Telugu Global
Telangana

పశువుల కొట్టాలకు, ఫాం హౌజ్ లకు తేడా తెలియదా..?

తన ఇద్దరు కుమార్తెలు విదేశాల్లో చదువుకుని, విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారని, మేజర్లు అయిన వారు స్వార్జితంతో చండూరులో చట్టబద్దంగా భూములు కొంటే దానిపై కూడా అక్కసు ఎందుకని ప్రశ్నించారు మంత్రి నిరంజన్ రెడ్డి.

పశువుల కొట్టాలకు, ఫాం హౌజ్ లకు తేడా తెలియదా..?
X

తమకి ఉన్న ఆస్తులు, వ్యవసాయ భూములపై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు చేసిన ఆరోపణలు పూర్తి అవాస్తవం అన్నారు తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి. పశువుల కొట్టాలు, కూలీల రేకుల షెడ్లు కూడా ఫాంహౌజ్ లుగా కనిపిస్తే అది ఆయన అజ్ఞానానికి నిదర్శనం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవి కేవలం రాజకీయం కోసం చేసిన ఆరోపణలేనని తిప్పికొట్టారు. తన స్వగ్రామం పాన్ గల్ లో తనకు ఉన్నట్టుగా చెబుతున్న భూములు 2014, 2018 ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్నవేనన్నారు. ఆ వ్యవసాయ క్షేత్రంలో ఉన్న ఇల్లు తన భార్య సొంత డబ్బులు, బ్యాంకు లోనుతో కట్టుకున్నామని వివరణ ఇచ్చారు.

నా కుమార్తెల సంపాదనపై కూడా ఏడుపా..?

తన ఇద్దరు కుమార్తెలు విదేశాల్లో చదువుకుని, విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారని, మేజర్లు అయిన వారు స్వార్జితంతో చండూరులో చట్టబద్దంగా భూములు కొంటే దానిపై కూడా అక్కసు ఎందుకని ప్రశ్నించారు మంత్రి నిరంజన్ రెడ్డి.

ఎస్టీల పేరుపై రిజిస్ట్రేషన్ చేయించి, తర్వాత మంత్రి కుటుంబ సభ్యుల పేర్లపైకి భూములను మార్చుకున్నారని కూడా రఘునందన్ రావు ఆరోపించారు. దీనికి కూడా నిరంజన్ రెడ్డి సమాధానమిచ్చారు. తల్లితండ్రులను కోల్పోయిన గౌడ నాయక్ అనే అబ్బాయిని తాము చిన్నప్పుడే చేరదీశామని, అతను తమ కుటుంబసభ్యుడిలానే ఉండేవాడని, ఆ విషయం నియోజకవర్గం మొత్తం తెలుసన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి. తమ పిల్లలు కరోనా కారణంగా భారత్ కి రాలేని పరిస్థితుల్లో తమ ఇంటి వ్యవహారాలు చూసుకునే గౌడ నాయక్ పేరుమీద భూములు రిజిస్ట్రేషన్ చేసి, ఆ తర్వాత అది తమ పిల్లల పేరు మీదకు మార్చుకున్నామని ఇందులో తప్పేముందన్నారు.

పెద్దమందడి మండలం మోజెర్లలో 50 ఎకరాల భూమి తమకు ఉందంటూ రఘునందన్ రావు చేసిన ఆరోపణలు అవాస్తవం అన్నారు నిరంజన్ రెడ్డి. లండన్ లో డాక్టర్ గా పనిచేస్తున్న తన మరదలు కవిత, వారి స్నేహితులకు అక్కడ 11.20 ఎకరాలు భూమి ఉందని వివరణ ఇచ్చారు. కనీస సమాచారం లేకుండా రఘునందన్ రావు గుడ్డి ఆరోపణలు చేయడం అవివేకం అన్నారు నిరంజన్ రెడ్డి. దురుద్దేశపూర్వకంగా ఆయన చేసిన ఆరోపణలపై చట్టపరంగా ముందుకెళ్తానని హెచ్చరించారు.

నీకు నచ్చినవాళ్లతో సర్వే చేయించు..

ఆ మూడు వ్యవసాయ క్షేత్రాలను తనకు ఇష్టం వచ్చినవారితో రఘునందన్ రావు సర్వే చేయించుకోవచ్చని చెప్పారు నిరంజన్ రెడ్డి. న్యాయంగా చట్టప్రకారం కొనుగోలు చేసిన దానికన్నా ఒక్క గుంట ఎక్కువ ఉన్నా ఆ భూములను తమ పిల్లలు వదిలేస్తారన్నారు. తాను కూడా పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. ఆరోపణలు నిరూపించలేకపోతే.. రఘునందన్ రావు రాజీనామా చేయాలన్నారు.

తహశీల్దార్ కార్యాలయంలో అగ్నిప్రమాదం జరిగిందని, తమకు సంబంధించిన సాక్ష్యాలన్నీ తగలబడిపోయాయంటూ నీఛమైన ఆరోపణలు రఘునందన్ రావు చేశారని, అదే నిజమైతే.. ఆ రికార్డుల నకళ్లు.. జిల్లా స్థాయిలో, సీసీఎల్ఏ లో కూడా ఉంటాయని.. తనిఖీ చేసుకోవాలని చెప్పారు. ఆ కనీస పరిజ్ఞానం కూడా రఘునందన్ రావుకి లేకపోతే ఎలా అని ప్రశ్నించారు.

రాజకీయంగా ఎదుర్కోలేకే..

తనను రాజకీయంగా ఎదుర్కొనే శక్తి లేక బురదజల్లే కార్యక్రమం మొదలుపెట్టారని మండిపడ్డారు మంత్రి నిరంజన్ రెడ్డి. గత ఎన్నికల సమయంలోనూ ఇలాంటి ప్రచారమే చేశారని, ఇప్పుడు కూడా అదే మొదలు పెట్టారన్నారు. 40 ఏళ్ల న్యాయవాద, రాజకీయ చరిత్రలో అక్రమాలకు, తప్పుడు పనులకు తానెప్పుడూ పాల్పడలేదన్నారు. రఘునందన్ రావు భేషరతుగా క్షమాపణ చెప్పాలని, లేకపోతే చట్టబద్ధమైన చర్యలకు సిద్దంగా ఉండాలన్నారు. బ్లాక్ మెయిల్ రాజకీయాలకు తానెప్పుడూ భయపడేది లేదన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి.

First Published:  18 April 2023 3:56 PM GMT
Next Story