం లేకపోతే.. దాన్ని సాధించాల్సిన బాధ్యత ఎంపీ అభ్యర్థిగా కావ్యపై ఉంది. ఆ సమన్వయం సాధించుకోలేకపోతే అభ్యర్థిగా ఆమె విఫలమైనట్టే కానీ, పార్టీ విఫలమైనట్టు కాదు.

పార్టీపై నిందలెందుకు..? ఇదెక్కడి సంస్కృతి..?
X

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత చాలామంది బీఆర్ఎస్ ని వీడేందుకు సాకులు వెదుకుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నాయి కాబట్టి ఆ పార్టీల్లోకి వెళ్తున్నారే కానీ, నిజంగా బీఆర్ఎస్ ని వీడటం వారిలో చాలామందికి ఇష్టం లేదు. బయటకు వెళ్తున్నవారిలో ఏ ఒక్కరూ కాంగ్రెస్ తోనే అభివృద్ధి సాధ్యం అని చెప్పలేకపోతున్నారు. సీనియర్ నేత కేశవరావు కూడా కేసీఆర్ ని కలసిన సందర్భంలో పార్టీ ఓటమిపై చర్చించాలని చూశారు. పార్టీ పేరుమార్చడం కూడా తెలివైన నిర్ణయం కాదని, జాతీయ రాజకీయాల్లో అవసరంగా తలదూర్చామని, ప్లానింగ్ లేకుండా అభ్యర్థుల ఎంపిక జరిగిందని.. ఇలా కేకే అభిప్రాయాలు మీడియా ద్వారా బయటకొస్తున్నాయి. బహుశా కేకే కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి కూడా ఇవే అంశాలను ప్రస్తావించే అవకాశముంది. ఓటమి తర్వాతే నాయకులందరికీ తప్పులు కనపడటం విశేషం. కేకే కుటుంబం బీఆర్ఎస్ ని వీడిపోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి.

కలకలం రేపుతున్న కావ్య లేఖ..

తాజాగా వరంగల్‌ ఎంపీ అభ్యర్థి డాక్టర్‌ కడియం కావ్య.. కేసీఆర్ కి రాసిన లేఖ కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ అభ్యర్థిగా ఆమె పోటీనుంచి వైదొలగాలనుకున్నారు. అయితే తన నిర్ణయాన్ని సమర్థించుకునే క్రమంలో ఆమె పార్టీపై నిందలు వేయడం విశేషం. ఇటీవల మీడియాలో వస్తున్న కథనాలు, అవినీతి, భూకబ్జాలు, ఫోన్‌ ట్యాపింగ్‌, లిక్కర్‌ స్కామ్‌ లాంటి విషయాలు పార్టీ ప్రతిష్టను దిగజార్చాయని తన లేఖలో పేర్కొన్నారు కావ్య. జిల్లా నేతల మధ్య సమన్వయం, సహకారం కొరవడ్డాయని కూడా ప్రస్తావించారు. పార్టీలో నేతలు ఎవరికి వారే అన్నట్టు వ్యవహరిస్తున్నారని, ఈ పరిస్థితుల్లో పోటీ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకుంటున్నట్టు తెలిపారు. పార్టీలో సమన్వయం లేకపోతే.. దాన్ని సాధించాల్సిన బాధ్యత ఎంపీ అభ్యర్థిగా కావ్యపై ఉంది. ఆ సమన్వయం సాధించుకోలేకపోతే అభ్యర్థిగా ఆమె విఫలమైనట్టే కానీ, పార్టీ విఫలమైనట్టు కాదు.



ప్రస్తుతం వలస వెళ్తున్నవారు, పార్టీపై విమర్శలు చేస్తున్నవారంతా ఒకప్పుడు పార్టీలోకి వలస వచ్చిన నేతలే కావడం విశేషం. బీఆర్ఎస్ తోనే రాజకీయ జీవితం ప్రారంభించిన నేతలు కూడా కొంతమంది పార్టీని వీడిపోతున్నారు. కష్టకాలంలో పార్టీకి అండగా ఉండేది ఎవరు, కేసీఆర్ తో నిలబడేది ఎవరు అనేది ఇప్పుడు తేలాల్సిన అంశం. అయితే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎక్కువ లబ్ధి పొందినవారే మెల్లగా జారుకుంటున్నారు. పార్టీ తమను ఇంకా గుర్తించలేదు అని మధనపడిన వారు, పడుతున్నవారు.. మరింత కసిగా పార్టీకోసం పనిచేయడం మొదలు పెట్టారు. రాబోయే రోజుల్లో అలాంటి నాయకులకే బీఆర్ఎస్ లో సరైన గుర్తింపు లభించే అవకాశముంది.

First Published:  28 March 2024 5:28 PM GMT
Next Story