Telugu Global
Telangana

లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌దే హవా! - సీ-ప్యాక్‌ సర్వేలో వెల్లడి

ఎన్నికలు సమీపిస్తున్నవేళ సీ ప్యాక్‌ సర్వే తాజాగా ఇచ్చిన ఫలితాలు చూస్తే.. లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌దే హవా అని అర్థమవుతోంది.

లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌దే హవా! - సీ-ప్యాక్‌ సర్వేలో వెల్లడి
X

తెలంగాణ రాష్ట్రంలో అధికార కాంగ్రెస్‌ పార్టీకి షాక్‌ తగలనుందా? లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో తాజాగా సీ ప్యాక్‌ నిర్వహించిన సర్వే ఫలితాలను చూస్తే అదే ఖాయమని అర్థమవుతోంది. అధికారంలోకొచ్చాం కాబట్టి.. ఆ వేడిలో ఎక్కువ ఎంపీ స్థానాలను గెలుచుకోవాలని భావిస్తున్న ఆ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగలనుందని ఈ సర్వే ఫలితాలు వెల్లడిస్తున్నాయి.

ఇప్పటివరకు వచ్చిన పలు సర్వేలు కాంగ్రెస్, బీజేపీలకే ఎక్కువ స్థానాలు వస్తాయని, బీఆర్‌ఎస్‌ 1 లేదా 2 స్థానాలకే పరిమితమవుతుందని వెల్లడించాయి. తెలంగాణలో మొత్తం 17 ఎంపీ స్థానాలు ఉండగా, కాంగ్రెస్‌కు 8, బీజేపీకి 6, బీఆర్‌ఎస్‌కు 1 లేదా 2 ఎంపీ స్థానాలు దక్కుతాయని ఆ సర్వేలు పేర్కొన్నాయి. మరో సీటు ఎంఐఎంకి వస్తుందని వివరించాయి. దీంతో తెలంగాణలో బీఆర్‌ఎస్‌కి అసలు ఉనికే లేదని కాంగ్రెస్, బీజేపీలు ఊదరగొడుతుండటం తెలిసిందే.

ఓట్‌ షేరింగ్‌లోనూ.. సీట్‌ షేరింగ్‌లోనూ బీఆర్‌ఎస్‌దే పైచేయి!

కానీ, ఎన్నికలు సమీపిస్తున్నవేళ సీ ప్యాక్‌ సర్వే తాజాగా ఇచ్చిన ఫలితాలు చూస్తే.. లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌దే హవా అని అర్థమవుతోంది. తెలంగాణలో బీఆర్‌ఎస్‌ 8 లోక్‌సభ స్థానాలు దక్కించుకుంటుందని, కాంగ్రెస్‌ 6, బీజేపీ 2 స్థానాలు మాత్రమే దక్కించుకుంటాయని ఈ సర్వే వెల్లడిస్తోంది. ఇక ఎంఐఎం ఒక స్థానం గెలుచుకుంటుందని పేర్కొంది. ఓట్‌ షేరింగ్‌లోనూ బీఆర్‌ఎస్‌ మంచి మెరుగుదల సాధిస్తుందని ఈ సర్వే చెబుతోంది. బీఆర్‌ఎస్‌ 34.54 శాతం ఓట్లు సాధిస్తుందని, కాంగ్రెస్‌ 30.03 శాతం ఓట్లు, బీజేపీ 27.17 శాతం ఓట్లు, ఎంఐఎం 2.18 శాతం ఓట్లు సాధిస్తాయని ఈ సర్వే వెల్లడిస్తోంది.

గత ఎన్నికల్లోనూ కచ్చితమైన అంచనాలు...

గత శాసనసభ ఎన్నికల్లో ఇదే సంస్థ తెలంగాణలో కాంగ్రెస్‌ 60, బీఆర్‌ఎస్‌ 40, బీజేపీ 4, బీఎస్పీ 2, ఎంఐఎం 5, ఎంబీటీ 1, సీపీఐ 1 స్థానంలో గెలుస్తాయని వెల్లడించడం విశేషం. ఎన్నికల ఫలితాల్లో ఈ సర్వే చెప్పిందే నిజమైంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 64, సీపీఐ 1, బీఆర్‌ఎస్‌ 39, ఎంఐఎం 7, బీజేపీ 8 స్థానాల్లో విజయం సాధించడం గమనార్హం.

కాంగ్రెస్‌ వైఫల్యాలపై గుర్రుగా ఉన్న ప్రజలు

గత శాసనసభ ఎన్నికల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడినప్పటికీ హామీల అమలుపై శ్రద్ధపెట్టలేదు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం మినహా ఏ హామీనీ కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలు చేయలేదు. తాజాగా లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్‌ పాలన తీరుపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సభలు వెలవెలబోతుండగా, బీఆర్‌ఎస్‌ సభలు విజయవంతమవుతున్నాయి. ఈ నేపథ్యంలో సీ ప్యాక్‌ సర్వే తెలంగాణలోని రాజకీయ పార్టీల్లో ఉత్కంఠ రేపుతోంది.

First Published:  17 April 2024 10:51 AM GMT
Next Story