Telugu Global
Telangana

రేవంత్‌, సీతక్కకు మావోయిస్టుల వార్నింగ్

ఈ బూటకపు ఎన్‌కౌంటర్‌కు పూర్తి బాధ్యత రేవంత్ రెడ్డే వహించాలని మావోయిస్టులు డిమాండ్ చేశారు. పదేపదే ప్రజా పాలన అని చెప్పుకునే రేవంత్ రెడ్డి.. నలుగురు ఆదివాసీ యువకులను దారుణంగా ఎన్‌కౌంటర్ చేయించారన్నారు మావోయిస్టులు.

రేవంత్‌, సీతక్కకు మావోయిస్టుల వార్నింగ్
X

సీఎం రేవంత్‌రెడ్డికి మావోయిస్టులు వార్నింగ్ ఇచ్చారు. ఈనెల 19న జరిగిన గడ్చిరోలి ఎన్‌కౌంటర్ బూటక‌మని.. దానికి పూర్తి బాధ్యత సీఎం రేవంత్‌ రెడ్డే వహించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు భారత కమ్యూనిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ లేఖ విడుదల చేసింది. దుమ్ముగూడెం ప్రాంతంలో నలుగురు కామ్రేడ్లకు అన్నంలో మత్తుమందు పెట్టి పోలీసులు అదుపులో తీసుకున్నారని మావోయిస్టులు లేఖలో పేర్కొన్నారు. పట్టుకున్న కామ్రేడ్లను చిత్రహింసలకు గురిచేసి క్రూరంగా హత్య చేశారన్నారు. అనంతరం ఎన్‌కౌంటర్‌ అని కట్టుకథ అల్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ బూటకపు ఎన్‌కౌంటర్‌కు పూర్తి బాధ్యత రేవంత్ రెడ్డే వహించాలని మావోయిస్టులు డిమాండ్ చేశారు. పదేపదే ప్రజా పాలన అని చెప్పుకునే రేవంత్ రెడ్డి.. నలుగురు ఆదివాసీ యువకులను దారుణంగా ఎన్‌కౌంటర్ చేయించారన్నారు మావోయిస్టులు. మంత్రి సీతక్కపైనా పరోక్షంగా విమర్శలు చేశారు. ఆదివాసీ ఓట్లతో ప్రభుత్వంలో మంత్రి హోదా అనుభవిస్తున్న వారు.. ఆదివాసీ యువకులను చంపినా నోరు మెదపట్లేదనే ఆగ్రహం వ్యక్తం చేశారు మావోయిస్టులు.

తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లోని గడ్చిరోలి జిల్లాలో ఈనెల 19న ఎన్‌కౌంటర్ జరిగింది. ఎన్‌కౌంట‌ర్‌లో తెలంగాణలోని మంగి, ఇంద్రవెల్లి ఏరియా కమిటీ కార్యదర్శి వర్గీస్.. సిర్పూర్ చెన్నూరు ఏరియా కమిటీ కార్యదర్శి మగ్తూ.. ప్లాటూన్ మెంబర్లు కుర్సంగి రాజు, కుడిమెట్ట వెంకటేష్ మృతి చెందారు. వీరిపై రూ.36 లక్షల రివార్డు ఉంది. ఘటనా స్థలం నుంచి ఏకే 47, ఒక కార్బైన్, ఒక కంట్రీమేడ్ పిస్టల్, మావోయిస్టుల సాహిత్యం, ఇతర వస్తువుల్ని స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. తాజాగా ఈ ఎన్‌కౌంటర్‌ బూటకం అంటూ మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్కపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

First Published:  30 March 2024 6:54 AM GMT
Next Story