Telugu Global
Telangana

"తమిళనాడు కోసం తెలంగాణపై బీజేపీ కుట్ర".. రేవంత్ ఏం చేస్తున్నాడు..?

ఇంత జరుగుతున్నా.. రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎందుకు మౌనం వహిస్తోంది? ట్రిబ్యునల్ తీర్పున‌కు వ్యతిరేకంగా కేంద్రం ముందుకు పోతుంటే అడ్డుకోకుండా చూస్తూ ఎందుకు కూర్చుంటున్నారు?.

తమిళనాడు కోసం తెలంగాణపై బీజేపీ కుట్ర.. రేవంత్ ఏం చేస్తున్నాడు..?
X

తెలంగాణపై బీజేపీ మరో కుట్రకు సిద్ధమైందని ఆరోపించారు మాజీ సీఎం, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌. ఓట్ల కోసం తెలంగాణ నీళ్లను ఇతర రాష్ట్రాల‌కు మళ్లించేందుకు కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. "గోదావరి నది మీద ఇచ్చంపల్లి వద్ద ప్రాజెక్ట్‌ కట్టి కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు నీళ్లను మళ్లించుకుపోదామని బీజేపీ చూస్తోంది. ఇది బచావత్‌ ట్రిబ్యునల్‌ తీర్పుకు వ్యతిరేకం".

బచావత్‌ ట్రిబ్యునల్‌ తీర్పుకు వ్యతిరేకంగా..!

"నదీ జలాల పంపిణీపై 1974లో బచావత్‌ ట్రిబ్యునల్‌ స్పష్టమైన తీర్పు ఇచ్చింది. దీన్ని అంతా గౌరవించాల్సిందే. నదీ జలాలను బేసిన్ల వారీగా పంచి ఎగువ రాష్ట్రాల నుంచి దిగువ రాష్ట్రాలకు నీటి పంపకం చేసింది. ఎగువ రాష్ట్రాలకు కేటాయించిన నీళ్లు పోను మిగిలిన నీళ్లన్నీ దిగువ రాష్ట్రమైన తెలంగాణకు దక్కాలని తీర్పు చెప్పింది. 50 ఏళ్ల నుంచి బచావత్‌ ట్రిబ్యునల్‌ తీర్పు ప్రకారమే నీటి పంపకాలు జరుగుతున్నాయి. కానీ, కొత్తగా ఇప్పుడు కర్ణాటక, తమిళనాడులో ఓట్లు దండుకోవడానికి నీళ్లు మళ్లించి, తెలంగాణ ప్రజల నోట్లో మట్టికొట్టే కుట్రలకు బీజేపీ తెరలేపింది."

రేవంత్ ఏం చేస్తున్నాడు....?

"ఇంత జరుగుతున్నా.. రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎందుకు మౌనం వహిస్తోంది? ట్రిబ్యునల్ తీర్పున‌కు వ్యతిరేకంగా కేంద్రం ముందుకు పోతుంటే అడ్డుకోకుండా చూస్తూ ఎందుకు కూర్చుంటున్నారు?. ఇది రాష్ట్ర ప్రభుత్వ అసమర్థతా? కాదా?. తెలంగాణ నదీ జలాలు కాపాడాలంటే అది బీఆర్‌ఎస్‌తోనే సాధ్యం. బీఆర్‌ఎస్‌ ఎంపీలు, పార్టీ శ్రేణులు పేగులు తెగేదాకా కొట్లాడైనా తెలంగాణకు చెందాల్సిన నదీ జలాలను కాపాడుకుంటాం. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని ప్రజలు లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఎంపీలను భారీ మెజార్టీతో గెలిపించాలి".

బీజేపీ, కాంగ్రెస్‌లతో నష్టం..

"తెలంగాణ ప్రజలకు బీజేపీ, కాంగ్రెస్‌ చేస్తున్న నష్టం గురించి వివరించాలి. కాంగ్రెస్‌ పార్టీకి నదులు, నీళ్ల గురించి తెల్వదు. వాటి ప్రాధాన్యత కూడా వాళ్లకు అర్థం కాదు. గోదావరిని శాశ్వతంగా ఇతర రాష్ట్రాలకు అప్పగించే కుట్ర చేస్తున్నారు. దీనిపై మనం పోరాడాలి. కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకించాలి" అని కేసీఆర్‌ పిలుపునిచ్చారు.

First Published:  19 April 2024 2:35 AM GMT
Next Story