Telugu Global
Telangana

రైతులపై ప్రేమ ఉంటే రాజీనామా లేఖను స్పీకర్ కి ఇవ్వండి..

రాజీనామా లేఖ అంటే కేవలం ఒకటిన్నర లైన్ ఉండాలని, హరీష్ రావు ఒకటిన్నర పేజీ రాశారని అదెలా చెల్లుబాటు అవుతుందన్నారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.

రైతులపై ప్రేమ ఉంటే రాజీనామా లేఖను స్పీకర్ కి ఇవ్వండి..
X

తెలంగాణలో రాజీనామా రాజకీయాలు హాట్ టాపిక్ గా మారాయి. హరీష్ రావు రాజీనామా లేఖతో నేరుగా గన్ పార్క్ వద్దకు వచ్చి కాంగ్రెస్ కి సవాల్ విసిరారు. అయితే ఆ రాజీనామా లేఖపై ఇప్పుడు కాంగ్రెస్ రాజకీయం మొదలు పెట్టింది. అది రాజీనామా లెటర్ కాదని, అందులో మేటర్ సీసపద్యం అంత ఉందని సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. మంత్రి కోమటి రెడ్డి కూడా ఆ లేఖపై వ్యంగ్యంగా స్పందించారు. రాజీనామా లేఖ అంటే కేవలం ఒకటిన్నర లైన్ ఉండాలని, హరీష్ రావు ఒకటిన్నర పేజీ రాశారని అదెలా చెల్లుబాటు అవుతుందన్నారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.

రాజీనామా పేరుతో హరీష్ రావు నాటకాలాడుతున్నారని అన్నారు మంత్రి కోమటిరెడ్డి. దొంగ రాజీనామా లేఖలను ఎందుకు ఇస్తున్నారన్నారు. హామీలు అమలు చేయకపోతే ప్రజలను క్షమాపణ కోరి ఉండేవాళ్లం అని, గతంలో తాను పదవి వదులుకున్నానని, పదవులు శాశ్వతమా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే దళితుడినే తొలిసీఎంగా చేస్తామని నాడు కేసీఆర్ చెప్పారని, చేయలేకపోతే మెడపై తల ఉండదని కూడా గొప్పగా చెప్పారని దానికి ఆ పార్టీ నేతలు ఎలా బదులు చెబుతారని ప్రశ్నించారు. పోనీ తొలిసారి పరిపాలన అనుభవం ఉండాలని చెప్పి కేసీఆర్ సీఎం అయినా, రెండోసాారి అధికారంలోకి వచ్చినా దళితుడిని సీఎం చేసి ఉండొచ్చు కదా అని ప్రశ్నించారు మంత్రి కోమటిరెడ్డి.

అధికారం పోగానే బీఆర్ఎస్ నేతలు పిచ్చిపట్టినట్లు మాట్లాడుతున్నారని, కాంగ్రెస్ వచ్చాకే ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు ఇస్తున్నామని చెప్పారు మంత్రి కోమటిరెడ్డి. ఎస్సీలకు మూడెకరాల భూమి ఇస్తామని ఆ పార్టీ నేతలు మోసం చేశారని, బీఆర్ఎస్ హయాంలో ఉపాధిహామీ కూలీలకు కనీసం 100 రోజుల ఉపాధి కల్పించలేదన్నారు. కాంగ్రెస్‌ను విమర్శించడం ఆ పార్టీ నేతలు మానుకోవాలన్నారు. ఆగస్టు 15న రుణమాఫీ చేసి హామీ నిలబెట్టుకుంటామని చెప్పారు కోమటిరెడ్డి.

First Published:  26 April 2024 2:01 PM GMT
Next Story