Telugu Global
Telangana

అదే జరిగితే ఏడాదిలోగా కేసీఆర్ రాష్ట్రాన్ని శాసిస్తారు

బండి సంజయ్ తో మ్యాచ్ ఫిక్సింగ్‌ చేసుకున్న రేవంత్ రెడ్డి లో కరీంనగర్‌ లో డమ్మీ అభ్యర్థిని నిలబెట్టారని ఆరోపించారు. కరీంనగర్ జిల్లాకు బండి సంజయ్ ఏం చేశారో చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు కేటీఆర్.

అదే జరిగితే ఏడాదిలోగా కేసీఆర్ రాష్ట్రాన్ని శాసిస్తారు
X

ప్రభుత్వం మారిన వెంటనే అధికార పార్టీకి తొత్తులుగా మారిన అధికారులు, తోకాడిస్తున్న పోలీసులు మళ్లీ మన మాట వినాలంటే మనకు 10 నుంచి 12 లోక్ సభ సీట్లు రావాలన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సంవత్సరంలోగా మళ్లీ కేసీఆర్ రాష్ట్రాన్ని శాసించే రోజు రావాలంటే.. మన గెలుపే సమాధానం కావాలన్నారు. పంచాయతీలు, పగలు పక్కనపెట్టి పనిచేయాలని, రాష్ట్రంలోని అందరూ కేసీఆర్ మనుషులేనన్నారు. వేములవాడ నియోజకవర్గం బూత్ కమిటీ సభ్యుల సమావేశంలో పాల్గొన్న ఆయన బీజేపీ, కాంగ్రెస్ పై నిప్పులు చెరిగారు.


బీజేపీకి మెజార్టీ వస్తే రాజ్యాంగాన్ని మారుస్తుందని, అలా జరగకుండా అడ్డుకునే శక్తి బీఆర్ఎస్ కి ఉందని, లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కి 10నుంచి 12 సీట్లు ఇస్తే.. ఢిల్లీలో మన గొంతు వినిపిస్తామన్నారు కేటీఆర్. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని, కేంద్ర పాలిత ప్రాంతం కాకుండా ఉండాలంటే, డీలిమిటేషన్‌లో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకూడదంటే.. బీఆర్ఎస్ ని గెలిపించాలని పిలుపునిచ్చారు. బీజేపీ కుయుక్తులను అడ్డుకునే శక్తి కేవలం గులాబీ కండువాకే ఉందన్నారాయన. 2014లో బడే భాయ్.. 2024లో ఛోటే భాయ్ మోసం చేశారన్నారు. రూ.30లక్షల కోట్లు రోడ్ సెస్ పేరిట వసూలు చేసి అందులో సగం సొమ్ముతో అంబానీ లాంటి వాళ్లకు రుణమాఫీ చేశారని ఆరోపించారు కేటీఆర్.

బీజేపీని గెలిపించేందుకే కరీంనగర్ లో ముక్కూ మొహం తెలియని వ్యక్తిని కాంగ్రెస్ పోటీకి నిలబెట్టిందన్నారు కేటీఆర్. కరీంనగర్‌లో బీజేపీ-బీఆర్‌ఎస్‌ మధ్యే పోటీ అని, కాంగ్రెస్ పోటీలో లేదని చెప్పారు. బండి సంజయ్ తో మ్యాచ్ ఫిక్సింగ్‌ చేసుకున్న రేవంత్ రెడ్డి లో కరీంనగర్‌కు డమ్మీ అభ్యర్థిని నిలబెట్టారని ఆరోపించారు. కరీంనగర్ జిల్లాకు బండి సంజయ్ ఏం చేశారో చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు కేటీఆర్.

తెలంగాణలో కాంగ్రెస్ సిక్స్ గ్యారెంటీలు అమలులోకి రాలేదని, పార్లమెంటు ఎన్నికల తర్వాత ఉచిత బస్సు, ఉచిత విద్యుత్ పథకాలు కూడా మాయం అవుతాయని చెప్పారు కేటీఆర్. 70ఏళ్ల వయసులో తుంటి విరిగినా, కుమార్తె జైల్లో ఉన్నా, నమ్మినవాళ్లు మోసం చేసి వేరే పార్టీల్లోకి వెళ్తున్నా.. కేసీఆర్‌ బస్సుయాత్ర పేరిట జనంలో తిరుగుతున్నారని చెప్పారు కేటీఆర్.

First Published:  28 April 2024 12:12 PM GMT
Next Story