Telugu Global
Telangana

మహిళా జర్నలిస్ట్ ల కోసం వీ హబ్ ప్రోగ్రామ్ –కేటీఆర్

రాష్ట్రంలో ఉన్న మహిళా జర్నలిస్టులు అంతా కలిసి ఒక యూనియన్‌ గా ఏర్పడి... వారి సమస్యలను I&PR శాఖకు తెలపాలని సూచించారు మంత్రి కేటీఆర్.

మహిళా జర్నలిస్ట్ ల కోసం వీ హబ్ ప్రోగ్రామ్ –కేటీఆర్
X

జర్నలిజంలో మహిళల కెరీర్, వారి విధులు కష్టంతో కూడుకున్నవని అన్నారు మంత్రి కేటీఆర్. మహిళా కెమెరామెన్‌, జర్నలిస్టు విధులు చాలా కష్టమైనవి, అయినా కూడా మహిళలు ఈ రంగంలో ప్రవేశించడానికి ఉత్సాహం చూపించడం, రాణించడం అభినందనీయమని చెప్పారు. మహిళల కోసం వీహబ్‌ ఆధ్వర్యంలో ఒక ప్రోగ్రాం అందుబాటులోకి తెస్తున్నామన్నారు. మీడియా రిలేటెడ్‌ స్టార్టప్‌ లు ప్రారంభించాలనుకునేవారికి ఇది ఉపయోగపడుతుందన్నారు.

ఉమెన్స్‌ డే సందర్భంగా హైదరాబాద్‌ పీపుల్స్‌ ప్లాజాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. మహిళా జర్నలిస్ట్ లకు పురస్కారాలు ప్రదానం చేశారు, వారిని అభినందించారు. ఈ పురస్కారాల ప్రదానోత్సవంలో మంత్రులు జగదీశ్‌రెడ్డి, సత్యవతి రాథోడ్‌, సబితా ఇంద్రారెడ్డి, చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి పాల్గొన్నారు.

తప్పులను వేలెత్తి చూపుతారు..

జర్నలిస్ట్ లు మంచి మంచి కథనాలు ఇస్తే పొగిడేవారి కంటే, చిన్న తప్పు చేస్తే వాటిని వేలెత్తి చూపించేవారే ఎక్కువమంది ఉంటారని, ఆ విషయం గుర్తుంచుకుని విధి నిర్వహణలో జాగరూకతతో ఉండాలని సూచించారు మంత్రి కేటీఆర్. సమాజంలో రాజకీయ నాయకుల పరిస్థితి కూడా అంతేనని అన్నారు. ఎంత మంచి చేసినా ఎవరూ గుర్తించరు కానీ.. తప్పులు అందరూ గుర్తిస్తారని అన్నారు కేటీఆర్. “ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు తప్పు చేసినప్పుడు చీల్చి చెండాడండి, అదే సమయంలో ప్రభుత్వం చేసే మంచి కార్యక్రమాలను కూడా ప్రజలకు తెలియజేయండి.” అని సూచించారు కేటీఆర్. తెలంగాణలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో మంచి వైద్య సేవలు అందిస్తున్నామని, మాతా శిశుమరణాలు తగ్గాయని, నిమ్స్ లో అత్యధిక కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ ఆపరేషన్లు జరిగాయని తెలిపారు. ఇలాంటి పాజిటివ్ న్యూస్ కూడా కవర్ చేయాలన్నారు. రాజకీయ నాయకుల తప్పులను ఎంత బాగా కవర్ చేస్తారో, పాజిటివ్‌ న్యూస్‌ కి కూడా అంతే ప్రాధాన్యం ఇవ్వండని చెప్పారు. దుర్ఘటనలు జరిగినప్పుడు బాధ్యత లేదన్నట్టు మాట్లాడటం సరికాదన్నారు.

రాష్ట్రంలో ఉన్న మహిళా జర్నలిస్టులు అంతా కలిసి ఒక యూనియన్‌ గా ఏర్పడి... వారి సమస్యలను I&PR శాఖకు తెలపాలని సూచించారు మంత్రి కేటీఆర్. జర్నలిస్ట్ ల సమస్యలు పరిష్కరించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని హామీ ఇచ్చారు.

First Published:  7 March 2023 3:31 PM GMT
Next Story