Telugu Global
Telangana

సీఎం సీఎం.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద రచ్చ చేసిన జూనియర్ అభిమానులు

బాలయ్య వెళ్లిపోయిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ అక్కడకు వచ్చారు. తాత సమాధి వద్ద నివాళులర్పించారు. జూనియర్ రాక సందర్భంగా భారీగా తోపులాట జరిగింది.

సీఎం సీఎం.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద రచ్చ చేసిన జూనియర్ అభిమానులు
X

నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భంగా ఈరోజు ఉదయాన్నే ఎన్టీఆర్ ఘాట్ వద్దకు కుటుంబ సభ్యులు వచ్చి నివాళులర్పించారు. ముందుగా బాలకృష్ణ.. ఎన్టీఆర్ ఘాట్ కు చేరుకుని తండ్రి సమాధిపై పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. ఎన్టీఆర్ శత జయంతిని తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా నిర్వహించుకుంటున్నామని చెప్పారు బాలయ్య. తెలుగు వారి రుణం తీర్చుకునేందుకే ఎన్టీఆర్, టీడీపీని స్థాపించారని అన్నారు. సంక్షేమ పథకాలతో పేదవాడి గుండెల్లో ఆయన సుస్థిర స్థానం సంపాదించుకున్నారని చెప్పారు. ఆయన కొడుకుగా పుట్టడం తన అదృష్టం అన్నారు బాలయ్య.

ఎన్టీఆర్ రావడంతో..

బాలయ్య వెళ్లిపోయిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ అక్కడకు వచ్చారు. తాత సమాధి వద్ద ఆయన నివాళులర్పించారు. జూనియర్ రాక సందర్భంగా భారీగా తోపులాట జరిగింది. బౌన్సర్లు కూడా అభిమానుల్ని పక్కకు నెట్టేయలేక చేతులెత్తేశారు. జూనియర్ పై అభిమానులు పడిపోయారు. ఆ తోపులాటలోనే ఆయన ఎలాగోలా అక్కడినుంచి బయటపడ్డారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ వచ్చినప్పటినుంచి వెళ్లిపోయే వరకు కొంతమంది సీఎం సీఎం అంటూ రచ్చలేపారు. ఎన్టీఆర్ మాత్రం ఇవేవీ పట్టించుకోనట్టే ఉన్నారు. అభిమానులు మాత్రం సీఎం సీఎం అని నినాదాలు చేసి రాజకీయ చర్చకు తెరతీశారు.

ఆమధ్య కుప్పంలో జూనియర్ ఎన్టీఆర్ జెండాలు ఎగరవేశారు అభిమానులు. ఆ తర్వాత చంద్రబాబు కవర్ చేసుకోలేక నానా ఇబ్బందులు పడ్డారు. ఇటీవల ఎన్టీఆర్ శతజయంతి పేరుతో హైదరాబాద్ లో జరిగిన ఉత్సవాలకు ఎన్టీఆర్ కి ఆహ్వానం పంపినా ఆయన రాలేదు. దీంతో చంద్రబాబుతో జూనియర్ అంటీముట్టనట్టుగానే ఉన్నట్టు స్పష్టమైపోయింది. చంద్రబాబు పర్యటనల్లో కూడా అక్కడక్కడా జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలతో అభిమానులు రచ్చ చేస్తున్నారు. తాజాగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద సీఎం సీఎం అంటూ నినాదాలు చేసి మరోసారి కలకలం రేపారు.

First Published:  28 May 2023 2:11 AM GMT
Next Story