Telugu Global
Telangana

డీలిమిటేష‌న్‌తో తెలంగాణ‌లో 154 అసెంబ్లీ సీట్లు.. అందులో 125 కాంగ్రెస్‌వే.. - కోమ‌టిరెడ్డి

జూన్ 4న అంటే లోక్‌స‌భ ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చాక త‌మ పార్టీలోకి ఇత‌ర పార్టీల నుంచి భారీ ఎత్తున వ‌ల‌స‌లు ఉంటాయ‌ని కోమటిరెడ్డి చెప్పుకొచ్చారు.

డీలిమిటేష‌న్‌తో తెలంగాణ‌లో 154 అసెంబ్లీ సీట్లు.. అందులో 125 కాంగ్రెస్‌వే.. - కోమ‌టిరెడ్డి
X

నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌నతో రాబోయే రోజుల్లో తెలంగాణ‌లో అసెంబ్లీ సీట్ల సంఖ్య 154కు చేరుతుంద‌ని తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంట‌క‌రెడ్డి చెప్పారు. అందులో 125 సీట్లు కాంగ్రెస్ పార్టీయే గెలుచుకుంటుంద‌ని కూడా జోస్యం చెప్పేశారు. రాబోయే ప‌దేళ్లూ రేవంత్‌రెడ్డే సీఎంగా ఉంటార‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. మీట్ ద ప్రెస్ కార్య‌క్ర‌మంలో కోమ‌టిరెడ్డి ఈ మాట‌లు అన్నారు.

25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వ‌చ్చేస్తార‌ట‌!

జూన్ 4న అంటే లోక్‌స‌భ ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చాక త‌మ పార్టీలోకి ఇత‌ర పార్టీల నుంచి భారీ ఎత్తున వ‌ల‌స‌లు ఉంటాయ‌ని కోమటిరెడ్డి చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ నుంచి 25 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి వ‌స్తార‌న్నారు. ఆరుగురు బీఆర్ఎస్ ఎంపీ అభ్య‌ర్థులు కూడా త‌మ‌తో ట‌చ్‌లో ఉన్నార‌న్నారు.

నాకు సీఎం ప‌ద‌విపై ఆశలేదు

వ‌చ్చే ప‌దేళ్లూ తెలంగాణ‌కు రేవంత్ రెడ్డి సీఎంగా ఉంటార‌ని కోమ‌టిరెడ్డి వ్యాఖ్యానించారు. త‌న‌కు సీఎం కావాల‌న్న ఆశ లేద‌న్నారు. కోమ‌టిరెడ్డి సీఎం స్థాయి వ్య‌క్తి అని ఇటీవ‌ల రేవంత్ ఓ మీటింగ్‌లో చెప్పిన నేప‌థ్యంలో ఆయ‌న వ్యాఖ్య‌లు ఆస‌క్తిక‌రంగా మారాయి.

మైండ్ గేమ్ మొద‌లుపెట్టారా?

తెలంగాణ‌లో బీఆర్ఎస్ దుకాణం ఖాళీ అవుతుంద‌ని కోమ‌టిరెట్టి చెప్పుకొచ్చారు. 25 మంది ఎమ్మెల్యేలు త‌మ పార్టీలోకి వ‌చ్చేస్తార‌ని, ఎంపీ అభ్య‌ర్థులూ త‌మ‌తో ట‌చ్‌లో ఉన్నార‌ని చెప్ప‌డం ద్వారా లోక్‌స‌భ ఎన్నిక‌ల ముందు మైండ్ గేమ్‌కు కాంగ్రెస్‌కు తెర‌తీసింద‌న్న కామెంట్లు వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా వ‌చ్చేస్తున్నారంటే ఓట‌ర్లు న‌మ్మి కాంగ్రెస్‌కే ఓట్లేస్తార‌ని కోమటిరెడ్డి క‌ల‌లుగంటున్నార‌ని బీఆర్ఎస్ సెటైర్లు వేస్తోంది.

First Published:  8 May 2024 11:41 AM GMT
Next Story