Telugu Global
Telangana

హైదరాబాద్ నీటి కష్టాలను తీర్చింది సీఎం కేసీఆరే : మంత్రి హరీశ్ రావు

హైదరాబాద్ నీటి కష్టాలు తీర్చిన ఘనత సీఎం కేసీఆర్‌దే అని చెప్పారు. మహారాష్ట్రంలోని కొన్ని పట్టణాల్లో 9 రోజులకు ఒక సారి నీళ్లు వచ్చే పరిస్థితి ఉందన్నారు.

హైదరాబాద్ నీటి కష్టాలను తీర్చింది సీఎం కేసీఆరే : మంత్రి హరీశ్ రావు
X

ఒకప్పుడు హైదరాబాద్ ప్రజలు నీళ్ల కోసం ధర్నాలు చేశారు. దివంగత ఎమ్మెల్యే పీజేఆర్ ఆధ్వర్యంలో నీటి కోసం మహిళలు ఆందోళన చేసిన రోజులు ఇంకా గుర్తే. కానీ ఇప్పుడు హైదరాబాద్‌లోనే కాకుండా మొత్తం తెలంగాణలో అలాంటి పరిస్థితులు లేవని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. హైదరాబాద్ నీటి కష్టాలు తీర్చిన ఘనత సీఎం కేసీఆర్‌దే అని చెప్పారు. మహారాష్ట్రంలోని కొన్ని పట్టణాల్లో 9 రోజులకు ఒక సారి నీళ్లు వచ్చే పరిస్థితి ఉందన్నారు. కూకట్‌పల్లి 5వ ఫేజ్ లోధ టవర్స్ సమీపంలో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రికి హరీశ్ రావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..

కూకట్‌పల్లిలో చెరువు బాగైంది. రైతు బజార్ బాగైంది. నీటి కష్టాలు తీరాయి. హైదరాబాద్‌లో 24 గంటల పాటు కరెంట్ వస్తోంది. ఇన్వర్టర్లు, కన్వర్టర్లు లేవు.. జనరేటర్లతో అవసరం పడటం లేదని హరీశ్ రావు అన్నారు. ఇదంతా తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ అందిస్తున్న సుపరిపాలన వల్లే సాధ్యమైందని చెప్పారు. కూకట్‌పల్లిలో 100 పడకల ఆసుపత్రి కోసం మీ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు రెండేళ్ల పాటు కష్టపడ్డారని అన్నారు.

గచ్చిబౌలి, సనత్‌నగర్ టిమ్స్ ఆసుపత్రులతో పాటు పటాన్‌చెరులో మరొక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి రాబోతోందని మంత్రి వెల్లడించారు. తెలంగాణ రాక ముందు ప్రభుత్వ ఆసుపత్రుల్లో 30 శాతం ప్రసవాలు జరిగితే.. ఇప్పుడు అవి 70 శాతానికి చేరాయని చెప్పారు. మన దగ్గర అల్లావుద్దీన్ దీపం లేదు. కష్టపడి పని చేస్తేనే ఇదంతా సాధ్యమయ్యిందని హరీశ్ రావు చెప్పారు.

ఆనాడు 20 ఏళ్లకు ఒక మెడికల్ కాలేజీ వచ్చింది. కానీ 9 ఏళ్లలోనే 21 ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రారంభించామని మంత్రి చెప్పారు. వైద్య విద్య కోసం ఉక్రెయిన్, చైనా వెళ్లాల్సిన పరిస్థితులు ఇప్పుడ లేవని అన్నారు. ఒకనాడు రాష్ట్రంలో 2,950 ఎంబీబీఎస్ సీట్లు ఉంటే.. ఇప్పుడు 8,340కి చేరాయని అన్నారు.

ఎవరికో పుట్టిన బిడ్డను నాదే అన్నట్లు.. బీజేపీ వాళ్లు మెడికల్ కాలేజీల ఘనత తమదే అని చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం ఒక్కో మెడికల్ కాలేజీ కోసం రూ.500 కోట్ల ఖర్చు చేసింది. ఎన్ఎంసీ అనేది అటానమస్ బాడీ. అది పూర్తిగా పరిశీలించిన తర్వాతే అనుమతులు ఇస్తుంది. అది మంజూరు చేసిన అనుమతులు కూడా బీజేపీ ఘనతగా చెప్పుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం 157 మెడికల్ కాలేజీలు మంజూరు చేసింది. ఇందులో ఒక్కటి కూడా తెలంగాణకు కేటాయించలేదని మంత్రి స్పష్టం చేశారు.

తెల్లాపూర్‌లో మూడు గుడులకు భూమి పూజ..

తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో మూడు దేవాలయాలకు మంత్రి హరీశ్ రావు భూమి పూజ చేశారు. శ్రీ మల్లిఖార్జున స్వామి, శ్రీ బీరప్ప స్వామి, విశ్వకర్మ దేవాలయాలకు శంకుస్థాపన చేసిన అనంతరం మంత్రి మాట్లాడుతూ.. మూడేళ్ల కృషి తర్వాత బీరప్ప దేవాలయ నిర్మాణ కల నెరవేరబోతోందని అన్నారు. పార్టీలకు అతీతంగా.. దేశం మెచ్చిన నేతగా కేసీఆర్ అందిస్తున్న సంక్షేమ పథకాలు అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాయని అన్నారు. గొల్ల కురుమలకు రూ.500 కోట్ల విలువైన భూమిని అందించి.. ఆత్మ గౌరవ భవనాలను నిర్మిస్తున్నామని చెప్పారు. తెల్లాపూర్‌లో విశ్వ బ్రాహ్మణ దేవాలయ నిర్మాణానికి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి రూ. 50 లక్షలు ప్రకటించటం అభినందనీయం అని హ‌రీశ్ రావు అన్నారు. తెల్లాపూర్ మునిసిపాలిటీ భవనం, వ్యవసాయ మార్కెట్, పెండింగ్‌లో ఉన్న పలు అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేస్తామ‌ని మంత్రి హ‌రీశ్‌రావు హామీ ఇచ్చారు.

First Published:  10 Jun 2023 9:50 AM GMT
Next Story