Telugu Global
Telangana

బీజేపీతో టచ్‌లోకి ఆ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే, ఎంపీ!

బీజేపీతో టచ్‌లోకి వెళ్లిన ఎంపీ రుణం ఎగవేత కేసులో ఈడీ విచారణను ఎదుర్కోవాల్సి వస్తుందని భయపడుతున్నట్టు టాక్ నడుస్తోంది.

బీజేపీతో టచ్‌లోకి ఆ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే, ఎంపీ!
X

కాంగ్రెస్‌ సిట్టింగ్‌ ఎంపీ, ఎమ్మెల్యే బీజేపీలోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. వేర్వేరు కేసుల్లో ఇద్దరికీ నోటీసులు ఇచ్చేందుకు ఈడీ సిద్ధమవుతున్నట్టు ప్రచారం జరుగుతుండటంతో దాని నుంచి తప్పించుకునేందుకు కాషాయ కండువా కప్పుకోవాలని భావిస్తున్నారట. పోలింగ్‌కు ఒకట్రెండు రోజుల ముందు ఈడీ వారికి నోటీసులు ఇవ్వనున్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో దాని నుంచి తప్పించుకునేందుకు బీజేపీకి దగ్గర కావాలని ట్రై చేస్తున్నట్లు చర్చ జరుగుతోంది.

ఆ ఎమ్మెల్యే, గతంలో ఎంపీ కూడా..!

బీజేపీతో టచ్‌లోకి వెళ్లిన ప్రస్తుత ఎమ్మెల్యే, మాజీ ఎంపీ కూడానని తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఆయనకు ఈడీ నుంచి నోటీసులు అందినట్టు సమాచారం. ఇప్పుడాయనను ప్రశ్నించేందుకు సమన్లు కూడా ఇవ్వనున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీనికితోడు ఆయన సన్నిహితుడు లోక్‌సభ బరిలో నిలవడంతో ఆ ప్రభావం ఎన్నికలపై పడే అవకాశం ఉందని సదరు ఎమ్మెల్యే భయపడుతున్నట్లు సమాచారం.

రుణం ఎగవేత కేసులో ఎంపీ..!

బీజేపీతో టచ్‌లోకి వెళ్లిన ఎంపీ రుణం ఎగవేత కేసులో ఈడీ విచారణను ఎదుర్కోవాల్సి వస్తుందని భయపడుతున్నట్టు టాక్ నడుస్తోంది. బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఆయనపై గతంలో కేంద్ర దర్యాప్తు సంస్థలకు బీఆర్‌ఎస్‌ నేతలు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. ఈ ఫిర్యాదు ఆధారంగానే ఈడీ రంగంలోకి దిగబోతోందని సమాచారం. అదే జరిగితే తన గెలుపు కష్టమేనని ఆయన భావిస్తున్నారట. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే, ఎంపీ ఇద్దరూ తమకు తెలిసిన మార్గాల ద్వారా అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మను ఆశ్రయించి చర్చలు జరిపినట్టు ప్రచారం జరుగుతోంది.

హైకమాండ్ సీరియస్..

కాంగ్రెస్‌ ఎంపీ, ఎమ్మెల్యే ఇద్దరూ అస్సాం సీఎంకు టచ్‌లోకి వెళ్లిన విషయం.. ఇరుపార్టీల అధిష్టానానికి తెలియడంతో గుర్రుగా ఉన్నట్టు సమాచారం. తమ అనుమతి లేకుండా చర్చలు జరపడంపై ఇటు బీజేపీ, విషయం బయటకు వస్తే పరువుపోతుందని అటు కాంగ్రెస్‌ ఆగ్రహంతో ఉన్నాయని తెలిసింది. దీంతో ఆయా పార్టీల రాష్ట్ర ఇన్‌ఛార్జ్‌లు వారిపై ఓ కన్నేశాయట. అత్యంత గోప్యంగా ఉంచుదామనుకున్న విషయం కాస్త బయటకు పొక్కడంతో రాజకీయ వర్గాల్లో హాట్‌ టాపిక్‌ అయింది.

First Published:  19 April 2024 4:09 AM GMT
Next Story